వృక్ష విధ్వంసకాండ

Feb 2,2025 09:40 #Plant destruction, #Sneha

ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నకొద్దీ
నాలో ఏదో తెలియని ఆనందం
హృదయాంతరాళం సముద్రకెరటంలా ఉప్పొంగుతుంది
ఎందుకబ్బా ఈ పరవశం..
బహుశా, నా ఆప్తమిత్రుని
కలవబోతున్నందుకు కావచ్చు
దగ్గరికెళ్తున్న కొద్దీ నాలోని ఉత్సాహం
పొయ్యిమీది పాలపొంగులా ఉరకలేస్తుంది

ఇదిగో వచ్చా..
ఏదీ నా ప్రాణవాయువు?
మళ్ళీ నీ రాకకై ఎదురుచూస్తుంటానని
వీడ్కోలు పలికిన మిత్రుడేడి!?
బరువెక్కిన శ్వాసతో ఇంకొంచెం ముందుకెళ్ళా
నాకు ఆశ్రయం ఇచ్చి
అలసిన నా మేనుకు అలసట తీర్చిన
నా ప్రాణసఖుడు కానరాడే!
ఇక్కడే.. సరిగ్గా ఇదేచోట
తన మధురగానంతో
నా మనసు తేలికచేసిన మిత్రుడు లేడు
ఏదో నిరుత్సాహం
కారుమబ్బులా కమ్ముకుంది
ఏదో తెలియని అలజడి
మనసంతా నిండుకుంది
అయినా ఏ మిత్రుడు కానరాలేదు
ఏదో జరుగుతుందని అర్థమయింది
అయినా ఆశతో వడివడిగా
నాలుగడుగులు ముందుకేసి
అటు చూశా..
నా ప్రాణసఖులు
అదృశ్యమవుతున్న దృశ్యం

ఒక్కసారిగా…
నా ఉచ్ఛ్వాసనిశాÛ్వసలు వేడెక్కాయి
నా గుండె కూడా బరువెక్కింది
నా మిత్రుని అంగాంగాలను తెగ నరుకుతూ
ప్రపంచ మార్కెట్‌కు తరలిస్తున్న
ఓ తరు హంతకుడా!?
నీ అపార్టుమెంట్ల కోసం
నీ స్వార్థం కోసం
వృక్ష విధ్వంసకాండ రచిస్తున్నావా?

నిస్తేజంగా మోడుబారిన
నా మిత్రుని కళేబరాన్ని
బిగ్గరగా కౌగిలించుకొని
ఐదడుగులు ముందుకేసా
మళ్ళీ నా మనసు సిగ పరిమళించింది
వనం – మనం అంటూ
మొక్కలు నాటుతున్న సుందరదృశ్యం

అయినా.. ఇప్పుడు
మొక్కను భూమిలో కాదు.
మనిషి గుండెలో నాటాలి.

నీలం వెంకటేశ్వర్లు
9502411149

➡️