సెల్‌ఫోన్‌లో నుంచి ”ఒకే ఒక లోకం నువ్వే..!” అంటూ శ్రావ్యమైన రింగ్‌టోన్ వస్తూనే వుంది. ట్యాంక్‌బండ్ బెంచిపై రాజశేఖర్ ఇయర్‌పాడ్స్ పెట్టుకుని ఉన్నాడు.
సాయంత్రం ఐదు దాటింది. మధ్యాహ్నం వచ్చిన ఉత్తరాన్ని చదువుతూ కూర్చుంది ప్రమీల.
‘ఏముత్తరమమ్మా’ ఏసేబు ఇంట్లోకి వస్తూ అడిగాడు.
‘మీ అల్లుడు గారు లాయర్ నోటీస్ పంపాడు. విడాకులు కావాలంట..’
‘అదేమిటమ్మా అంత తేలిగ్గా అనేస్తున్నావ్!’
‘అనక ఏముంది నాన్న. ఏడ్వడానికి కన్నీళ్ళన్నీ ఇంకిపోయాయి, ఇంక ఎవ్వరూ ఓదార్చే అవసరం లేదు.’
‘వొక్కగానొక్క కూతురు కదా.. ఉద్యోగస్తుడికిచ్చి పెళ్లిచేద్దామనుకున్నాని ఆశపడ్డాను. చివరకు నేను ఈ అబ్బాయిని ప్రేమించాను నాన్న అంటే కాదనలేదు.. అతనూ ఉద్యోగస్తుడే నాన్నా.. నన్ను బాగా చూసుకుంటాడు.. అని వొక్కమాట అనేలోపు.. తెలివైనదానివి తెలివైన నిర్ణయమే తీసుకుని ఉంటావని కులం పట్టంపులెలాగూ లేవు కాబట్టి నీ సంతోషం కోసమే ఒప్పుకున్నా.. కానీ వాడు ఇంత సంస్కారహీనుడనుకోలేదు. అంత మన తలరాత..’ అని నిట్టూర్చాడు.
‘నా తమ్ముడికిచ్చి చేయమంటే వినలేదు. ఆ వెధవకిచ్చి నా కూతురు గొంతుకోశావు.. ఈ కాలం పిల్లలకు ఏం తెలుసు ప్రేమ అనే మైకంలో అన్నీ మర్చిపోతారని, అందర్నీ వదులుకుంటారని, నెత్తీనోరూ మొత్తుకున్నా వినలేదు. మనం పేరుకే మాదిగలమైనా ఎంత గౌరవంగా బతుకుతున్నాం.. నువ్వేమో ప్రేమను గౌరవించాలన్నావ్.. ఏమైందిప్పుడు వాడి ప్రేమ.. వాని ప్రేమ ఇప్పుడు ఇంకొకతి పక్కను పంచుకునేందుకు సిద్ధమైంది.. మనం కులం తక్కువైనోళ్ళమనే కదా.. ఇలా నోటీసులు పంపి.. మనపిల్లను వదిలించుకుందామని అనుకుంటున్నాడు.!’
‘మార్తా.. నువ్ నోర్మూరు.. లోపలికెళ్ళు..!’
‘వెళ్తానండీ, వెళ్తా, నన్నేరోజు మాట్లడనిచ్చారని.. మిమ్మల్ని కట్టుకుని నేను ఏ రోజు సుఖపడ్డాను. కనీసం నా కూతురికి కూడా సంతోషం లేకుండా అయ్యింది. అంతా మీ ఇష్టప్రకారమే కానిచ్చారు. దాని గొంతు కోశారు.’
‘అమ్మా నా కోసం మీరెందుకు గొడవపడుతుంటారు. నేనే వెళ్తా, ఏదోవొక ఉద్యోగం చేసి బతుకీడుస్తా.. ఇన్ని పరీక్షలు రాశాను. ఏదో వొక ఉద్యోగం రాకపోతుందా.. బతకలేనా..?’ అంటూ గోడకు కూలబడిపోయింది.
‘భర్త వొదిలేసిన ఆడదంటే లోకానికి అలుసే.. ఇద్దరమ్మాయిల్తో ఎలా వెళ్తావమ్మా. నువ్వు తప్ప మాకైనా ఎవరున్నారు చెప్పు?’
