టమాటా చిట్టిదే… చరిత్ర పెద్దది….

Feb 16,2025 09:26 #Articles, #Sneha

కూర వండాలంటే మొదటగా గుర్తుకొచ్చే కూరగాయ టమాట. ప్రతికూరలో ఒక్క టమాటా అయినా వేయకపోతే అసలు కూర తిన్నట్టుగా అనిపించదు చాలామందికి. చూడగానే అనేక రంగుల్లో, మృదువుగా, ఆకర్షణీయంగా, సిమ్లా యాపిల్‌లా కనిపిస్తూ ఊరిస్తుంది. అయితే ఎక్కువగా కూరల్లో వేసుకునే ఈ టమాటాను చాలా రకాల ఆహార పదార్థాల తయారీకి వాడతారు. సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క నుంచి వచ్చే పళ్లే టమాటాలు. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్న రుచికరమైన టమాటాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మనదేశం రెండో స్థానంలో ఉందంటే సామాన్యులు ఎంతలా దీన్ని వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. అందుకే వీటిధర అమాంతం పెరిగినప్పుడు జనాలు అల్లాడిపోతారు. అసలు ఈ టమాటా మన దేశానికి ఎలా వచ్చింది? ఎన్ని రకాలు? దీని గుణాలు ఏంటో తెలుసుకుందాం.

మార్కెట్‌కు వెళ్లగానే మొదట తీసుకునే కూరగాయ టమాట. ఆ తర్వాతే ఏదైనా కొనుగోలు చేస్తాం. ఎందుకంటే.. ఏ కూరలోనైనా ఇది ఇట్టే కలిసిపోతుంది. టమాటా వేస్తే ప్రత్యేక రుచితో పాటు, కూర కూడా మరింత అవుతుందని ఆలోచన. అందుకే కూరగాయల్లో టమాటా మహారాణి. ఇంతలా వంటల్లో తన ప్రత్యేకస్థానం సంపాదించుకున్న టమాటా శాస్త్రీయనామం సోలనమ్‌ లైకోపెర్సికమ్‌. ఇందులో ఉండేది 95 శాతం నీరే. మిగతా ఐదు శాతంలో మేలిక్‌, సిట్రిక్‌ యాసిడ్లు, గ్లూటామేట్లు, విటమిన్‌ సీ, లైకోపీన్‌ లాంటి పోషకాలు ఉంటాయి. మనకు తెలిసిన టమాటాలు ఎర్రగా కనిపించడానికి వీటిల్లో ఉండే లైకోపీనే కారణం. అయితే ఇంకా అనేక రంగుల్లోనూ ఈ టమాటాలు లభిస్తున్నాయి.
మనదేశానికి ఇలా..
టమాటాలను క్రీ.శ.700లలోనే దక్షిణ అమెరికాలోని ఆండీస్‌ పర్వతశ్రేణుల్లో పండించినట్లు ”హిస్టరీ ఆఫ్‌ టొమాటో: పూర్‌ మ్యాన్స్‌ ఆపిల్‌” పేరుతో ఐవోఎస్‌ఆర్‌ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో బోటనిస్టు రవీ మెహతా పేర్కొన్నారు. ఆ తర్వాత పెరూ, బొలీవియా, చిలీ, ఈక్వెడార్‌ అటవీ ప్రాంతాల్లో టమాటాలు పండేవి అని ఆయన తన పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. వలసల కారణంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈ టమాటా పంట వ్యాప్తి చెందింది.
టమాటాలను భారత్‌కు పరిచయం చేసింది పోర్చుగీసువారని ఫుడ్‌ హిస్టారియన్‌ కేటీ అచ్చయ్య తన పుస్తకం ‘ఇండియన్‌ ఫుడ్‌: ఎ హిస్టారిల్‌ కంపానియన్‌’ లో తెలిపారు. మనదేశంలో నేలలు, ఉష్ణోగ్రతలు టమాటా పంటకు అనువుగా ఉంటాయి. బ్రిటిషర్ల పాలనా కాలంలో ఈ పంట విస్తీర్ణం మరింత పెరిగింది. అప్పట్లో చాలా చిన్నవిగా ఉండే టమాటాలు పుల్లగా ఉండేవి. కూరల్లో చింతపండుకు బదులుగా ఒకటి, రెండు టమాటాలు వేసేవారు. కాలానుగుణంగా టమాటా పరిణామం మారుతూ వచ్చింది.. వాడకమూ మారింది.


