ఓటు దీటైన ఆయుధం

Jan 19,2025 06:17 #Sneha, #special story, #voters day

‘బుల్లెట్‌ కంటే బ్యాలెట్‌ శక్తివంతమైనది’ అంటారు అబ్రహాం లింకన్‌. ఓటు ప్రజాస్వామ్యానికి పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే సాధనం. ప్రజల భవిష్యత్తును నిర్ణయించే శక్తిమంతమైన ఆయుధం. ఉన్నతమైన పాలకులను ఎన్నుకునేందుకు రాజ్యాంగం (ఆర్టికల్‌ 326) మనకు కల్పించినదీ ఓటు హక్కు. డబ్బు, మద్యం, ఇతర ప్రలోభాలకు లొంగని ఓటు నిజమైన ప్రజాస్వామ్యాన్నిస్తుంది. ఓటుకు కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం తగదు. ఇంతటి మహోన్నతమైన ఓటు ఎందుకు నిరుపయోగమవుతోంది? ఈ అవగాహనే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో కలిగించాలనేది ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ ఉద్దేశ్యం.

ఓటు విలువ తెలియజేసి, వారి హక్కును సద్వినియోగపరుచుకునే అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం.

థీమ్‌..
‘యువ ఓటర్ల సాధికారత, భవిష్యత్తు’ పై దృష్టి పెట్టాలి అనేది ఈ సంవత్సరం థీమ్‌. యువత వారి ఓటు విలువను అర్థంచేసుకుని గుర్తించాలని.. వారి ఓటు వినియోగించుకోవటంలో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించేందుకు ప్రోత్సహించాలనేది ఈ థీమ్‌ ఉద్దేశ్యం.

మొట్టమొదట మన దేశంలో 2011 జనవరి 25న ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నాం. అసలు ఓటు అంటే ఏమిటి.. ఎందుకు వెయ్యాలి.. దానివలన ఉపయోగమేమిటి అనే విషయాలు ఎంతమందికి తెలుసు? ‘ఓటు విలువనూ తెలుసుకోండయ్యా / పూట తిండికీ లొంగవద్దయ్యా’ లాంటి పాటలు విని ఆనందిస్తామే కానీ ఆచరిస్తున్నామా..? కనీసంగా ఆలోచిస్తున్నామా? మన అలసత్వం వల్లనే ప్రజాస్వామిక విలువలు దిగజారిపోతున్నాయన్నది నిజం. కొన్ని దశాబ్దాలుగా ఓటు అమ్మకపు సరకుగా మారిపోయింది. లాంఛన ప్రాయంగా మొదలైన అవినీతి.. లంచాల రూపుదాల్చింది. గుట్టుచప్పుడు కాకుండా గూట్లో పెట్టి వెళ్ళే స్థాయి నుంచి, ఓటుకింత అని లెక్కగట్టి బహిరంగంగా ఓటరు చేతికి ఇచ్చే స్థాయికి దిగజారింది.