‘నేనెవరికీ భారం కాదలచుకోలేదు నాన్నా!’
‘ప్రతిసమస్యకు ఏదో ఒక పరిష్కారం లభిస్తుందమ్మా! నీవేమీ అధైర్యపడకు, అంతా మంచే జరగుతుంది. బయట స్కూల్ ఆటోశబ్ధం వస్తుంది, పిల్లలొస్తున్నట్లున్నారు చూడు!’ అన్నాడు ఏసేబు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. మనస్విని ఆడిటోరియం మహిళలతో కిక్కిరిసిపోయింది. మీడియా గ్యాలరీలో, ఆడిటోరియంలో అక్కడక్కడ తప్పా, పురుషులెక్కువగా లేరు. వేదికపైకి ఒక్కొక్కరిని పిలుస్తున్నారు.
‘ఇప్పుడు మన ముఖ్యఅతిథి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి డా.రాజశేఖర్ గారు వేదికపై ఆశీనులు కావాలి!’ అని అంటుండగానే.. లేచి మహిళలందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ వేదిక ఎక్కి, కూర్చున్నాడు డా.రాజశేఖర్. వేదికపై ఉన్న ఒకే ఒక్క పురుషుడు ఈయనే.
ఒక్కొక్కరుగా మాట్లాడటం మొదలుపెట్టారు. అంతర్జాతీయ మహిళాదినోత్సవం విశిష్టత, మహిళా పోరాటాలు, హక్కులు రకరకాల అంశాలపై అంతకుముందు కొంతమంది వక్తలు మాట్లాడారు.
‘ఇప్పుడు మన మధ్య ఉన్న ముఖ్యఅతిథి డా.రాజశేఖర్ గారు మాట్లాడుతారు!’ అంటూనే ‘ఆయన గూర్చి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను’ అంటూ సభాధ్యక్షులు రజని మాట్లాడుతూ ‘డా.రాజశేఖర్ గారు స్త్రీల సమస్యల్ని, బాధల్ని ఇతివృత్తంగా తీసుకొని ‘మహిళా సాధికారత సమస్యలు – పరిష్కారాలు’ అనే అంశంపై పిహెచ్‌డి పట్టా పొందారు. ఈ సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై పత్రికల్లో అనేక వ్యాసాలు, కథనాలు రాశారు. ఇటువంటి స్త్రీవాది, అంతకు మించి గొప్ప మానవతావాది, మన జిల్లాలో ముఖ్యంగా మన ఈ నగరంలో ఉండటం గర్వకారణం!’ అంటూ రాజశేఖర్‌ను ఆహ్వానిస్తూ పరిచయం చేసి, మైక్ అందించారు.
మైకు అందుకొని మరొకసారి అందరికీ అభివాదం చేసి ప్రసంగించడం మొదలెట్టాడు. ‘ఇంతవరకు మాట్లాడిన వక్తలు అనేక విషయాలు చెప్పారు. వారు వొదిలేసిన విషయాల్ని ఇప్పుడు మీతో పంచుకోవాలనుకున్నానంటూ.. ఈ రోజు దేశం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనకబడటానికి కారణం పురుషులే. పురుషాధిక్య ధోరణి ప్రబలడం వల్ల ఆడది అబల అయ్యింది. స్త్రీలు సంఘటితమై పిడికిలి బిగించి పోరాడాలి. తమకు పుట్టిన పిల్లలు ప్లస్సు, మైనస్సు అనే ధోరణి పోవాలంటూ ఆవేశంగా ప్రసంగిస్తున్నాడు. ఎలక్ట్రానిక్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, పాత్రికేయులు పతాక శీర్షికలు రాసేందుకు ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్నారు. ఆద్యంతమూ స్త్రీ సాధికారతపై అనేక విషయాలు, తను పరిశోధించిన అంశాలు ఒక్కొక్కటిగా చెప్పి, అందర్నీ మెస్మరైజ్ చేస్తూ ముగించాడు. మహిళలు అతని సెల్ నెంబరుకు, సెల్ఫీలకు ఎగబడ్డారు. చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ, వారి ప్రశంసలు పొందుతూ సెల్‌నెంబర్‌తో పాటు సెల్ఫీలు ఇచ్చాడు. వేదిక దిగొస్తుండగా మీడియా చుట్టుముట్టింది.
