కుండీలో ఏపుగా కొమ్మా, రెమ్మలతో పచ్చగా నవనవలాడుతూ వున్న చంద్రకాంత మొక్కను చూస్తూ వుంది మైథిóలి. ‘ఇది ఇప్పటికైనా పూలు పూస్తే బాగుండును. ములుకులు లాంటి మాటల బారి నుండి తప్పించుకోవచ్చు.’ అనుకుంది.
అత్తగారు నిర్మల మాటలు చెవిలో గింగిరాలు కొడుతూ వుంటాయిలా. ‘అమ్మారు! ఇంకా ఎందుకా మొక్కకు పోషణ చేస్తావ్! బడితలా పెరిగింది కానీ.. ఓ మొగ్గ వేసి పువ్వు పూసింది లేదు. పీకి పారేసి ఏ శంఖం పూల గింజలో వేయకూడదు పూజకు పనికి వస్తాయి. హెర్బల్ టీ కూడా చేసుకోవచ్చు!’ అని.
సృష్టిలో ఉన్న ప్రతి వస్తువూ సొంతానికి వాడుకునేందుకు అనువుగా ఉండాలి. లేకపోతే అది దానంతటదే మాయం అయిపోవాలి. లేకపోతే నాశనం చేసేయాలి. మరొకటితో నింపేయాలి. ఇదే మానవుడి లక్షణం అన్నట్లు వుంటున్న ఆమెను చూస్తే మైథిలికి ఆశ్చర్యం కలుగుతుంది. చంద్రకాంత మొక్క స్థానంలో తనని ఊహించుకుంది.
పెళ్ళై నాలుగేళ్ళు అయింది. ‘ఇంకా పిల్లలు పుట్టలేదేంటి?’ అని ఆశ్చర్యపోవడం దాటి, ఎగతాళిగా చూడటం మొదలుపెట్టారు. ఎవరూ నోటితో పల్లెత్తు మాట అనరు. కానీ వారి చూపుల్లో, పెదాల మీద నవ్వుల్లో, కనుబొమ్మల విరుపుల్లో, కదలికల్లో స్పష్టంగా కనిపిస్తాయి.
ఇంట్లో నలుగురు పిల్లలు వున్నారు. వారందరినీ నెలల వయస్సున్నప్పటి నుండీ అపురూపంగా మోసి, వారికి కావలసినవి కొనిపెట్టి, సినిమాలకు, షికార్లుకి తిప్పే బాబారు శ్రీరామ్ అంటే వాళ్లకి మహా ఇష్టం.
శ్రీరామ్ కూడా మైథిలి నెల తప్పకపోవడాన్ని పెద్దగా పట్టించుకున్నదీ లేదు. ‘ఐవిఎఫ్ సెంటర్‌కు వెళ్దాం’ అని ఓసారి అడిగింది. ‘తొందరేం వుంది? చూద్దాం..’ అని శ్రీరామ్ దాటేసేవాడు. అది గుర్తు వచ్చి నిట్టూరుస్తూ.. చంద్రకాంత మొక్క చివుళ్ళను సృశిస్తూ.. దాన్ని బతిమిలాడింది.
‘బుజ్జి తల్లీ! త్వరగా పూలు పుయ్యవే! లేకపోతే నేను లేనప్పుడు ఎవరో వొకరు పీకేస్తారు. లేదా తుంటి ఎముక విరిగి వీల్ చైర్‌లో తిరుగుతున్న అత్తగారు వచ్చి నిర్దాక్షిణ్యంగా పీకి పడేస్తారు. ఎంత ఇష్టంగా తెచ్చుకున్నాను నిన్నూ!. బంధువుల ఇంటి ముందర విరబూసి పరిమళాలు వెదజల్లుతూ గాఢ ఆకర్షణలో పడేసావు నువ్వు. పసుపు పచ్చని రంగుపై ఎర్రని చుక్కలతో మనోహరంగా మెరిసిపోతూ. అనుమతి తీసుకోకుండానే విత్తనాలు సేకరించాను. మట్టితో సహా పింగాణీ కుండీ కొని తెచ్చి, ఈ నాల్గవ అంతస్తు బాల్కనీలో పెట్టి అపురూపంగా పెంచాను. సాయంవేళ నిండుగా నువ్వు పూలు పూసి పరిమళాలు వెదజల్లుతూ వుండే దృశ్యాలను.. ఎన్నిమార్లు కలగన్నానో తెలుసా? ఇప్పటికైనా పూలు పూయవే తల్లీ! మా బంగారువి కదూ!’ అంటూ మనసులోనే బతిమిలాడింది.
