మరువలేని పాటలతో…

Mar 9,2025 09:29 #celebrity, #Sneha

ఇండిస్టీలో తెరపై కనిపించే హీరో, హీరోయిన్లకే కాదు.. తెర వెనక ఉన్న వారినీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు. ముఖ్యంగా సింగర్స్‌ని ఫాలో అవుతూ, వారు ఎలా అయితే పాడారో అలాగే పాడాలని ప్రయత్నిస్తారు. వారిలో సింగర్‌ శ్రేయా ఘోషల్‌ ముందువరసలో ఉంటారు. మధురమైన స్వరంతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఆమె పాన్‌ ఇండియా సింగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఏ రకమైన పాట అయినా ఆమె గాత్రంతో కదిలించగలరు. అయితే ఓ ఇంటర్వ్యూలో తన పాటల ఎంపికలో జాగ్రత్తలు పాటిస్తూ, కొత్త పాటలు పాడే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకు గల కారణాలను, ఆమె గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

నటన.. సంగీతం ఏదైనా పుట్టుకతో రావు. వాటిని నేర్చుకుంటూ, ఒంటికి పట్టించుకోవాలి. అప్పుడే వాటిలో ఉన్న గొప్పతనం అనుభూతి కలిగిస్తుంది. శ్రేయా ఘోషల్‌ బాల్యం నుంచే సంగీతం నేర్చుకుంటూ పెరిగారు. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లోని ఒక బెంగాలీ కుటుంబంలో జన్మించిన ఆమె రాజస్థాన్‌ కోట సమీపంలోని రావత్‌భట చిన్న పట్టణంలో పెరిగారు. నాలుగేళ్ల వయసు నుంచే శాస్త్రీయ వాయిద్యం, హార్మోనియం నేర్చుకున్నారు. ఎంతో ఇష్టంగా, శ్రద్ధగా సాధన చేసేవారు. గురువు మహేష్‌చంద్ర శర్మ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నారు. సంగీత సాధనలో ఆమె పట్టుదల చూసి, ఆమె భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని గురువులు మెచ్చుకునేవారు. శ్రేయ 14 ఏళ్ల వయస్సులోనే తొలి స్టూడియో ఆల్బమ్‌ 1998లో ‘బెంధెచ్చి బీనా’ పేరుతో విడుదలైంది. ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగు టీవీ రియాలిటీ షో ‘సరిగమప’ లో పాల్గొని, ప్రసిద్ధి చెందారు. ఆమె చేసే ప్రతిపనిలోనూ సంగీతం తోడు చేసుకుంటూ ఇంట్లో ఎప్పుడూ సంగీత వాయిద్యాలు పట్టుకుని, గానం చేస్తూంటారంటే.. సంగీతంపై ఆమెకు ఎంత ఇష్టం ఉందో తెలుస్తుంది.

తొలి సినిమాకే అవార్డు

శ్రేయాఘోషల్‌ 16 ఏళ్ల వయసులో, బాలీవుడ్‌ మూవీ ‘దేవదాస్‌’లో ‘భైరి పియా’ పాట పాడారు. తొలి సినిమాకే జాతీయ స్థాయిలో ‘ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ను గెలుచుకున్నారు. అప్పటి నుంచి సినీ సంగీత లోకంలో ఎక్కడా బ్రేక్‌లు వేయకుండా రికార్డులు, అవార్డులు అందుకుంటూ ప్రయాణిస్తున్నారు. సంగీతంపై ప్రేమ వల్లే తాను ఈ స్థాయికి రాగలిగానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కొన్ని వందల సినిమాల్లో వేల పాటలు పాడారు. అంతేకాదు.. ఆమె తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, నేపాలీ, ఒరియా, భోజ్‌పురి, పంజాబీ, ఉర్దూ, తుళ్లు భాషల్లోనే కాదు విదేశీ బాషల్లోనూ ప్రపంచస్థాయి స్టేజీల్లో పాటలు పాడి పాన్‌ ఇండియా సింగర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఏ భాషలో పాడినా అత్యంత సహజంగా తన గానమాధుర్యంతో అలరించడం ఆమె ప్రత్యేకత.