‘స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలపై మీ స్పందనేంటి సార్?’ విలేకరి ప్రశ్న.
‘స్త్రీలో ఒక తల్లిని, చెల్లిని, అక్కని చూసుకోవాలి. ప్రస్తుత సమాజంలో స్త్రీ పురుషుడికి ఆట వస్తువైంది!’ అంటూ ఆవేశంగానే చెప్పాడు.
‘చట్టాలు స్త్రీలకు రక్షణ కల్పిస్తున్నయంటారా?’ మరో విలేకరి ప్రశ్న.
‘వరకట్న నిరోధకచట్టం, గృహహింస నిరోధక చట్టం, నిర్భయ చట్టల్లాంటివెన్నో మనదేశంలో ఉన్నాయి. అయితే అమలు చేసే యంత్రాంగంలో లోపముంది. అందుకే ఆ కేసుల్లో ఉన్న లోపాలే పురుషులకు వరాలుగా మారుతున్నాయి. వరకట్నానికి పాల్పడిన వారిని, ఇంట్లో స్త్రీలను హింసిస్తున్న వారిని, అత్యాచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి. కేసుల్లో కాలయాపన తగదు. కేసుల పురోగతి కోసం ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి!’ అంటూ నాకు వేరే ప్రోగ్రాం వుందని వెళ్ళిపోయాడు.
‘అమ్మా నాకు ఎవరైనా ఫోన్ చేశారా? సెల్లు తీసుకెళ్ళడం మర్చిపోయాను’ ఇంటికి వస్తూనే అడిగాడు రాజశేఖర్.
‘అవున్రా చాలాసేపు రింగయ్యింది. నేనే రింగు లిఫ్ట్ చేయలేదు. వెళ్లేటప్పుడు తీసుకెళ్ళొచ్చు కదరా! నీ మతిమరుపు పాడుగాను..’ పార్వతమ్మ జవాబు.
‘అవునమ్మా ప్రోగ్రాం హడావుడిలో మరచిపోయా’ అంటూ సెల్ తీసుకొని, కాల్స్ పరీక్షించసాగాడు. అందులో 7 మిస్డ్‌కాల్స్ రాంగ్‌నంబర్ పేరు మీదున్నాయి. తన సెల్లులో ఉన్న రాంగ్‌నంబర్ ఎవరిదోకాదు ఏడడుగులు తనతో నడచిన తన శ్రీమతి ప్రమీల నంబర్.
ఎందుకు చేసిందబ్బా అని ఆలోచిస్తూనే ఓహో తను పంపిన లాయర్ నోటీిస్ అంది వుంటుందనే నిర్ణయానికొచ్చి, రాంగ్‌నెంబర్‌కు రింగ్ చేశాడు.
సెల్ స్క్రీన్‌పై ‘మై హార్ట్’ అనే పేరు చూసి వెంటనే ప్రమీల లిఫ్ట్ చేసింది.
‘హలో ఎందుకు ఫోన్ చేశావ్?’ కాస్త గద్దించినట్లే, నిలదీసినట్లే అడిగాడు.
‘ఏమండీ బాగున్నారా?’
‘అసలు ఫోనెందుకు చేశావో చెప్పు.. నా బాగోగులు తర్వాత..’
‘లాయర్ నోటీస్ పంపారేంటండీ?’
‘చిలక్కి చెప్పినట్లు చెప్పా, విన్లేదు. నా మాట వింటే అంతా బాగుంటుంది. ఇప్పటికైనా ఏం పర్లేదు, ఒప్పుకో’ అన్నాడు రాజశేఖర్.
‘ఏమి ఒప్పుకోవాలి?’
‘మళ్ళీ వినాలనే ఉబలాటంగా వుందా? అయితే మరొకసారి విను చెబుతా!’
‘ఊ… చెప్పండి.’
