ఏ స్పర్శ ఎలాంటిదో నేర్పాలి..!

ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేకుండా ఉన్నాం. పెద్దలమైన మనకే ఇంత సమస్యగా ఉంటే.. పాపం అభం శుభం తెలియని చిన్నారులు అందరినీ నమ్మేస్తారు. ఇటీవల చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు అన్నీఇన్నీ కావు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను అప్రమత్తంగా ఉండేలా తయారుచేయాలి. ఏ స్పర్శ ఎలాంటిదో చెప్పాల్సింది తల్లిదండ్రులే అని చెప్తున్నారు నిపుణులు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు.

హారికకు ఆరేళ్లు.. ఆడుకునేటప్పుడు వాళ్లింటికి దగ్గరలోనే ఒక యువకుడు రోజూ చాక్లెట్‌ ఇస్తున్నాడు. కొన్నిరోజులకు ఆ చాక్లెట్‌తో హారికను మచ్చిక చేసుకున్నాడు. తర్వాత అప్పుడప్పుడు వాళ్లింటికి తీసికెళ్తుండే వాడు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని.. చెబితే చాక్లెట్‌ ఇవ్వనని బెదిరించేవాడు. అలాగే హారిక చాక్లెట్స్‌ కోసం అతను చెప్పినట్లు చేసేది. అయితే ఒకరోజు నిద్రలో హారిక ‘వద్దంకుల్‌..’ అంటూ పెద్దగా అరుస్తూ.. భయపడి.. పెద్దగా ఏడుస్తుంది. వెంటనే తల్లి హారికను అక్కున చేర్చుకుని ‘ఏమైంది అమ్మా.. నేనున్నాగా నీకు!’ అని ధైర్యం చెప్పి.. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకుని షాక్‌ అయ్యింది. ఏం చేయాలో పాలుపోక భర్తతో విషయం చెప్పి, ఆ సమస్య పరిష్కారానికి పూనుకుంది. ఇలాంటి సంఘటనలు ఎక్కడో జరగవు. మన ఇంట్లోవాళ్ల వల్లో, పక్కింట్లోనో, ఎదురింట్లోనో, స్కూల్లోనో.. ఎక్కడపడితే అక్కడ పిల్లలు అకృత్యాల బారిన పడుతున్నారు. అలాకాకుండా జాగ్రత్తగా ఉండేందుకు చిన్నారులకు కొన్ని విషయాలు తెలియజెప్పాలి అంటున్నారు నిపుణులు.

శరీర భాగాలపై అవగాహన..
పిల్లలకు తమ శరీర భాగాల గురించి తల్లిదండ్రులు పూర్తి అవగాహన కలిగించాలి. ప్రధానంగా ఆడపిల్లలకు తల్లి ఆ బాధ్యత తీసుకుంటే, అబ్బాయిలకు తండ్రి వివరించాలని నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇతరులు తాకకూడని భాగాల గురించి, ఆ ప్రదేశాల్లో ఎవరైనా తాకితే ఎలా ప్రతిస్పందించాలో కూడా పిల్లలకు వివరించి చెప్పాలి. దీనివల్ల పిల్లలు అప్రమత్తంగా ఉండడానికి వీలవుతుందని నిపుణులు అంటున్నారు.

 


కథలు.. వీడియోలు..
పిల్లలకు గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ గురించి చెప్పేందుకు కథలు, వీడియోలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు పిల్లలకు చెప్పడానికి కొందరు తల్లిదండ్రులు సంశయించేవారు. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన కథల పుస్తకాలు, యానిమేషన్‌ వీడియోలు అనేకం వచ్చాయి. వాటిని చూపించి వారికి అర్థమైందో లేదో తెలుసుకోవాలి. అర్థంకాకపోతే తల్లిదండ్రులే వివరించాలని నిపుణులు చెప్తున్నారు.

అపరిచితుల పట్ల అప్రమత్తం..
తల్లితండ్రి కాకుండా ఇతరులు ఎవరైనా సరే వాళ్లతో ఏవిధంగా ఉండాలో పిల్లలకు ముందుగానే చెప్పి ఉంచాలి. బంధువులు, తెలిసినవారు, అపరిచితులు ప్రైవేట్‌ పార్ట్స్‌ తాకినా, ఎవరూ లేని చోటుకు ఒంటరిగా తీసుకెళ్లినా ఇంట్లో అమ్మానాన్నకి తెలియజేయాలనే విషయాన్ని పిల్లలకు చెప్పాలి. ఎలాంటి విషయం అయినా తల్లిదండ్రులతో పంచుకునేంత స్వేచ్ఛ వారికివ్వాలి. ఆంక్షలు, కోపంతో వారు చెప్పేది వినిపించుకోకపోతే చేతులారా వారి భవిష్యత్తుని నాశనం చేసినవారవుతారు. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే గట్టిగా అరవాలని పిల్లలకు చెప్పాలి. అలాంటి సందర్భం ఎదురైతే.. అక్కడి నుంచి పరిగెత్తడం, వీలుకాకపోతే కింద మట్టినిగానీ, ఇసుకనుగానీ చేతుల్లోకి తీసుకుని ఆ వ్యక్తి కళ్లల్లో పడేలా విసరాలి. అలాగే చేతులపై కొరికి, పారిపోవడానికి ప్రయత్నించాలి. లేకపోతే అటుగా ఎవరైనా వెళుతున్నా, దగ్గరలో ఎవరైనా ఉన్నా.. వాళ్లు తెలిసినా, తెలియకపోయినా.. ప్రమాదంలో ఉన్నామని వారికి ఏదో రకంగా తెలియజేయమని పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాలి. అప్పుడే వాళ్లు సేఫ్‌గా బయటపడగలరని నిపుణులు చెప్తున్నారు.

ఒంటరిగా ఉంటున్నారా?
పిల్లలు ఉన్నట్టుండి ఏం మాట్లాడకుండా ఒంటరిగా, ముడుచుకుపోయి ఉంటున్నారా? ఇలా ఉంటూ ఇంతకుముందులా చురుగ్గా ఉండకపోతే తల్లిదండ్రులు గమనించాలి. వారిని ప్రేమగా దగ్గరకు తీసుకొని, వివరాలు అడిగి తెలుసుకోవాలి. పిల్లలకు తల్లిదండ్రులే కాకుండా.. స్కూల్లో ఉపాధ్యాయులు కూడా పిల్లలకు స్పర్శ గురించిన అవగాహన కలిగించాలి. గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌ తేడా పిల్లలకు వివరించి చెప్పాలి. చివరి ఆయుధంగా పిల్లల బ్యాగ్‌లో ఓ పెప్పర్‌ స్ప్రేని ఉంచడం మంచిది. తమని తాము రక్షించుకోవడానికి దాని ఉపయోగం ఏంటో, ఎలాంటి సమయంలో వాడాలో పిల్లలకు వివరించాలి. అదే సందర్భంలో పెప్పర్‌ స్ప్రే దుర్వినియోగం చేయొద్దని చెప్పాలి.

➡️