తెలుగులోనూ…

‘ఒక్కడు’ సినిమాలో ‘నువ్వేం చేసేవే గానీ’… పాట నుంచి ‘పుష్పా2’ లోని ‘వీడు మొండోడు..’ పాట వరకూ సంగీతప్రియులను తన పాటలతో మైమరింపజేశారు. ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ సినిమాలో ‘చలి చలిగా అల్లింది…’, ‘అతడు’ సినిమాలో ‘పిల్లగాలి అల్లరి ఒళ్లంత గిల్లీ…’ మెలోడీ పాటలు ఇప్పటికీ వింటూ ఆనందించే అభిమానులూ ఉన్నారు. ‘సుకుమారుడు’లో ‘నీలాకాశంలో మెరిసె చంద్రుడువి..’ పాట ఆ సినిమాకే హిట్‌ని అందించిందంటే అతిశయోక్తి కాదు. ఆమె గాత్రంలోనూ, గానంలోనూ తప్పులు లేకుండా చూసుకుంటారు. పాటలతో ఎప్పుడూ గొప్ప భావోద్వేగాలను ప్రేక్షకులకు అందించాలనుకునే తపనతో పాడుతూ ఇండియా నంబర్‌ ఒన్‌ సింగర్‌గా నిలిచారు.

అసభ్య పదజాలం

తాను పాడుతున్న కొన్ని ఐటమ్‌ సాంగ్స్‌ల్లో అసభ్య పదజాలం ఉంటాయని, అవి చిన్న పిల్లలకు తెలియకుండా పాడుతున్నారని, అది తనకు చాలా ఇబ్బందిగా ఉన్నట్లు తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తాను పాల్గొన్న లైవ్‌ షోస్‌లో కొన్ని సంఘటనల తర్వాత అలాంటి పాటల విషయంలో తాను ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ప్రతి ఒక్కరి కంట కన్నీరు

కోల్‌కతాలో జరిగిన జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఉదంతం దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. అక్కడి యువత వినిపించిన నిరసన గళం ప్రతి ఒక్కరినీ స్పందించేలా చేసింది. శ్రేయా ఘోషల్‌ కూడా ఈ దుర్ఘటనపై స్పందించారు. ఘటనా స్థలానికి వెళ్లి, ఆ హత్యాచార ఘటనకు సంబంధించి ఓ పాటను పాడి, నిరసనకారులకు మద్దతుగా నిలిచారు. ఆ పాట విన్న వారంతా కంటనీరు పెట్టారంటే.. ఎంత హృద్యంగా గానం చేశారో అర్థమవుతుంది.
ఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియం (2017) లో భారతీయ విభాగంలో మైనపు విగ్రహాన్ని పొందిన తొలి గాయకురాలు కూడా శ్రేయా ఘోషల్‌ కావడం విశేషం. గాయనిగా, ప్రదర్శకురాలిగా, ప్లేబ్యాక్‌ సింగర్‌గా, సంగీత కంపోజర్‌గా, అనేక మ్యూజిక్‌ రియాల్టీ షోలకు జ్యూరీగా రాణిస్తున్న శ్రేయా ఘోషల్‌ భవిష్యత్తులో మరిన్ని పాటలు పాడాలని, మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని కోరుకుందాం.

పుట్టినతేది : 1984లో మార్చి 12న
భర్త : శిలాదిత్య ముఖోపాధ్యాయ
కుమారుడు : దేవయాన్‌
అవార్డులు : 22 ఏళ్ల కెరీర్‌లో జాతీయ అవార్డును 5 సార్లు, కేరళ స్టేట్‌ అవార్డు 4 సార్లు, తమిళనాడు స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు రెండుసార్లు, బిఎఫ్‌జెఎ అవార్డు రెండుసార్లు,
7 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు అనేక అవార్డులను గెలుచుకున్నారు.

➡️