‘పిన్నీ!’ అంటూ వచ్చింది ఏడేళ్ళ పాప!
‘రిషితా వచ్చేసావా?’ దగ్గరికి తీసుకోబోతూ ఆగిపోయింది. పాప ముఖంలో భయం, ఆందోళన. కన్నీటి చారికలు. ఏదో కీడు శంకించింది. ‘ఎందుకమ్మా అలా వున్నావు? ఏం జరిగిందో చెప్పు?’
‘పిన్నీ! మామయ్య.. మామయ్య నన్ను’ వెక్కుతూ ఆగిపోయింది. గుండె గుబేల్మంది మైథిలికి.
గబగబా వెళ్ళి రూమ్ తలుపులు మూసి వెక్కుతున్న పాపను వొడిలోకి తీసుకుని, కన్నీళ్ళు తుడిచి వెన్ను నిమురుతూ లాలనగా అడిగింది. ‘స్కూల్ బస్ దిగి లోపలికి వస్తున్నాను. లిఫ్ట్ దగ్గర మామయ్య ఉన్నాడు. మీరందరూ షాపింగ్‌కి వెళ్లారని చెప్పాడు. వాళ్ళింటికి రమ్మన్నాడు. మామయ్యతో వెళ్ళాను. చాక్లెట్లు ఇచ్చి, బెడ్‌రూమ్‌లోకి తీసుకెళ్ళాడు. ఏమేమో చేసాడు పిన్నీ! నేను గట్టిగా ఏడ్చాను. చూడు బ్లడ్ వస్తుంది’ గాటు పడ్డ పెదవిని చూపించింది. ఈసారి భయంతో మైథిలి వణికిపోయింది.
ధైౖర్యం కూడదీసుకుంటూ అడిగింది ‘ఇంకెక్కడైనా నొప్పిగా వుందా తల్లీ?’
‘ఊహూ, ఇంకెక్కడా నొప్పి లేదు. నేను కూడా మామయ్య చేతిని గట్టిగా కొరికాను. కేకలు పెడుతూ తలుపు తెరుచుని వచ్చేసాను’
‘సరే, ఈ విషయం గురించి నువ్వు ఎవరికీ చెప్పకూడదు. అత్తకు చెప్పి, మామయ్యకు గట్టిగా పనిష్మెంట్ ఇప్పిద్దాం. సరేనా!’
‘సరే పిన్ని’ రిషిత ముఖంలో చిన్న నవ్వు.
రిషితకు స్నానం చేయించి, స్నాక్స్ పెట్టి, పాలు తాగిస్తూ తన దగ్గర కూర్చోబెట్టుకుని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆడపడుచు ఇంట్లో పనిమనిషి రిషిత పుస్తకాల బ్యాగు, షూస్ తీసుకొచ్చి ఇచ్చింది.
మైథిలి, అత్త నిర్మలకి కాఫీ ఇస్తుంటే.. ‘లావణ్య షాపింగ్‌కి వెళ్ళిందిగా.. అల్లుడిని కూడా కాఫీకి పిలువ్ అమ్మారు!’ అంటూ ఆజ్ఞాపించింది. అత్తగారికి, కూతురు కళ్లెదురుగానే వుండాలి. అల్లుడికి నిత్యం కొత్త అల్లుడికి జరిగినట్లు రాచమర్యాదలు జరగాలి. ఆ మాత్రం కాఫీ కలుపుకుని తాగలేడా వెధవ!’ అని తిట్టుకుంటూ అత్తగారి మాట పెడచెవిని పెట్టింది. శ్రీరామ్‌కి కాల్ చేసి రిషితకి ఏం జరిగిందో చెప్పింది మైథిలి. లాయర్‌గా పనిచేస్తున్న అతనే ఆ సంగతి చూసుకుంటాడని.
మరో గంటకల్లా.. కారకుడైన వ్యక్తి మినహా అందరూ హాల్లో కూర్చుని ఉన్నారు. నిర్మల చాలా అసహనంగా వుంది. లావణ్య అవమానభారంతో తలదించుకుంది. పాపం! అంతకన్నా ఏం చేయగలదు?. క్రమశిక్షణ లోపించి, చదువు అబ్బకపోయినా, సినిమా హీరోలాగా వున్నాడని, అతన్నే కావాలని కోరుకుంది. పెళ్ళై పుష్కరం గడిచినా, పైసా సంపాదించడు. సరికదా పట్టె మంచం పైకే అన్నీ రావాలి. ఇన్నేళ్ళుగా లావణ్య చిన్న ఉద్యోగం చేస్తుంది. తల్లి ఆర్థికస్థోమతను అండగా జేసుకుని వ్యసనపరుడైనా, బలాదూర్‌గా తిరుగుతూండే భర్తను కాచుకుంటూ వస్తుంది. అప్పుడప్పుడు మందలిస్తుందని మైథిలిపై తల్లికి, కూతురికి కోపం.