‘నా వంశం నిలబడాలంటే అబ్బాయి కావాలి, ఆ అదృష్టం నీకెలాగూ లేదు. నేనింకో పెళ్ళిచేసుకోడానికి, ఒక చిన్న సంతకం చేశావనుకో, నేను ప్రవళిక హాయిగా పెళ్ళిచేసుకొని, సంవత్సరం తిరక్కుండా నీ చేతిలో మగబిడ్డను పెడతాం. నిన్నేమీ ఊరికే వొదిలేస్తానా ఏంది, తొలిసారి ప్రేమించిన ప్రేయసివి. ప్రవళిక ఆస్తిపరురాలు, పైగా నా గుండెల్లో కొలువైన ప్రవళిక వాళ్ళనాన్నకు ఒక్కగానొక్క కూతురు. తండ్రి సంపాదించిన ఆస్తి కోట్లలోనే, సకల సౌకర్యాలతో వొక ఇల్లు నీ పేరుతో కూడా కొనిస్తా .. ప్రవళిక దగ్గర బోర్ కొట్టినపుడు నీదగ్గరికొస్తా.. అన్నీ చూసుకుంటా, ఏలోటూ రానివ్వను., నోటీస్ కూడా విత్‌డ్రా చేసుకుంటా!’ అన్నాడు.
‘మళ్ళీ అమ్మాయే పుడితే.. మళ్ళీ తను కూడా బోర్ కొడితే.. అప్పుడు మరొకరిని వెతుక్కుంటావా..?’
‘పిచ్చిపిచ్చిగా మాట్లాడకు. అలా జరగదు.’
‘ఇంత చదివి, ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారేంటండీ?’
‘అవన్నీ నీతో మాట్లాడి ప్రయోజనం లేదు.’
‘నీకు పెళ్ళి అయిన విషయం, పిల్లలున్న విషయం నీవు కామించిన.. సారీ నీవు ప్రేమించిన అమ్మాయికి తెలుసా?’ అనింది కాస్త కటువుగానే.
‘అన్నీ తెలుసు.. అన్నీ చెప్పాను!’
‘ఎలా ఒప్పుకుంది..?’
‘నేనంటే పిచ్చిపట్టేలా చేశాను!’
‘అనుకోని పరిస్థితుల్లో నిన్ను చేసుకోవాల్సి వచ్చిందని, నీవు ఎక్కువకాలం బతకవని, నీకు దీర్ఘకాలిక జబ్బుందని. నీవు పోయాక పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తానని, ఆ తర్వాత మనకే అడ్డు ఉండదని చెప్పాను.’
‘నమ్మేసిందా..?’
‘నామీద ఉన్న పిచ్చి ప్రేమతో అన్నీ నమ్మేస్తుంది.. నమ్మించడంలో నన్నెవ్వరూ మించిపోలేరులే!’
ప్రమీల కొంత నెమ్మదించి ‘రాజా..! మరి మనిద్దరి మధ్య ప్రేమ?!’ అనింది.
‘ప్రేమా.. పిచ్చిదానా.. ప్రేమకు రంగు, రుచి, వాసన, ఆకారం ఏమీ వుండవు తెలుసా..? ప్రేమకు తెలిసిందొక్కటే సూర్యుడు తనచుట్టూ తానూ తిరుగుతూ భూమి చుట్టూ తిరిగినట్టు ప్రేమ కూడా డబ్బు, వ్యామోహల చుట్టూ తిరుగుతుంది.. ఇది నిజం ప్రమీలా. నీకే అర్థం అవ్వట్లేదు. నీకు వేరే దారీ లేదు, నీవు ఉద్యోగివి కాదు, నీకు ఉద్యోగం రాదు. బతకడానికైనా నా మీద ఆధారపడాల్సిందే!’
ప్రమీల ఆ మాటలు వినేసరికి నిండుకుండ తొణికిన కన్నీరు బయటికివచ్చి బుగ్గల్ని, గుండెను తడిపేశాయి. ప్రేమించుకునే రోజుల్లో తను ఎప్పుడు రాజా అని పిలిచినా మా అమ్మ కూడా నీలానే పిలుస్తుంది అని రాజశేఖర్ అంటుంటే ప్రమీల మురిసిపోయి మరింత ప్రేమ కురిపించేది.