నిర్మాణంలో నిర్దిష్టత..
ఓటు శక్తిమంతమైనదని చెప్పుకోవడమే కానీ సామాన్యునికి దాని లోతుపాతుల అవగాహన లేదు. దాంతో ఎన్నికల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్స్‌ వేసేటప్పుడే సెక్యూరిటీ డిపాజిట్‌ పే చేస్తారు. అప్పుడే అభ్యర్థి ఆదాయం, ఆస్తులు, అప్పులు, ఎడ్యుకేషన్‌ క్వాలిఫికేషన్స్‌, క్రిమినల్‌ కేసుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ కూడా సబ్‌మిట్‌ చేయాలి. ఈ వివరాలన్నీ ప్రజలకు తెలిసేలా పబ్లిక్‌ డొమైన్స్‌లో ఉంచాలి. ఇవన్నీ తెలిసినప్పుడే వివేకంతో సరైన అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది ప్రజలకు. ఒకవేళ ప్రతి ఒక్కరికీ అలా తెలుసుకునే సౌలభ్యం లేకపోతే https://affidavit.eci.gov.in/ అనే వెబ్‌సైట్‌లో వారి వివరాలు చూడవచ్చు. నేటి పరిస్థితుల్లో ఈ నిబంధనలన్నీ సరిగా అమలు జరిగేలా యువత నడుం బిగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డెమోక్రసీ ఇన్‌ యాక్షన్‌..
ఓటు వేశామంటే అధికారికంగా చట్టబద్ధమైన మన పనులు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికైన వారికి ఉందని మనం గ్రహించాలి. ఎవరి ఓటు వారి వాయిస్‌ కావాలి. అది ధీటుగా ఉండాలేగానీ మొరటుగా ఉండకూడదు. కానీ రానురాను ఇంగితం మరచి.. గద్దెనెక్కించిన ప్రజల బాధలను విడిచి.. ఒకరి మీద ఒకరు అసభ్యకరంగా దూషించుకుంటున్న అప్రజాస్వామ్యాన్ని ప్రతిసారీ చూస్తున్నాం.
బ్యాలెట్‌ బాక్సుల సమయంలో బలమైన వర్గం వచ్చి ప్రజలపై దౌర్జన్యం చేసి, వారికి అనుకూలమైన పార్టీకి ఓటు వేసేవారు. వీటిని అధిగమించాలనే ఉద్దేశ్యంతోనే 1982లో ఇవిఎం (ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)లు, వివిపాట్‌లు ప్రవేశించాయి. ఇవిఎం ఓట్లను స్టోర్‌ చేసి, లెక్కిస్తుంది. ఓటును సరిగా వేశామా లేదా అని మనం నిర్ధారించుకునేందుకు వివిపాట్‌ (ఓటర్‌ వెరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌) లు సహకరిస్తాయి.

ఏది కూడదో అవే చేతలు..
ఇంత పకడ్బందీగా ఉన్న ఎన్నికల నిర్మాణం అమలులో భ్రమలే మిగిలాయి. ఏది కూడదో అవన్నీ సజావుగా జరిగిపోతున్నాయి. వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు (అప్పటికి అధికారంలో ఉన్నవారు కూడా) ప్రభుత్వ వాహనాలు, వస్తువులు ఉపయోగించకూడదు. ప్రభుత్వ ఖర్చుతో ప్రకటనలు, ప్రచారాలు చేయకూడదు. ఎలక్షన్‌ కోడ్‌ రిలీజ్‌ అయిన తర్వాత పథకాలు, ప్రాజెక్టులను ప్రకటించకూడదు. ఆర్థికపరమైన తాయిలాలు ఇవ్వకూడదు. అతిక్రమించిన వారికి ఎలక్షన్‌ కమిషన్‌ షోకాజ్‌ నోటీసులు ఇవ్వటం, తొలగించటం లాంటివి చేసే అవకాశం ఉంది. ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నప్పుడు రూ. 50,000 లకు మించి నగదు గానీ, రూ 10,000లకు పైగా విలువైన వస్తువులుగానీ సంబంధిత డాక్యుమెంట్స్‌ లేకుండా ప్రయాణీకుల దగ్గర ఉండకూడదు. ఇవన్నీ సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత ఎలక్షన్‌ కమిషన్‌దే.

సంక్షేమాల సంక్షోభం..
సంక్షేమ పథకాల ఊదరగొట్టుతనం అంతకంతకూ పెచ్చరిల్లుతోంది. అలాంటప్పుడు చూస్తూ ఊరుకోవటం మన అవివేకం కాదా? ప్రజలు నిలదీయాలి.. సంక్షేమాల సంక్షోభాన్ని తిప్పికొట్టాలి! అంతేకాదు మన అభిప్రాయాలు సోషల్‌మీడియాలో పోస్టుల రూపంలోనే కాక ఎలక్షన్‌ కమిషన్‌ తీసుకొచ్చిన ‘సీ విజిల్‌’ యాప్‌ ద్వారానూ పరిష్కరించుకోవచ్చు. అభ్యర్థి నియమాన్ని ఉల్లంఘించినప్పుడు పౌరులు ఎవరైనా సరే ఫొటోగానీ, వీడియోగానీ తీసి ఈ యాప్‌ ద్వారా ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు ఇచ్చిన వారి వివరాలు గోప్యంగానే ఉంటాయి.

