తియ్య తియ్యగా స్వాగతిద్దాం…

Dec 29,2024 09:50 #Cooking, #ruchi, #Sneha

పండుగలకే కాక న్యూఇయర్‌ సందర్భంగానూ నోరు తీపి చేసుకోవటం అనే ఆనవాయితీ మనకు ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ఒక వారం ముందే క్రిస్మస్‌ కేక్‌లతో ఖుషీ చేసుకుంటాం.. వచ్చే నూతన సంవత్సరానికి కొత్త తీపి రుచులు అయితే బాగుంటుంది కదా! మరి ఆ కొత్త స్వీట్స్‌ ఏమిటో?
ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.


రస్క్‌ హల్వా..
కావలసినవి : రస్క్‌లు-10, పంచదార- 3/4 కప్పు, నెయ్యి- , కిస్‌మిస్‌- 10, జీడిపప్పు- 10, యాలకుల పొడి- 1/4 స్పూను
తయారీ : రస్క్‌లను పలుకుగా మిక్సీ పట్టుకోవాలి. బాండీలో రెండు స్పూన్లు నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే బాండీలో మరో రెండు స్పూన్ల నెయ్యి వేసి, రస్క్‌ పొడిని ముదురు గోధుమరంగు వచ్చేంతవరకూ సన్న సెగపై మాత్రమే వేయించాలి. దీన్నీ గిన్నెలోకి తీసుకుని పక్కనుంచాలి. అదే బాండీలో పంచదార, రెట్టింపు నీళ్ళు పోసి గులాబ్‌జామ్‌ పాకం రానివ్వాలి. పాకం రెడీ అయిన వెంటనే యాలకుల పొడి, వేయించిన రస్క్‌ పొడి వేసి దగ్గర పడేవరకూ తిప్పుతూ ఉడికించాలి. దింపబోయే ముందు వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయాలి. అంతే నోరూరించే రస్క్‌ హల్వా రెడీ.

తెరట్టిపాల్‌..
కావలసినవి : పచ్చికొబ్బరి కాయ- ఒకటి, బెల్లం- 1/2 కేజీ, పెసరపప్పు- 50 గ్రా, బియ్యప్పిండి- 2 స్పూన్లు, యాలకులు- 10, జీడిపప్పు- 10, బాదం- 10, నెయ్యి- 1/4 కప్పు
తయారీ : ముందుగా పెసరపప్పును దోరగా వేయించుకోవాలి. చల్లారాక యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. పచ్చికొబ్బరిని చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. ఆ ముక్కల్లో తరిగిన బెల్లం, పెసరపిండి, బియ్యప్పిండి, కొంచెం నీళ్లు పోసి (దోశపిండి మాదిరి) జారుగా మిక్సీ పట్టుకోవాలి. బాండీలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి, వేరే గిన్నెలోకి తీసుకోవాలి. అదే నేతిలో పెసరపప్పు, కొబ్బరి మిశ్రమాన్ని పోసి తిప్పుతూ ఉడికించాలి. హల్వాలా దగ్గరగా అయిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి తిప్పుతూ బాండీని విడివడేంత వరకూ ఉడికించాలి. బాండీని వదులుతుందనగా నెయ్యి రాసిన ప్లేటులోకి తీసుకుని సమంగా సర్దాలి. అంతే తెరట్టిపాల్‌ రెడీ! ఇది తరచుగా తీసుకుంటే రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. ముందుగానే కొబ్బరిముక్కలు కొంచెం తీసి పక్క నుంచుకొని, డ్రైఫ్రూట్స్‌తో పాటు వేయించి గార్నిష్‌ చేయొచ్చు. పిల్లలు దీనిని చాలా ఇష్టంగా తింటారు.

ఆప్రికాట్‌ డిలైట్‌..