‘గోటితో పోయేదానికి గొడ్డలి పోటు దాకా ఎందుకు? ఏదో ముద్దు చేసి వుంటాడు. రిషిత ఏదో ఊహించుకుని భయపడి వుంటుంది. ఇక ఈ విషయం మర్చిపోండి’ అంది అత్త నిర్మల కఠినంగా.
‘మర్చిపోవడం ఏమిటి అత్తయ్యా? మీరు తప్పును ఖండించలేదు అంటే సమర్థిస్తున్నారా?’
‘నోర్మూరు! నీకు, లావణ్య అంటే ఇష్టం వుండదు. ఎప్పుడూ ఏదోకటి అంటూనే వుంటావు. ఇది నీ పన్నాగమే!’
.’లావణ్యతో నాకు చిన్న చిన్న విభేదాలు వున్న మాట నిజమే అయినప్పటికీ వాటిని ఇలా రిషిత విషయంలో జరిగిన తప్పుకు ముడిపెట్టడం బాగోలేదు అత్తయ్యా! పవన్ అలా చేయడం నిజం. కూతురిపై వున్న ప్రేమతో అల్లుడి నిర్వాకాన్ని తప్పు అనకుండా మీ కళ్ళు మూసుకుపోయాయి.’ గట్టిగా మాట్లాడింది మైథిలి.
ఆ మాటకు నిర్మల ఆవేశంతో ఊగిపోతూ.. ‘శ్రీరామ్! నీ పెళ్ళాం నన్ను అంతమాట అంటుందా? ఈ ఇంట్లో నేనైనా వుండాలి లేదా అదైనా వుండాలి. గొడ్డుబోతు దానికి పిల్లలపై ప్రేమ ఎలా వుంటుందో తెలిస్తే కదా! ఎవరు వొప్పుకున్నా, వొప్పుకోకపోయినా నా కూతురు ఇక్కడే ఉంటుంది’ తీర్మానం చేసింది.
‘తల్లి లేని పిల్లవాడు అని పవన్‌ని పెంచి, పెద్ద చేసి కొడుకులతో సమానంగా ఆస్తులు పంచి ఇచ్చారు. కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేసి ఇంట్లోనే పెట్టుకున్నారు. అతను పామై కాటేస్తుంటే గుడ్డిగా వెనకేసుకు వస్తున్నారు. నిజాలను నమ్మకపోవడం మీ కర్మ’ అని అంటూ మైథిలి విసురుగా తన గదిలోకి వెళ్ళింది.
నిర్మల ఆ తర్వాత కూడా ఏడుపు, అక్కసు, నోటితుత్తర కలగలిపి మైథిలిని పావుగంటసేపు తిట్టిపోసింది. విసుగు విరామం లేకుండా ఎఫ్‌ఎమ్ ఆర్‌జె రొదలా వినిపిస్తూనే వున్న ఆ మాటలను అపార్ట్మెంట్ అంతా శ్రద్ధగా వింది. భయపడి, జాగ్రత్తలోకి మేల్కొంది. పసిపాపల చుట్టూ రక్షణ కవచాలను కట్టుదిట్టం చేసుకునే ప్రయత్నం చేసింది.
జరిగిన విషయానికి బాధతోనూ, అవమానంతోనూ శ్రీరామ్ తల పట్టుకుని కూర్చున్నాడు. అతనిలో అనేక ఆలోచనలు. ఇక్కడ మైథిలి చెప్పినదాన్ని నమ్మడం, నమ్మకపోవటం కాదు సమస్య. అచ్చం సోషల్ మీడియాలో లాగానే.. జరిగిన తప్పు కళ్లెదురుగా కనబడుతున్నా- ప్రశ్నించలేని స్వార్థంలో మనిషి కూరుకుపోతున్నందుకు బాధగా వుంది. ఏ విషయానికైనా అవును అనే వాళ్ళు కొంతమంది, కాదు అనే వాళ్ళు ఇంకొంతమంది. ఇక్కడ కుటుంబం, సమాజమే కాదు. మనిషిని మనిషీ.. ఆఖరికి మనిషి- మనస్సు కూడా విభేదించే స్థాయికి చేరుకున్నారు. కళ్ళు, మెదడు తెరిచి సత్యాన్ని చూడటం ఎలా!? అని తనలో తనే మదనపడ్డాడు.
