విలువైన సమాచారంతో…

పుస్తకం : పాత్రికేయ రంగంలో నా అనుభవాలు
రచయిత : దాసరి ఆళ్వార స్వామి
పేజీలు : 352
ధర : 450/-
నెం : 9393818199

సమాజంలో రోజురోజుకీ అరాచక ధోరణి పెరిగిపోతున్నది. సంఘ విద్రోహశక్తులకు హింస దినచర్యగా తయారైంది. బస్సులూ, రైళ్లు, కార్యాలయాలూ, కర్మాగారాలూ వీటన్నిటి కంటే విలువైన మనుషుల ప్రాణాలు విధ్వంసక చర్యలకూ హింసాకాండలకూ గురైపోతున్నాయి. ఇలాంటి దారుణస్థితిని అద్దం పట్టి చూపే సాధనాలు పత్రికలు. స్వార్థరాజకీయాలకు-నిజాలను రాయడానికి భయపడుతున్న నేపథ్యంలో నిజాయితీగా పత్రికా విలేకరులు నిలబడటం కత్తి మీద సాములాంటిది.
అయినా జర్నలిజం తన ఆయుధంగా చేసుకుని, గ్రామీణ సమస్యలను, రాజకీయాలను, అవినీతిని ఎప్పటికప్పుడు ఎత్తిచూపారు ఆళ్వారస్వామి. రైతన్నలకు వ్యవసాయ రంగంలో విలువైన సమాచారాన్ని అందించారు. పంట దిగుబడికి మెళకువలను తెలియజేసిన ఆయన చెరకు రైతు. పత్రిక పాఠకులకు వాస్తవాలు తెలియాలన్న తలంపుతో నిబద్ధతగా, నిజాయితీగా పనిచేశారని ఆయనతో పరిచయం ఉన్న చాలామంది చెప్పడం అభినందనీయం. ఆయన వృత్తిలో ఎదురైన సంఘటనలనూ, అనుభవాలన్నీ ‘పాత్రికేయ రంగంలో నా అనుభవాలు’ తో పుస్తకరూపంగా పాఠకులకు అందించే ప్రయత్నం చేశారు. అంతేకాదు జనం మధ్యలో తిరిగే విలేకరికి వృత్తిలో ఎన్ని ఆటుపోట్లు, అవమానాలు, ఎదురవుతాయో తెలియజేశారు. వృత్తిపరంగా పత్రికలు మారినా ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ, పాఠకులకు, రైతులకు మంచి సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి ఆళ్వారస్వామి.
హైస్కూలు విద్య కూడా పూర్తిచేయని ఆయనకు బాల్యంలో నాటకాలంటే అభిమానం. తండ్రి బాలకోటయ్య నాటకాల్లోనే నటిస్తుండేవారు. ఆయనతో పాటు రాత్రిళ్లు రిహార్సులకు వెళ్లేవారు. అవి చూసిన ఆళ్వారస్వామి నాటకరంగంలో ప్రాంప్టరుగా పనిచేశారు. చారిత్రక నాటకాల్లోనూ నటించారు. ప్రేక్షకుల చేత కంటనీరు పెట్టించి, ప్రజాదరణ పొందారు. కలం చేతపట్టి కొన్ని కొత్త పాత్రలను సృష్టించారు. అలా రాయడం మొదలుపెట్టిన ఆళ్వారస్వామి.. గ్రామీణ సమస్యలను చూడటం మొదలుపెట్టి, విలేకరిగా మారారు. పగలంతా వ్యవసాయ పనులతో అలిసిపోయినా విశ్రమించకుండా సుమారు 40 ఏళ్లకు పైగా జర్నలిస్టుగా, రచనా వ్యాసంగకర్తగా బాధ్యతలు నిర్వహించడం గొప్ప విషయం.
ఆయనకు తెలిసిన సమాచారాన్ని ‘రైతే రాజు’, అన్నదాత, రైతునేస్తం శీర్షికలతో వార్తలు అందించారు. వ్యవసాయ సంక్షోభ సమయంలో మార్కెట్లో ఏ విత్తనాలు, ఎరువులు, పరికరాలు రైతులకు అందుబాటులో ఉన్నాయో తెలిపారు. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి, అధునాతన, ఆధునిక సాగుపద్ధతులు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. రైతు కుటుంబంలో పుట్టిన ఆయన చెరకు సాగులో దిట్ట. వ్యవసాయరంగ సమాచారాన్ని రైతులకు అందించడమే ధ్యేయంగా 52 పుస్తకాలు రాయడం అభినందనీయం.
డాక్టర్‌ ఎం.ఎస్‌ స్వామినాథన్‌ 1990లో ఊయ్యూరు వచ్చిన సందర్భంగా, అక్కడి నీటి పారుదల పరిస్థితిని పరిశీలించి, ‘భవిష్యత్తులో కృష్ణాకు నీటి కరువు వస్తుంది’ అని చెప్పారు. ఇదే విషయాన్ని ఆళ్వార స్వామి వార్త రాసి, పత్రికలకు పంపారు. అది చదివిన అధికారులు, పాఠకులు వార్త రాసినవారిని, పత్రిక సిబ్బందిని తిట్టారు. కానీ 2002-03లో నీటి కొరత ఏర్పడి కృష్ణాజిల్లాలో లక్షల ఎకరాలు బీడుగా మారిపోయింది. ఇలా ఎన్నో నిజాలను, ఘటనలు వార్తలుగా రాసిన ఆళ్వారస్వామి ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నారు. అయినా నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి, చివరికంటా పనిచేయడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అర్ధరాత్రి అయినా సరే వార్తలను సేకరించి, పత్రికలకు పంపేవారంటే.. పనిపట్ల ఆయనకు ఉన్న నిబద్ధత అలాంటిది.
ఓ విలేకరిగానే కాకుండా రైతాంగ సమస్యల పరిష్కారం కోసం మంత్రులు, అధికారులతో మాట్లాడేవారు. అందుకే ఆయన కృషిని గుర్తించి 10కి పైగా అవార్డులు వరించాయి. కృష్ణాజిల్లా సీనియర్‌ జర్నలిస్టుగా, ‘రైతు నేస్తం’ అవార్డులు అందుకున్నారు. అందులోనూ 2016లో ‘మోటూరు హనుమంతరావు స్మారక ఉత్తమ జర్నలిస్టు’ అవార్డు రావడం విశేషం. విలేకరిగా చేసిన పనికి ప్రతిఫలం ఆశించకుండా సమాజానికి మంచి చేయాలని అనుకునే ఆళ్వారస్వామి.. నేటి జర్నలిస్టులకు ఆదర్శనీయులు.

వీర
9490559477

➡️