కృత్రిమ మేఘాలతో.. !

Apr 14,2024 13:07 #Sneha

రోజురోజుకు రవి కిరణాలు భూమిని మండిస్తున్నాయి. భూమిపైనున్న మంచు పర్వతాలు కరిగి సముద్రాలవుతున్నాయి. దీనిని అడ్డుకోవాలనే చిరు ప్రయత్నం చేశారు యునైటెడ్‌ స్టేట్స్‌కు చెందిన యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ శాస్త్రవేత్తలు. భూమిని చల్లబరచడానికి, సూర్యుని నుంచి వచ్చే కిరణాలను తిరిగి అంతరిక్షంలోకే పంపే ప్రక్రియకు నాంది పలికారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలనూ తగ్గించడం.. కరుగుతున్న మంచు ఫలకాలను ఆపడం లాంటి ఏర్పాట్లను వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2023లో భూమిపై పెరుగుతున్న ఉష్ణోగ్రతల పట్టిక ఆధారంగా శాస్త్రవేత్తలు  ఈ ప్రయోగానికి పూనుకున్నట్లు నివేదిక తెలిపింది.

శాన్‌ ఫ్రాన్సిస్కోలో విమాన వాహక నౌకను నిలిపి ఉంచి దానిపై మంచు-యంత్రం లాంటి పరికరాన్ని అమర్చారు. దాని నుండి అధిక వేగంతో ఆకాశంలోకి ఉప్పునీటి కణాల పొగమంచును పంపటం ప్రయోగ నిర్మాణం. కోస్టల్‌ అట్మాస్ఫియరిక్‌ ఏరోసోల్‌ రీసెర్చ్‌ అండ్‌ ఎంగేజ్‌మెంట్‌ (సిఎఎఆర్‌ఇ) ప్రాజెక్ట్‌ కింద ఈ ప్రయోగం జరుగుతోంది.
బ్రిటీష్‌ భౌతిక శాస్త్రవేత్త జాన్‌ లాథమ్‌ 1990లో ఇలాంటి ప్రయోగమే చేశారు. వెయ్యి నౌకలను ఉపయోగించి సముద్ర నీటి బిందువులను గాలిలోకి వెదజల్లి మంచు మేఘాలను ఏర్పరచారు. సెకనుకు పది క్యూబిక్‌ మీటర్లు ఈ నీటిని ఎదచిమ్మటం వల్ల గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించి భూమికి ఉపశమనం కలిగిస్తాయని భావించారు. ప్రారంభించిన తర్వాత కానీ అర్థం కాలేదు. సముద్రపు నీటి వలన స్ప్రే నాజిల్స్‌ మూసుకుపోవటం.. తుప్పు పట్టడం.. వల్ల ఎంత కష్టతరమైన ప్రక్రియో అర్థమైంది.

ఇలా పని చేస్తుంది..

సముద్ర-ఉప్పు ఏరోసోల్‌లను సోడియం క్లోరైడ్‌గా వ్యవహరిస్తారు. ఇది డబ్ల్యుఆర్‌ఎఫ్‌-కెమ్‌లో అధిక హైగ్రోస్కోపిసిటీ (నీటి బిందువులను అధిక సంఖ్యలో పీల్చుకునే శక్తి) కలిగి ఉంటుంది. ఈ నీటి ఆవిరి క్లౌడ్‌ కండెన్సేషన్‌ న్యూక్లియై (జజచీ)పై ఘనీభవిస్తుంది. క్లౌడ్‌ కండెన్సేషన్‌ న్యూక్లియైలను క్లౌడ్‌ సీడ్స్‌ అని కూడా పిలుస్తారు. ఇవి వాతావరణంలో ఉండే వాయు కణాలు. వీటి పరిమాణం (0.2’ఎ) సాధారణ మేఘ బిందువులో నూరవ వంతు ఉంటుంది. ఇవి సహజంగానే నీటి కణాలను పీల్చుకుని నీటి ఆవిరి రూపంలో వాతావరణంలో ఉంటాయి.

సిఎన్‌ఎన్‌ సంఖ్య పెంచితే..
గత కొన్ని దశాబ్దాలుగా ఆర్కిటిక్‌ మంచుతో కప్పబడి ఉండే మహాసముద్రాలు వేసవి ఎండలకు అతి వేగంగా కరిగిపోతున్నాయి. దీని వలన భూ వాతావరణానికి అనేక పరిణామాలు ఎదురవుతున్నాయి. సముద్ర నీటి ఉప్పునీటి కణాల పొగమంచు, డై మిథైల్‌ సల్ఫైడ్‌లను పెంచి క్లౌడ్‌ కండెన్సేషన్‌ న్యూక్లియై సంఖ్య, సాంద్రతలను పెంచాలనేది పరిశోధకుల ప్రయత్నం. సిఎన్‌ఎన్‌ సంఖ్య పెరిగితే ఆర్కిటిక్‌ క్లౌడ్‌ ఆల్బెడో (సూర్యరశ్మిని రెఫ్లెక్ట్‌ చేసే మేఘాలు) పెరిగి, వాతావరణంలోని వేడిని తగ్గించే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ప్రయోగంలో కణాల పరిమాణం చాలా కీలకం. దీనికి మనిషి వెంట్రుక మందంలో 1/700వ వంతు ఉండే కణాలు అవసరం. కావలసిన స్థాయికంటె కణాలు చిన్నగా ఉంటే సూర్య కిరణాలు ప్రతిబింబించవు. పెద్దగా ఉంటే తక్కువ ప్రతిబింబిస్తాయి. మరో విషయం ప్రతి సెకనుకు క్వాడ్రిలియన్‌ కణాలను పిచికారీ చేస్తూండాలి.

ఫలితం ఉంటుందా..!
తప్పకుండా గ్లోబల్‌ వార్మింగ్‌ను సమతుల్యం చేయవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు.
మరికొందరు సౌర కుటుంబంలోని మార్పులను అంచనా వేయడం కష్టమంటున్నారు. సాంకేతికత వినియోగం పెరుగుతున్న కొద్దీ వాతావరణంలో మార్పులు గణనీయంగా మారుతున్నాయని వారు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగం ఏ ప్రాంతంలో చేస్తామో ఆ సముద్రంలోని జీవశాస్త్రాన్ని మార్చవచ్చు. ఆయా ప్రాంతాలలో వర్షపాతాన్ని పెంచవచ్చు. అంతేకానీ ప్రపంచమంతా సాధ్యం కాదు అనేది వారి వివరణ.

ఈ మార్గం సుగమం..
పరిశ్రమల ద్వారా వెలువడే వేడిని తగ్గించి ప్రపంచవ్యాప్తంగా 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత మాత్రమే ఉండాలనేది ప్రపంచ దేశాల లక్ష్యం. కానీ అందులో విఫలమవడం వల్లనే శాస్త్రవేత్తల కొత్త పరిష్కారాల కోసం ప్రయత్నం.
ఎన్ని ప్రయత్నాలు చేసినా కృత్రిమ ఫలితాలు తాత్కాలికమే. సహజ వనరులను కాపాడుకుంటూ మనుగడ సాగించమే మనిషి విధి. ప్రపంచ దేశాలన్నీ ఏక దీక్షతో పూనుకుంటే గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించే నిర్మాణాత్మక నిర్ణయాలు తీసుకోగలవు. అదే సుగమం.

➡️