సాగు.. డిమాండ్‌..
టమాటాను రోజువారీ వంటకాల్లో వేయడంతో పాటు, విదేశీ వంటకాల్లో తప్పనిసరిగా టమాటా ఉండాల్సిందే. ఈ క్రమంలో టమాటాకు డిమాండ్‌ పెరిగింది. దాంతో సీజన్‌వారీగా పండించే టమాటాను దాదాపు సంవత్సరం మొత్తం పండించేలా విత్తనాల సంకరణ జరిగింది. టమాటా సాగుకు వెచ్చని వాతావరణం అవసరం. మనదేశంలో టమాటా విత్తనాలను మార్చి, ఏప్రిల్‌ నెలల్లో నాటతారు. వేసవి చివరిలో కోస్తారు. నాటిన తర్వాత 70 రోజులకు మొక్కలు దిగుబడిని ఇస్తాయి.
మనదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద టమాటా ఉత్పత్తిదారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, తెలంగాణ, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌ ప్రధాన టమాటా ఉత్పత్తి రాష్ట్రాలుగా ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌ 20% వాటా కలిగి ఉంది. దీని తరువాత గుజరాత్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి.

రకరకాల ఆకృతుల్లో
టమాటా అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి ఇది తట్టుకోలేదు. ఈ నేపథ్యంలో అనేక రకాల టమాటా విత్తనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. ఆయా దేశాల్లో అనువైన వాతావరణానికి, నేలకు తగిన హైబ్రీడ్‌ విత్తనాలు సృష్టించారు. ప్రపంచంలో 15,000 కంటే ఎక్కువ రకాల టమాటాలు ఉన్నాయి. దేశంలో 1000 రకాల టమాటాలు పండిస్తారు. అయితే, కొన్నిరకాల టమాటాలు మాత్రమే వాణిజ్యపరంగా ఎగుమతులు, దిగుమతులు సాగుతున్నాయి. మరికొన్ని రకాలు స్థానికంగా నిల్వపచ్చళ్లు, వంటకి, సాస్‌, జామ్‌ల తయారీలో ఉపయోగిస్తున్నారు. తెగుళ్లను తట్టుకునేలా తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చేలా కొన్ని సంకరజాతి రకాలు మార్కెట్‌లోకి వచ్చాయి.. వాటిలో కొన్ని…
అర్కా అభిజిత్‌ : ఇది ఎర్రగా, గుండ్రంగా ఉంటుంది. ఐఐహెచ్‌ఆర్‌ బెంగళూరు అభివృద్ధి చేసిన అధిక దిగుబడినిచ్చే ఎఫ్‌1 హైబ్రీడ్‌ టమాటా రకం పండ్ల బరువు దాదాపు 65-70 గ్రాములు. 140 రోజుల్లో సగటు దిగుబడి హెక్టారుకు 65 టన్నులు.
అభినవ్‌ : పొడవుగా, ఎక్కువ కండ ఉండి, ఎర్రగా ఉంటాయి. నాటిన 60-65 రోజుల తర్వాత దిగుబడి వస్తుంది. దీనిని ఖరీఫ్‌, రబీ సీజన్లలో సాగు చేస్తారు. ఈ రకం సుదూర రవాణాకు అనుకూలంగా ఉంటుంది. సింజెంటా కంపెనీ తయారుచేసిన టమాటా వెరైటీ.
నాంధారి : దీనిని దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలలో సాగు చేస్తారు. త్వరగా పక్వానికి వచ్చే హైబ్రీడ్‌ రకం టమాటా. ఇవి పొడవుగా, పెద్దగా ఉంటాయి. ఈ రకం టమాటా బరువు దాదాపు 80-90 గ్రాములు. విత్తే నెల ఆగస్టు నుండి అక్టోబర్‌ వరకూ ఉంటుంది.
రష్మి : రష్మి ఒక అనుకూల హైబ్రీడ్‌ రకం. ఈ రకం టమాటా దాదాపు 90 గ్రాముల బరువు ఉంటుంది. నీటి శాతం తక్కువ, గుజ్జు ఎక్కువ ఉంటుంది. నాటిన 70 రోజుల తర్వాత పండుతుంది. ఇది ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
వైశాలి: వైశాలి అనేది మధ్యస్థ పరిమాణంలో (100 గ్రా), అధిక నాణ్యత గల టామాటా. ఇది రసం ఎక్కువగా ఉంటుంది. జామ్‌, సాస్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమకు అనుకూలంగా ఉంటుంది.