‘ఆ కులం తక్కువ దాంతో ఏం మాటల్రా ఫోన్ పెట్టెరు! అంతా కోర్టులోనే చూసుకుందాం’ అంటూ తల్లి గర్జించింది.
ఫోన్ కట్ చేస్తూ ‘అమ్మా ఆకలైతుంది అన్నం పెట్టు.’
‘కాళ్ళూచేతులు కడుక్కుని వచ్చెరు! ఇప్పుడే తెస్తున్నా వేడివేడిగా తిందువుగాని!’
‘ఆ వేడివేడిగా పెట్టు పాపం నీ కొడుకు గొప్ప పని చేశాడని..’ లోపలికొస్తూనే తిట్ల పురాణం మొదలెట్టాడు వెంకటేశ్వరరావు.
‘కన్నకొడుకు ఎదుగుదల ఓర్చుకోని తండ్రిని నిన్నే చూస్తున్నా!’
‘బాగా ఎదిగిపోయాడే నీ కొడుకు! బయటేమో గొప్ప వ్యక్తి, ఇక్కడేమో సలక్షణమైన కోడల్ని దూరం చేసుకున్నాడు.
‘చేసింది నువ్వేకదా!”
‘నీవు ప్రేమించానని చెప్పినందుకే కదా ఒక్కమాట కాదనకుండా నేను పెళ్ళి చేసింది!’
‘అప్పుడది కావాలనిపిచ్చింది.. ఇప్పుడొద్దనిపిస్తుంది!’
‘రేరు ఆడదంటే బజార్లో దొరికే వస్తువు కాదురా!’
‘అబ్బో నాకు తెలుసులే!’
‘ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశావ్.. ప్రేమపెళ్లైనా వాళ్ళ నాన్న తను దాచుకున్న పీఎఫ్ డబ్బు పదిలక్షలు కట్నంగా ఇచ్చాడు.. ఇచ్చిన డబ్బు జల్సాలకే ఖర్చు చేశావ్. వాళ్ళు కులంలో తక్కువేమో కానీ గుణంలో నీకంటే గొప్ప తెలుసా.. సంస్కార హీనుడా!’
‘డబ్ములిస్తుంటే ఎందుకొద్దనాలి? ప్రేమపెళ్ళికి కూడా పదిలక్షల కట్నం ఇస్తామంటే, వొదులుకుంటామా ఏంది?
‘రేరు డబ్బు కంటే గుణం, సంస్కారం గొప్పవిరా.. డబ్బు.. ఈ హోదా శాశ్వతం కాదురా.. అది తెలుసుకో!’
‘పిచ్చినాన్నా డబ్బు మనిషిని శాసిస్తుందని, ఈ ప్రపంచమంతా డబ్బుమయమనే విషయం ఇన్నేళ్ళ ఉపాధ్యాయ వృత్తిలో తెల్సుకోలేదా?’
‘నీకు చెప్పి ప్రయోజం లేదురా, నీకిష్టమొచ్చినట్లు చెయ్యి, నీకు మీ అమ్మ మద్దతు వుందికదా..! అలాగే కానివ్వు నీకూ వొక చెల్లి ఉండి, ఇలా జరిగితే అర్థమయ్యేది. ఒక ఆడపిల్ల ఉసురు నీకు ఖచ్చితంగా తగుల్తుంది’ అని తండ్రి ఘాటుగానే అన్నాడు.
‘మీరు అమ్మాయిల్ని కననందుకే గదా ఇంత బాగా మిమ్మల్ని చూసుకునేది. లేకుంటే ఏ వృద్ధాశ్రమంలోనో వదిలేసేవాణ్ణి!’
‘రేరు నేను బతగ్గలను రా! నాకూ పెన్షనొస్తుంది. నేనేం నీ మీద ఆధారపడిలేను. నీదీ వొక బతుకా..? రేరు నా కళ్ళకు కనిపించకు వెళ్ళు, నేనేం చేస్తానో నాకే తెలీదు!’ అంటూ గట్టిగా అరిచాడు.
