పల్లె బతుకుల ‘మడకెద్దులు’

Jan 12,2025 07:41 #book review, #Sneha

విస్తరిస్తున్న పట్టణం పక్కలో మిగిలిన కాస్త భూమిలో వ్యవసాయం యెంతోకాలం సాగదు. పొలాల్ని ఇళ్ల స్థలాలుగా మారనివ్వకుండా అడ్డుకోవడం అసాధ్యమైపోయింది. పట్టణాల ఇబ్బందులన్నీ పల్లెలకూ వ్యాపించాయి. ఈ పరిణామ క్రమాన్నంతా కథల రూపంలో ‘మడకెద్దుల’ పుస్తకాన్ని రచయిత పేరూరు బాలసుబ్రమణ్యం తీసుకువచ్చారు. శ్రామికుల అసౌకర్యాలు, కష్టాలూ వారి జీవితాలను అతలాకుతలం చేస్తాయి. అవి సృజనాత్మక రచయితకు గొప్ప ముడి పదార్థాన్నిస్తాయి అని ఈ కథలను చదివితే అర్థమవుతుంది.
అమెరికాలో మార్క్‌ట్వయిన్‌, ఇంగ్లాండులో చార్లెస్‌ డికెన్స్‌లాంటి మహా రచయితలకు సామాన్య ప్రజల యాతనలే- వారి రచనలకు ముడి సరుకు. అలాగే తిరుపతి చుట్టూ అల్లుకున్న పల్లె ప్రజల జీవన స్థితిగతులన్నీ బాలసుబ్రమణ్యం కథలుగా రాశారు. రెండు, మూడు కథలు తప్పా, ప్రతికథా ఆ ప్రాంత పల్లెప్రజల కష్టాలు తెలుసుకున్న అనుభూతి కలుగుతుంది.
ప్రస్తుతం అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య తగ్గిపోతోంది. అయినా మగపిల్లలే కావాలని పోరుపెట్టే సమాజంలో మనమున్నాం. అటువంటి వారికి మన’వరాలే’ కథ – ఆడపిల్లల విలువ తెలిపింది. సహజంగా ఆవులకు కోడెదూడ పుడితే ఇంట్లో పాడి ఉంటుందని సంతోషిస్తారు. అదే దున్నపోతు పుడితే బాధపడతారు. ఈ తేడాను గ్రహించిన పదేళ్ల అఖిల ‘మనిషికో న్యాయం.. గొడ్డుకో న్యాయమా?’ అంటూ అవ్వను ప్రశ్నించిన తీరు ‘వారసుడు కావాలి’ అని పేచీ పెట్టేవారందరికీ కనువిప్పు కలిగిస్తుంది.
కరోనా సమయంలో శ్రామికులంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో మనకు తెలిసిన ఓ కష్టం ‘మల్లి’ కథగా రచయిత రాశారు. పిల్లలకి రెండుపూటలా అన్నం పెట్టేందుకు బతుకుదెరువు కోసం మల్లి పడే వేదన అంతాఇంతా కాదు. మహిళలపై పని ప్రదేశాల్లో జరుగుతున్న అత్యాచారాలపై ఎలా ప్రతిఘటించాలో రచయిత చెప్పిన తీరు గొప్పగా ఉంది. పేదవాళ్లైన ఆత్మాభిమానం ఎంత మెండుగా ఉంటుందో మల్లి పాత్ర ద్వారా చూపించారు.
ఎవరైనా ఎంత ఎత్తుకు ఎదిగినా.. నిలబడేది నేల మీదే అన్నది మర్చిపోకూడదు. అలాగే విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నవారు – కన్న తల్లిదండ్రులను, పుట్టిన ఊరిని మరవకూడదు. విదేశాల్లో ఉన్న బిడ్డల కోసం ఎదురుచూసే వృద్ధ తల్లిదండ్రులు మనదేశంలో ఎందరో. కనీసం వారిని పలకరించే దిక్కు కూడా ఉండటం లేదు. ఎందుకని ప్రశ్నించుకుంటే ‘బిజీ, పని ఒత్తిడి’ అని ఎవరికి వారే తృప్తిగా అబద్ధం చెప్పుకుంటున్నారు. డబ్బు సంపాదనలో పడి, కన్నవారిని మరిచిపోవడం అనేది నేలవిడిచి సాము చేయడమే. అమ్మనాన్నల విలువ తెలుసుకున్న ఓ కొడుకు ‘ఆట గదరా శివా!’ కథలో విదేశాల నుంచి భార్యాబిడ్డలతో ఇండియాకు వస్తాడు. కానీ ఇంటిదగ్గర ఊహించని దృశ్యం పాఠకుల కళ్లను చెమరుస్తాయి. అలాగే ‘శిశిర స్వప్నం’ కథ కూడా ఇటువంటిదే. మానవ సంబంధాలను ఉద్దేశించిందే. ఆస్తి కావాలని కొడుకులు, కోడళ్లు ఎదురుచూస్తే – తాత బాగుండాలని మనవ సంతానం కోరుకుంటారు. చాలామంది తల్లిదండ్రులకు వయస్సులో ఇచ్చినంత గౌరవం- వృద్ధులయ్యాక ఇవ్వడం లేదని, దాన్ని భవిష్యత్తులో సరిదిద్దుకునే దిశగా అడుగువేయాలని సూచించారు. కారణాలు ఏవైనా మనుషుల్లో మానవత్వం తగ్గిపోతుందని రచయిత ఆవేదన ఈ కథలో స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రతి ఒక్కరికీ ‘మన పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువు చదవాలి’ అని కోరిక ఉంటుంది. దానికోసం అపార్ట్‌మెంట్లలో, బహుళ అంతస్తులలో ఇరుకిరుకు గదుల్లో, గాలీ వెలుతురు లేని కార్పొరేట్‌ స్కూళ్లకు పిల్లల్ని పంపిస్తున్నారు. అక్కడ ఆడుకునే స్థలం ఉండదు. వ్యాయామం ఉండదు. రోజంతా బట్టీకొట్టిస్తారు. బండెడు పుస్తకాల సంచితో నడుం విరిగిపోతున్నా.. పట్టించుకునే యాజమాన్యం ఉండదు. ‘లక్షలు పోసి చదివిస్తున్నాం.. మంచి ర్యాంకులు తెచ్చుకోవాలి’ అనే తల్లిదండ్రులు, యాజమాన్యం కలిసి పిల్లలను నిత్యం మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నారు. ర్యాంకులెప్పుడు విద్యార్థులకు ‘కొలబద్ద’ కాకూడదు అని రచయిత చాలా చక్కగా కథలో వివరించారు.
కష్టం చేసుకుని బతికే పల్లె బతుకుల్లో మద్యం ఓ బలహీనత. తాగుడికి బానిస అయితే కుటుంబాలు ఎలా నాశనం అవుతాయో రచయిత ‘మునిగోడు’ కథ ద్వారా తెలియజేశారు. ఇలా ‘కోడిగుడ్డు పొరుటు, ‘గాలెమ్మ’, ‘మొలక’ కథలు చదివినప్పుడు గ్రామల్లో పెరిగినవారికి తమ బాల్యం గుర్తురాక మానదు. ఉదయాన్నే కనిపించే పల్లె అందాలు, వినిపించే అమాయక ప్రజల మాటలు ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి.
ఒకప్పుడు సేద్యం చేయాలంటే ఎద్దులు ఉండాల్సిందే. వాటిని కుటుంబంలో సభ్యుల్లా కలుపుకునేవారు. అంతగా రైతులు బహు ప్రేమగా, కన్నబిడ్డల్లా చూసుకునేవారు. ”లక్ష్మి, భీముడు, రాముడు, చిన్నోడు, పెద్దోడు” అంటూ వాటికి పేర్లు కూడా పెట్టుకుని ముద్దుగా పిలుచుకునేవారు. పశువులతో రుణం ఎప్పటికీ తీరిపోదు. వాటిని కొనాలన్నా, అమ్మాలన్నా పశువులతో మచ్చిక చేసే కిష్టయ్యలాంటి రైతు ప్రతిగ్రామంలోనూ ఉంటారు. నోరులేని పశువులకు, మనుషులకు మధ్య పెనవేసుకున్న బంధాన్ని ‘మడకెద్దులు’ కథలో రచయిత చూపించారు. ఈ కథా శీర్షికనే పుస్తకానికి పెట్టడం రైతుకు మరింత ప్రాధాన్యతను ఇచ్చినట్లు అయ్యింది. ఇలా ప్రతికథా పల్లెవాసనతో మమైకమైనదే.

రచయిత : పేరూరు బాలసుబ్రమణ్యం
టైటిల్‌ : మడకెద్దులు
పేజీలు : 141
ధర : 150/-
ఫోన్‌ : 98492 24162

– వీర
94905 59477

➡️