అర్కా వికాస్‌ : లేత ఆకుపచ్చ చారలతో ఉండే హైబ్రీడ్‌ రకం టమాటా. చదునైన, మధ్యస్థ-పెద్ద (8-90 గ్రా) పండును కలిగి ఉంటుంది. పండినప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది.
రూపాలి : ప్రతికాయకూ చక్కటి గట్టికాడ కలిగి ఉండే టమాటా హైబ్రీడ్‌ రకం. ఇది ఒక్కో కాయి 100 గ్రాముల బరువు ఉంటుంది. అధిక నాణ్యత గల మధ్యస్థ పరిమాణంలో టమాటా పండ్లను ఉత్పత్తి చేస్తుంది. కూరకు వినియోగిస్తారు.
అర్కా శ్రేష్ట్‌ : అర్కా శ్రేష్ట్‌ అనేది ఐఐహెచ్‌ఆర్‌ బెంగళూరు అభివృద్ధి చేసిన అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్‌ టమాటా రకం. ఇది 70-75 గ్రాములు. దీని నిల్వ కాలం 17 రోజులు ఉంటుంది. మరియు దీని రవాణా సులభం అవుతుంది. ఖరీఫ్‌/రబీ సీజన్‌లో సాగు చేయబడుతుంది.
అర్కా వర్ధన్‌ : ఎరుపుగా, గుండ్రంగా పెద్దసైజుల్లో ఉంటాయి. ఇది కూడా ఐఐహెచ్‌ఆర్‌ బెంగళూరు అభివృద్ధి చేసిన హైబ్రీడ్‌ రకం. ఈ పండ్ల బరువు దాదాపు 140 గ్రాములు. ఖరీఫ్‌ / రబీ సీజన్‌లో సాగు చేస్తారు. 160 రోజుల తర్వాత పరిపక్వం చెందుతాయి.
అర్కా విశాల్‌ : పెద్దగా, నొక్కులు కలిగి ఒక్కో కాయి 140 గ్రాముల బరువు ఉంటాయి. ఈ టమాటా జ్యూస్‌లకు వినియోగిస్తారు. దీనిని ఖరీఫ్‌ / రబీ సీజన్‌లో పండిస్తారు. ఇవి 160 రోజుల్లో పక్వానికి వస్తాయి.
పూసా ఎర్లీ డ్వార్ప్‌ Û: ఐఎఆర్‌ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసిన హైబ్రీడ్‌ రకం. ఇది త్వరగా పక్వానికి వస్తాయి. నాటిన 75-80 రోజుల తర్వాత కోతకు సిద్ధమవుతాయి. ఈ రకాన్ని వంటకు, సాస్‌ తయారీకి వినియోగిస్తారు.
పూసా రూబీ : ఇది త్వరగా పక్వం చెందే రకం. శీతాకాలం, వేసవి రెండింటిలోనూ విత్తడానికి అనుకూలమైనది.
పూసా గౌరవ్‌ : ఈ రకమైన టమాటా పండ్లను సుదూర రవాణాకు కూడా ఉపయోగిస్తారు. మంచి నాణ్యత కారణంగా ఈ రకం వ్యాపార ప్రయోజనాల కోసం అనుకూలంగా ఉంటుంది.
మారుతమ్‌ : ఈ రకం కాయలు లేత ఆకుపచ్చ రంగులో, గుండ్రంగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చిలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతలకు అనువైనవి.
ఇవే కాకుండా పొద రకాలు పూసా ఎర్లీ డ్వార్ష్‌, పూసా గ్రారావ్‌, పూసా సాదబాహర్‌, రత్న రూపాలు, అవినాష్‌ 2, కో3, హిస్సార్‌ లలిమ, రజని, రోమా మొదలైనవి పొద రకాలు సాగు చేస్తున్నారు. తీగజాతిగా అర్క సొరబ్‌, ఆర్క వికాస్‌, పూసా రూబీ, పూసా ఉపహల్‌, పంత్‌ మహల్‌, పూసా దివ్య రకాలు రైతులు పండిస్తున్నారు. ఇలా టమాటా చిట్టిదేకానీ, దీని చరిత్ర చాలా ఉందండోరు!
టమాటాలను కూరల్లోనే కాకుండా సలాడ్‌ల తయారీలో.. శాండ్‌విచ్‌లలో పచ్చివి తీసుకోవడం.. కెచప్‌లు, సూప్‌లు, సాస్‌ల తయారీ.. ఊరగాయల తయారీ.. మరికొన్ని రకాల ఆహార పదార్థాల తయారీలో వీటి వినియోగం గణనీయమని చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం టమాటా నిల్వ పచ్చడి ప్రతి ఇంటా ఉండాల్సిందే. టిఫిన్‌లలో, కూరతో పనిలేకుండా వేడివేడి అన్నంలోకి ఇష్టంగా తినాల్సిందే. ఇంతటి చరిత్ర ఉన్న టమాటా అంటే అందరికీ ఇష్టమే కదా!

ఆరోగ్యానికి మేలు
టామాటాలో ఉండే పొటాషియం, సోడియం గుండె పనితీరును మెరుగు పరుస్తాయి. రక్తపోటును సమతుల్యం చేస్తాయి. లైకోపీన్‌, లుటిన్‌, బీటా కెరోటిన్‌, యాంటీఆక్సిడెంట్లు కంటిచూపును కాపాడతాయి. లైకోపీన్‌ సహజ యాంటీఆక్సిడెంట్‌, ఇది చర్మ సంరక్షణను మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది. టమాటాలో ఉండే విటమిన్‌ సి, బీటా-కెరోటిన్‌, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, క్యాన్సర్‌ను అడ్డుకుంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపుచేస్తుంది. విటమిన్‌ కె రక్తం గడ్డకట్టడానికి, గాయం త్వరగా నయంకావడానికి తోడ్పడుతుంది. ఫైబర్‌ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో టమాటా సహాయపడుతుంది.

– వీర

➡️