నువ్వే రాజు – నీదే తంత్రం..!

Oct 27,2024 07:58 #kavithalu, #Sneha

గుర్రానికి వేగముండాలి..
ఏనుగుకి బలముండాలి.
బంటుకి భయముండాలి.
సేనాధిపతికి వ్యూహముండాలి,
సైనికుడికి తెగింపుండాలి.
మంత్రికి తెలివుండాలి
యుద్ధం నెగ్గాలంటే,
వీళ్ళందరి వెనుక ఒక రాజుండాలి.
మనలో ఒక రాజుంటాడు..
రాజులా ఆలోచించడం ఎప్పుడో మానేశాం!
అడవులని మోడు చేసైనా,
సముద్రాలని ఆవిరి చేసైనా
ఏదైనా సాధ్యం చేయగలం
అయినా, భయానికి బానిసయ్యాం.
ఓటమికి తలొంచేసాం !
చాలా మంది రాజులు- ఓడిపోయారు,
పారిపోయారు, దాక్కున్నారు, దాసోహమయ్యారు.
కొందరే – అన్నీ పోగొట్టుకున్నా
మళ్ళీ యుద్ధం చేశారు.
రాజ్యాలున్నా, చేజారినా
రాజసం కోల్పోకు..
రాజంటే కిరీటం, కోట, పరివారం కాదు,
రాజంటే ధైర్యం.
రాజంటే ధర్మం.
రాజంటే యుద్ధం.
రాజంటే స్థానం కాదు,
రాజంటే స్థాయి!

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834

➡️