బ్యాగ్‌లో బట్టలు సర్దుకుని ‘వెళుతున్నా’నని శ్రీరామ్‌కి, ‘రిషిత పాప జాగ్రత్త అక్కా’ అని ఏమీ మాట్లాడకుండా అయోమయంలో వున్న తోడికోడలకి హెచ్చరిక చేసి ఆటో ఎక్కింది మైథిలి. ఆ రాత్రి అందరూ భోజనాల బల్ల ముందు కూర్చుని అన్యమనస్కంగా పళ్ళెంలో వేళ్ళు పెట్టి కదిలిస్తూ వున్నప్పుడు రిషిత మరో బాంబు పేల్చింది.
‘బాబాయి నీకో సంగతి చెప్పనా! అప్పుడెప్పుడో నాన్నమ్మకి కాలికి ఆపరేషన్ జరిగినప్పుడు, మీరు హాస్పిటల్‌లో వున్నప్పుడు, మామయ్య మీ రూమ్‌లోకి వెళ్ళి, పిన్నిని వెనుక నుంచి హగ్ చేసుకున్నాడు. పిన్ని- మామయ్యను తోసేసి, చెంప మీద గట్టిగా కొట్టింది కూడా!’ చెప్పింది రిషిత. షాకింగ్‌గా చూసారు అందరూ.
‘నిజమా పాపా!’ అడిగాడు రిషిత తండ్రి.
‘అబద్ధం ఎందుకు చెబుతాను నాన్నా! నేను అక్కడే ఆడుకుంటున్నాను. నన్ను చూసి మామయ్య బయటకు వెళ్ళిపోయాడు.’
‘ఆ తర్వాత ఏం జరిగింది?’.
‘పిన్ని ఈ సంగతి ఎవరికీ చెప్పొద్దు తల్లీ గొడవలవుతాయి అని ప్రామిస్ తీసుకుంది.’
శ్రీరామ్ లేచి, చెయ్యి కడిగేసుకుని, రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
మిగిలిన కోడళ్ళు ఇద్దరూ ‘చూసారా అన్నట్టు..’ అత్త వైపు అసహనంగా చూసారు.
‘పిల్ల ముం….! ఏదో అలా చెబుతుంది. అల్లుడు ఎందుకలా చేస్తాడు? ఈ మాటలన్నీ లావణ్య వింటే బాధపడుతుంది.’ అంది నిర్మల. శుభ్రంగా తిని, ప్లేట్‌లో చేయి కడిగి, పళ్ళెం కింద పెట్టి చక్రాల కుర్చీ నడుపుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది.
శ్రీరామ్, భార్యకి ఫోన్ చేసాడు. పొడి పొడి సంభాషణ తప్ప రహస్యం బయట పడనేలేదు. ఇతనూ తెలిసిందని చెప్పనూ లేదు.
ఇరవై రోజులు గడిచాయి.
లావణ్య, తల్లితో మొబైల్ సంభాషణ తప్ప, ఇంట్లోకి అడుగుపెట్టలేదు. రిషిత తల్లి స్కూల్ బస్ ఎక్కించడం, దింపుకుని ఇంటికి తీసుకు రావడంలో శ్రద్ధ తీసుకుంటుంది. లావణ్య కొడుకు అనిరుద్ధ్‌తో కూడా రిషిత ఆడకుండా వేయి కళ్ళతో కావలి కాస్తుంది.
మైథిలి శ్రీరామ్‌కి మెసేజ్ చేసింది. ‘వేరేచోట ఇల్లు అద్దెకు తీసుకోండి. నేను అక్కడికే వస్తాను. మా పుట్టింట్లో మన ఇంట్లో జరిగిన విషయాలేవి తెలియవు. మీరూ చెప్పొద్దు’ అని.
రెండుసార్లు అత్తింటికి వెళ్లి భార్యను చూసి వచ్చేశాడు శ్రీరామ్. రిషిత చెప్పిన విషయం గురించి ప్రస్తావనకు తేలేదు కూడా! ‘ఇంటికి రా మైథిలి. అమ్మ అప్పుడేదో కోపంలో నోరు జారింది లే!’ అన్నాడు.
