అవకాడోతో ఆహా అనాల్సిందే…

Dec 15,2024 09:13 #Cooking, #receptionis, #Sneha

సాంకేతికత పెరిగే కొద్దీ ప్రపంచం చిన్నదవుతోంది. ఒక కాలానికి.. ఒక ప్రాంతానికి పరిమితమైన పదార్థాలు, రుచులూ అన్నివేళలా అన్నిచోట్లా ప్రత్యక్షమవుతున్నాయి. ఆన్‌లైన్‌ వ్యాపారం అన్నింటినీ అందుబాటులోకి తెచ్చింది. అలా పరిచయమైన వాటిలో ఒక పండు అవకాడో. ఇది అమెరికాకు చెందినది. అంటుకట్టే విధానం ద్వారా కుండీలలోనూ పెరుగుతుంది. ఈ పండులో మృదువైన ఆకుపచ్చని గుజ్జు, మధ్యలో ఒకే విత్తనం ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలున్నాయి. అవకాడోలో ఉండే బీటా-సిటోస్టెరాల్‌ ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్‌ను అందించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్తపోటును తగ్గిస్తే.. ల్యుటిన్‌, జియాక్సంతిన్‌లు కంటి ఆరోగ్యాన్నిస్తాయి. విటమిన్‌ కె ఎముకల గట్టితనానికి, ఫోలేట్‌ డిప్రెషన్‌ని తగ్గించటంలో, ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచటంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. ఇన్ని ప్రయోజనాలున్న అవకాడోతో కొన్ని వెరైటీలు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం.


మిల్క్‌షేక్‌..
కావలసినవి : అవకాడో, అరటిపండు- ఒక్కొక్కటి చొప్పున, జీడిపప్పు-6, తేనె-2 స్పూన్లు, యాలకుల పొడి-1/4 స్పూను, పాలు-కప్పు (200 మి.లీ.)
తయారీ : అవకాడో, అరటిపండుని ముక్కలుగా కట్‌ చేసి జార్‌లోకి తీసుకోవాలి. దానిలో జీడిపప్పు, తేనె, యాలకుల పొడి, పాలు పోసి మిక్సీ పట్టాలి. అంతే అవకాడో మిల్క్‌ షేక్‌ రెడీ. డ్రైఫ్రూట్‌ పలుకులతో గార్నిష్‌ చేసి, సర్వ్‌ చేయటమే. చల్లగా తాగాలంటే ఐస్‌క్యూబ్స్‌ వేసుకోవచ్చు. దీనిని పిల్లలు ఎంతో ఇష్టపడతారు.


సలాడ్‌..
కావలసినవి : అవకాడో-2, కీరాదోస- ఒకటి, ఉల్లిపాయ-ఒకటి, టమాటా-ఒకటి, కొత్తిమీర-కట్ట, నిమ్మచెక్క- ఒకటి, మిరియాల పొడి-1/2 స్పూను, ఉప్పు- తగినంత
తయారీ : ముందుగా అవకాడో గింజలు, పై పెచ్చు తీసేసి సన్నగా తరిగి ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. కీరాదోస, ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీరను కూడా సన్నగా తరిగి, అవకాడో ముక్కల్లో వేయాలి. వీటిలో మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం పిండి అన్నింటినీ బాగా కలపాలి. అంతే యమ్మీ యమ్మీగా ఉండే అవకాడో సలాడ్‌ రెడీ. ఇది వారానికి ఒకసారి తిన్నా శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.


రోటీ..
కావలసినవి : అవకాడోలు-2, గోధుమపిండి-2 కప్పులు, దంచిన వెల్లుల్లి-స్పూను, మిరియాల పొడి-స్పూను, ఉప్పు- తగినంత, నిమ్మరసం- 2 స్పూన్లు
తయారీ : ముందుగా అవకాడోలో గింజలు, పైపెచ్చు తీసివేసి, గుజ్జును ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని పప్పుగుత్తితో మెత్తగా మెదపాలి. దానిలో వెల్లుల్లి, మిరియాల పొడి, ఉప్పు, నిమ్మరసం అన్నీ వేసి ఒకసారి కలపాలి. తర్వాత గోధుమపిండి వేసి చపాతీ పిండిలా కలపాలి. పది నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి. ఆ తర్వాత చపాతీలుగా ఒత్తుకుని పెనంపై వెన్న లేదా నూనె రాసి రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలి. ఇది పప్పు కూర, ఇగురు కూరలతో చాలా రుచిగా ఉంటుంది.


శాండ్‌విచ్‌..
కావలసినవి : అవకాడో-2, బ్రెడ్‌ స్లైసెస్‌-4, ఉల్లిపాయ-ఒకటి, టమాటా-ఒకటి, మిరియాల పొడి-1/2 స్పూను, పచ్చిమిర్చి తరుగు-స్పూను, నిమ్మ చెక్క, ఉప్పు- తగినంత, వెన్న-తగినంత, కొత్తిమీర
తయారీ : అవకాడో గింజ, పైపెచ్చు తీసి గుజ్జును ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆ గుజ్జులో, ఉల్లిపాయ, టమాటా సన్నని ముక్కలు, మిరియాల పొడి, పచ్చిమిర్చి తరుగు, నిమ్మ రసం, సాల్ట్‌, కొత్తిమీర అన్నింటినీ బాగా కలపాలి. పెనం మీద వెన్న రాసి బ్రెడ్‌ స్లైసెస్‌ను రెండు వైపులా కాల్చాలి. ఈ స్లైసెస్‌ మధ్యలో పై మిశ్రమాన్ని ఉంచి, ఆ బ్రెడ్‌ ముక్కలను క్రాస్‌గా కట్‌ చేయాలి. అంతే అవకాడో శాండ్‌విచ్‌ రెడీ.

➡️