కావలసినవి : విత్తనాలు లేని ఆప్రికాట్‌- 150 గ్రా., పంచదార- 1/2 కప్పు, పాలు- 1/2లీ., కష్టర్డ్‌ పౌడర్‌- 3 స్పూన్లు, ఫ్రెష్‌ క్రీమ్‌-కప్పు, పంచదార పొడి-4 స్పూన్లు, వెనిల్లా స్పాంజికేక్‌-300 గ్రా.
తయారీ : ఒక గిన్నెలోకి ఆప్రికాట్‌ను తీసుకుని వేడినీళ్ళు పోసి, రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఆ నీటితో సహా బాండీలోకి తీసుకోవాలి. దీనిలో పావు కప్పు పంచదార కలిపి, అరగంట సేపు ఉడికించాలి. మెత్తగా ఉడికిన అప్రికాట్‌ని చల్లారిన తర్వాత మెత్తని గుజ్జుగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు పాలను కాచి, అందులో మరో పావు కప్పు పంచదార కలిపి, తిప్పుతూ ఉడికించాలి. పావు కప్పు పాలలో కస్టర్డ్‌పౌడర్‌ కలిపి పక్కనుంచుకోవాలి. పంచదార కరిగి, పాలు పొంగు వచ్చినప్పుడు కస్టర్డ్‌ పౌడర్‌ ఉండలు కట్టకుండా కలుపుతూ పోయాలి. పాలు ఉడుకుతూ చిక్కబడి క్రీమీస్టేజ్‌లో స్టౌ ఆఫ్‌ చేయాలి. దీనిలో వెనీలా ఎసెన్స్‌ కలిపి పక్కనుంచాలి. ఒక గిన్నెలో ఫ్రెష్‌ క్రీమ్‌ తీసుకుని దానిలో పంచదార పొడి కలుపుకోవాలి. స్పాంజి కేక్‌ను బ్రెడ్‌ స్లైస్‌ల మాదిరి మధ్యలోకి కట్‌ చేసుకోవాలి. ఈ స్లైసెస్‌ పట్టేంత వెడల్పు ఉన్న గిన్నె తీసుకుని, ఆప్రికాట్‌ ప్యూరీని ఒక లేయర్‌లా పరుచుకోవాలి. దానిపై స్పాంజి కేక్‌, కేక్‌పై కలిపిన క్రీమ్‌, దానిపై ప్యూరీ, దానిమీద కస్టర్డ్‌ మిల్క్‌ అంతా తడిచేలా పోయాలి. దానిపై మరో కేక్‌ స్లైస్‌ ఉంచి, ప్యూరీ, క్రీమ్‌, కస్టర్డ్‌ మిల్క్‌ ఒకదాని తర్వాత ఒకటి పొరలుగా ఉంచాలి. అంతే ఆప్రికాట్‌ డిలైట్‌ రెడీ అయిపోయినట్టే. చివరిగా డ్రైఫ్రూట్‌ పలుకులు చల్లి, రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్‌ చేయడమే!

వెనీలా ఐస్‌క్రీమ్‌ హల్వా..
కావలసినవి : పాలపొడి- 200గ్రా, నెయ్యి-200 గ్రా, పంచదార-250గ్రా, వెనీలా సుగర్‌/వెనీలా ఎసెన్స్‌-స్పూను, పిస్తా పలుకులు- 4 స్పూన్లు
తయారీ : ముందుగా వెడల్పు ప్లేట్‌లో నెయ్యి రాసి పిస్తా పలుకులు చల్లుకుని పక్కనుంచుకోవాలి. పాలపొడిలో నెయ్యి వేసి, బాగా కలిపి ముద్దగా చేసి పక్కనుంచుకోవాలి. బాండీలో పంచదార తీసుకుని ముప్పావు గ్లాసు నీళ్ళు పోసి, తీగ పాకం రానివ్వాలి. ఈ పాకంలో కలిపి ఉంచుకున్న పాలపొడి ముద్ద వేసి పూర్తిగా కరిగేలా కలపాలి. అది కొంచెం చిక్కబడిన తరువాత బాండీని మళ్ళీ స్టవ్‌ మీద పెట్టి వెనీలా షుగర్‌ (లేదా వెనీలా ఎసెన్స్‌) వేసి సన్నని సెగ మీద బాండీ అంచులకంటా తిప్పుకుంటూ ఉడికించాలి. ఐదు నిమిషాల తరువాత బర్ఫీ చిన్న ముద్దను వేళ్ళ మధ్యపెట్టి చుట్టు తిప్పితే ఉండకట్టాలి. ఉండకడుతుంటే వెంటనే స్టవ్‌ ఆపేసి ఐదు నిమిషాలు కలుపుతూనే ఉండాలి. తర్వాత బర్ఫీని పిస్తా పలుకులు చల్లుకున్న ట్రేలో పోసి చదునుగా సర్ది, చల్లారనివ్వాలి. అంతే వెనీలా ఐస్‌క్రీమ్‌ బర్ఫీ రెడీ. చల్లారిన తరువాత బర్ఫీ ప్లేటుని బోర్లించి, ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని ఫ్రిజ్లో పెట్టుకుంటే నెలరోజులు నిల్వ ఉంటాయి.

➡️