మైథిలి తల అడ్డంగా ఊపింది.
‘ఎందుకో నీరసంగా మగతగా వుంటుంది అమ్మాయికి. హాస్పిటల్లో చూపించి, ఒక నెల తర్వాత పంపుతాం బాబూ!’ అంది మైథిలి తల్లి.
********************************************
నెల రోజుల తర్వాత డబుల్ బెడ్రూమ్ ప్లాట్ అద్దెకు తీసుకొని, మైథిలిని ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాడు శ్రీరామ్. మైథిలి ఆ ఇల్లును చూసి ముచ్చటపడింది. తన పుట్టింటివారు ఇచ్చిన ఫర్నేచర్ మొత్తం నీట్‌గా సర్ది పెట్టి వుంది. ముఖ్యంగా బాల్కనీలో తను పెంచుకున్న చంద్రకాంత మొక్క వున్న కుండీని చూసి ఆనందపడింది. భర్తకు ‘థ్యాంక్స్’ చెప్పింది.
‘పరీక్షగా చూడు.. ఇంకా సంతోషిస్తావ్’ అన్నాడు. దగ్గరకు వెళ్ళి చూస్తే.. చిగురు చిగురులోనూ.. పొటమరిస్తున్న పసి మొగ్గలు. తన పొట్టపై చేయి వేసుకుంది. ‘బుజ్జి తల్లీ! నువ్వు అమ్మవి అవుతున్నావ్ నేనూ అమ్మను అవుతున్నాను!’ అంటూ మొక్కను ముద్దుపెట్టుకుంది.
‘మైథిలి నీతో ఒక మాట చెప్పాలి’ ఆగాడు సంశయంగా శ్రీరామ్.
ఏమిటి? అన్నట్లు చూసింది.
‘రిషితని మనం పెంచుకుందాం. అక్కడ కన్నా ఇక్కడ సేఫ్‌గా వుంటుంది అని.’
‘బావగారూ, అక్కా ఒప్పుకోవద్దూ. వాళ్ళు ఒప్పుకుంటే అలాగే మనం తెచ్చేసుకుందాం.’
‘వదిన సరేనంది. అన్నయ్య ”అమ్మను అడిగి చెబుతాను” అన్నాడు.’
మైథిలి మనసులో ‘నామమాత్రం సంపాదన. తల్లికి ఎదురుతిరిగి బతకడం సాధ్యపడదు. ఆ ఇంట్లో నుండి పొమ్మంటే అద్దె కట్టుకుని, పిల్లలకు ఫీజులు కట్టుకుని సంసారం ఈదడం అంటే మాటలు కాదు కదా!’ అని అనుకుంది.
సాయంత్రం ‘పిన్నీ’ అంటూ స్కూలు బ్యాగు, బట్టల బ్యాగుతో ప్రత్యక్షమైంది రిషిత. ఆ మర్నాడు ఆదివారం కావడంతో రిషితను తీసుకుని స్కూటీపై కూరగాయల మార్కెట్‌కి వెళ్ళింది. ఫస్ట్ ఫ్లోర్‌లో వుంటున్న సరిత టీచర్ కనబడింది.
”ఉమ్మడి కుటుంబంలో వుండటం ఇష్టం లేక నా కోడలు ఈ అపవాదును వేసి పోయింది. మా అల్లుడు బంగారంలాంటి వాడు.” అని చెబుతుంది మీ అత్తగారు’ అని సరిత టీచర్ చెబుతుంటే అసహ్యం వేసింది మైథిలికి. అత్తగారికి హృదయం, మెదడు రెండూ లేవు అనుకుంది విరక్తిగా.
కంచే-చేనుని మేస్తుంటే ఎవరు కాపలా కాయగలరు?
పసిపాపలను కుటుంబసభ్యుల నుండే కాపాడుకోవాల్సి రావడం ఎంత సిగ్గు చేటు. పైగా అంత వయస్సు వచ్చినా అత్తగారు కూడా నిస్సిగ్గుగా అతను చేసిన పనిని ఖండించకుండా, బయటకు పొక్కకుండా వుంచాలని చూడటం. ఆ రోజు అంతకుమించి రిషితకి ఇంకేదైనా జరిగి వుంటే.. అలాగే ఆనాడు తనపైన బలాత్కారం జరిగి వుంటే!? తనకు తోడు రిషిత వుండబట్టి మౌనంగా వెనక్కి తిరిగాడు కానీ. పీడకులు, బాధితులు ఒకే కప్పు కింద వుండాల్సి రావడం ఎవరైనా ఎందుకు వొప్పుకుంటారు? అందుకే రిషితని తమ ఇంట్లో వుండటానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు, పంపించారు అని అత్తగారు అర్థం చేసుకోదేం!?..అని ఆలోచిస్తూనే మైథిలి వంట చేసింది.