‘అమ్మా, డాడీ ఫొటో పేపర్లో పడింది చూడు!’ తెచ్చి చూపించింది ప్రమీల కూతురు సౌజన్య.’మహిళా సాధికారత మన ముందున్న లక్ష్యం’ పతాక శీర్షికలో డా.రాజశేఖర్ వ్యాఖ్యాల్ని చూపించింది. ఆ వార్త పక్కనే ‘సివిల్స్ పరీక్షల్లో జాతీయస్థాయిలో 7వ ర్యాంకు సాధించిన ప్రమీల!’ అనే వార్త ప్రచురితమైంది.
తన కాబోయే భర్త రాజశేఖర్ మహిళాదినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగాన్ని ప్రచురించిన వార్తాకథనాన్ని ప్రవళిక చదువుతుండగా ప్రమీల సివిల్స్‌కు ఎంపికైన వార్త కూడా కనబడిరది. ప్రమీల ఇంటర్వ్యూ కూడా వేశారు. ప్రమీల విలేకరి అడిగిన వొక ప్రశ్నకు సమాధానమిలా ఇచ్చింది ‘అత్యున్నతమైన విజయం పొందాను. కానీ ఈ వ్యవస్థలో ఆడదానిగానూ, అలాగే కులవివక్షను చాలా ఎదుర్కొంటున్నాను. నా భర్తే నాకు అమ్మాయిలు పుట్టారని విడాకుల నోటిస్ పంపారు. కులం తక్కువని మా అత్తే నాపై వివక్ష చూపిస్తున్నది. సివిల్స్‌లో పాసై విజేతనయ్యానేమోకానీ, నా నిజజీవితంలో స్థిరమైన, నమ్మకమైన ప్రేమను కనిపెట్టడంలో నేనూ ఫెయిల్ అయ్యాను. జెండర్ అసమానతల గూర్చి, కుల నిర్మూలన గూర్చి గొప్పగా చెబుతున్న మేధావులే కుల వివక్షను, అసమానతలన్నీ పాటిస్తున్నారు!’ అంటూ ఆమె కన్నీటితో పేర్కొన్నట్లు రాశారు.
ప్రవళిక కాళ్ళ కింద భూమి కంపించినట్లైంది. ఇవాళ ప్రమీలను వొదిలేసినట్లు నాకూ అమ్మాయి పుడితే నా బతుకేమిటి? అసలు పెళ్లైనవాడి మోజులో నేను పడటమేమిటి? నేనేమిటి ఇంత ఆలోచన లేకుండా మోసపోయాను. వాడి మాయమాటలకు ఎలా పడిపోయాను? వాడి ప్రేమ ప్రతిపాదనకు ఎందుకు ఒప్పుకున్నాను? మైకం దిగినట్లు.. స్పృహలోకి వచ్చింది. నాలా ఎంతమందినైనా బలి చేస్తాడు. ఇలా చంచలమైన మసస్తత్వం, మేధావి ముసుగులో చేస్తున్న ఈ దుర్మార్గానికి చరమగీతం పాడాల్సిందే అని అన్పించింది ప్రవళికకు. ఎంత వత్తిడి తెచ్చినా ముందుకు వెళ్ళకపోవడమే మంచిదైంది. చాలాసార్లు ఎన్నోవిధాలుగా బలవంతం చేశాడు. అన్నీ పెళ్ళయ్యాకే అని దాటేసింది. అమ్మో నేను ఇంకాస్త ముందుకు వెళ్ళి ఉంటే.. అని ఆలోచించసాగింది. సడెన్‌గా తన సెల్‌కు ఒక వాయిస్ రికార్డ్ మెసేజ్ వచ్చింది.
అది ప్రమీల-రాజశేఖర్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ.
తన సెల్లులో రాజశేఖర్ పేరును ‘మై స్వీట్ హార్ట్’ అని సేవ్ చేసుకుని ఉంది. దాన్ని ”రాంగ్ నెంబర్” అని ఎడిట్ చేస, ఫోన్ నెంబర్‌ను బ్లాక్‌లో పెట్టేసింది. ప్రమీలతో మాట్లాడాలని ప్రవళిక మనసు కోరుకుంటుంది.
కెంగార మోహన్
94933 75447