సద్వినియోగ పరుచుకుందాం..
ఓటు వేసే రోజు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటిస్తాయి. ఓటు వేయడం మనందరి బాధ్యత. ఎన్నికల సంఘం 85 ఏళ్ళ కన్నా ఎక్కువ వయసున్న వారికి, వికలాంగులకు ఇంటి నుండే ఓటు వేసే అవకాశం కల్పించింది. దీనికోసం ఫారమ్‌ 12డి ని పూర్తి చేసి, ఎన్నికల సంఘానికి సబ్‌మిట్‌ చేయాలి. పోలింగ్‌ ఆఫీసర్‌, పోలీస్‌, ఫొటోగ్రాఫర్‌, ఇద్దరు అధికారుల టీమ్‌ ఇంటికి వచ్చి, ఓటు వేయించి డాక్యుమెంటేషన్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. విధి నిర్వహణ సరిగా లేకనే అనేకచోట్ల పెద్దవారిని యువకులు, పోలీసులు చేతులపై మోసుకెళ్ళటం చూస్తున్నాం.

వేలిమీది చుక్క.. వేగుచుక్క..
ఓటు వేసేటప్పుడు బ్యాలెట్‌ బాక్స్‌ దగ్గరకు వెళ్ళే ముందు ఓటరు ఎడమ చేతి చూపుడు వేలిపై ఇండెలిబుల్‌ ఇంకుతో గుర్తుపెడతారు. వెండి నైట్రేట్‌తో తయారైన ఇంకు అది. దాదాపు రెండు రోజుల వరకు చెరగదు. ఓటు ఒక్కసారి మాత్రమే వేయాలనేందుకు ఇండికేషన్‌ ఈ చూపుడు వేలిపై సూచిక. ఓటును దుర్వినియోగపరిచేవారిని గుర్తించేందుకే ఆ ఇండెక్స్‌ ఇండికేషన్‌. అందరం మన ఓటును సరిగా వినియోగించుకుందాం.

ఇసి వైఖరి..!
మన దేశం గణతంత్ర దేశంగా మారడానికి ఒక్కరోజు ముందు అంటే 1950, జనవరి 25న (ఎలక్షన్‌ కమిషన్‌) ఎన్నికల సంఘం ఏర్పాటైంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం ఏర్పడిందే ఇసి. ఇది ప్రభుత్వ నియంత్రణకు లోబడాల్సిన అవసరం లేని స్వతంత్ర వ్యవస్థ. నిస్పక్షపాతంగా, స్వేచ్ఛగా ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత కమిషనుకుంది. కేంద్ర, రాష్ట్ర పరిధుల్లో పార్లమెంటు, అసెంబ్లీ, ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్నికలు కమిషనే నిర్వహిస్తుంది. మున్సిపాలిటీ, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయితీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. దేశంలో 543 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గానికి ఒక ఎంపి, రాష్ట్రంలోని ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలకి ఒక్కో ఎంఎల్‌ఏ ప్రజల చేత ఎన్నుకోబడతారు. చదువురాని వాళ్ళు కూడా గుర్తుపట్టేందుకు వీలుగా ప్రతిపార్టీకి ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. మొదట ఓటరు వయోపరిమితి 21 సంవత్సరాలుండేది. దీనిని 1989లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకు తగ్గించారు. ఎన్నికల నిర్వహణ అప్పట్లో బ్యాలెట్‌ బాక్సుల ద్వారా.. ప్రస్తుతం ఇవిఎంల ద్వారా జరుగుతోంది. అయితే ఈ ఏడున్నర దశాబ్దాల కాలంలో ఎన్నికల ప్రక్రియలో అనేక సామాజిక, సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాలెట్‌ బాక్సుల ఓటింగ్‌ నుంచి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల దశ కొనసాగుతోంది.

– టి. టాన్య
7095858888

➡️