ముగ్గురూ తిని, టివి చూస్తూ వుండగా శ్రీరామ్‌కి అన్నయ్య నుండి ఫోన్ వచ్చింది. కంగారుగా లేచి బట్టలు మార్చుకుంటూ చెప్పాడు.
‘లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట. హాస్పిటల్‌కి తీసుకువెళుతున్నాం రమ్మని’ అని.
మైథిలి ‘రిషితని తీసుకుని నేను కూడా వస్తాను’ అంది.
‘వద్దు.. అక్కడ మా అమ్మ చేసే న్యూసెన్స్ మాములుగా ఉండదు. ఏం జరుగుతుందో ఏమో! పవన్ వాచ్మెన్ కూతురు పట్ల మిస్ బిహేవ్ చేసాడంట. వాళ్ళు పట్టుకుని బాది పడేసి, కంప్లైంట్ ఇచ్చారంట. విచారించడానికి పోలీసులు వచ్చేసరికి అది భరించలేక లావణ్య ఆత్మహత్యా ప్రయత్నం చేసిందట’ అని దిగులుగా చెప్పి, గబగబా వెళ్ళిపోయాడు.
‘మైగాడ్! అసలు ఏం జరుగుతుంది? పవన్ మిస్ బిహేవియర్ గురించి, అశ్లీలపు వాగుడు గురించి లావణ్యతో చెప్పి వుండాల్సిందేమో! తాను కూడా రహస్యంగా వుంచి తప్పు చేసింది. బంధుత్వాలు బలహీన పడతాయనో, పరువు పోతుందనో గోప్యంగా ఉంచడం వల్లనే ఆ కామాంధుడికి మరింత బలం చేకూరింది. పెంచిన ప్రేమో, లేదా పేరెంట్స్‌కి వుండే గుడ్డి ప్రేమల వల్లనో పిల్లలు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా పెద్దలు సమర్థిస్తూనే వుంటారు. మొదటిసారి తప్పు చేసినప్పుడే ఖండించి వుంటే ఎలా వుండేదో!. ఇంతై ఇంతింతై వటుడింతై అన్నట్లుగా పవన్ అరాచకాలు మితిమీరిపోయాయి. తన, పర అన్న విచక్షణ కూడా లేనివాడుగా, కీచకుడిగా మారిపోయాడు. అతను తప్పకుండా శిక్షింపబడాలి. లావణ్య మాత్రం బతకాలి! బతకాలి!!’ అనుకుంది మనసులో.
ఒక్క క్షణం ఆగి మళ్ళీ ప్రశ్నించుకుంది మైథిలి. ‘అవును, లావణ్య బతికి మాత్రం ఏం చేయాలి? ఎల్లకాలం ఇలాంటి అవమానాలు భరిస్తూనే వుండాలా? కొడుకు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటూ ఒంటరిగా తన జీవితం తాను బతుకుతాను అంటే సమాజం ”శభాష్” అంటుందేమో! కానీ లావణ్య తల్లి నిర్మల ఊరుకుంటుందా? అని!?’
ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఇందుకేనన్న మాట. అవసరమైతే తనూ, రిషిత కూడా సాక్ష్యం ఇవ్వాలని పవన్ శిక్షింపబడాలని దృఢంగా అనుకుంది. అలా చేస్తే పరువు, మర్యాదలు పోతున్నాయని గుట్టు రట్టు అవుతుందనే అత్త అహంకారం, ధన మదం ఊరుకుంటుందా? ఇవ్వన్నీ పోతే.
”పోతే ఎలా!?” అని అసహనం ప్రదర్శించదూ!! అని ఆలోచిస్తుండగా…
శ్రీరామ్ నుంచి ఫోన్ వచ్చింది. ‘లావణ్య అవుటాఫ్ డేంజర్.. ట్రీట్మెంట్ ఇస్తున్నారు’ అని.
అత్తగారి మూర్ఖత్వంతో, అహంకారంతో యుద్ధం చేయడానికి మైథిలి సమాయత్తం అయింది. వికసిత దరహాసంతో… చంద్రకాంతలు ఆల్ ది బెస్ట్ చెప్పాయి.
– వనజ తాతినేని
9985981666