Jul 25,2021 22:12
  • రైతులకు కంపెనీలు అద్దె చెల్లింపు
  • పాతికేళ్ల అగ్రిమెంట్‌
  • కేంద్ర పథకం అమలుకు రాష్ట్రం ఉవ్విళ్లు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-అమరావతి : రైతుల పంట భూములను ప్రైవేటు సౌర విద్యుదుత్పత్తి కంపెనీలకు ధారాదత్తం చేసే కేంద్ర 'పథకం' ఊపందుకుంది. 'పిఎంాకుసుం' స్కీంలో అంతర్భాగంగా ప్రతిపాదించిన ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా అమలు పరిచేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 'పిఎంాకుసుం'లోని అంశాలు పైకి రైతులకు మేలు చేసేవిగా కనిపిస్తున్నా అసలు రహస్యం మాత్రం కారుచౌకగా కార్పొరేట్లకు రైతుల భూములు అప్పగించడానికేనని తెలుస్తోంది. రైతులు తమ భూములను సౌర విద్యుదుత్పత్తికి అవసరమైన సోలార్‌ ఫలకాల ఏర్పాటుకు కంపెనీలకు అద్దెకు ఇవ్వాల్సి ఉంటుంది. అందుకోసం విద్యుదుత్పత్తి కంపెనీతో రైతులు ఒప్పందం కుదుర్చుకోవాలి. అగ్రిమెంట్‌ కాలపరిమితి 25 సంవత్సరాలపాటు ఉంటుంది. అప్పటి వరకు రైతులకు కంపెనీలు చెల్లించే అద్దె పెరగదు. ఏడాదికి ఎకరానికి రైతులకు కంపెనీలు రూ.లక్ష వరకు అద్దె చెల్లిస్తాయని చెబుతున్నారు.

భూసేకరణ నుండి తప్పించుకునే ఎత్తు..
ఒక మెగావాట్‌ సామర్ధ్యం కలిగిన విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ఆరెకరాలు కావాలి. సదరు ప్లాంట్‌లో 13 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. సంప్రదాయేతర విద్యుత్‌ను ప్రోత్సహించే దాంట్లో భాగంగా విద్యుత్‌ కంపెనీలకు, రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు వర్తిస్తాయి. భూములు అద్దెకు ఇచ్చిన రైతులకు నెలకు వెయ్యి యూనిట్లు ఉచితంగా విద్యుత్‌ అందిస్తారు. విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అవసరమైన ఖర్చులో కేంద్రం 30 శాతం, రాష్ట్రం 30 శాతం రాయితీ రాయితీ ఇస్తాయి. తతిమ్మా 40 శాతాన్ని ప్రైవేటు విద్యుత్‌ సంస్థలు పెట్టుకోవాలి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను కంపెనీలు ప్రభుత్వానికి, లేదా ప్రైవేటు సంస్థలకు విక్రయించుకొనే వీలు కల్పించారు. మెగా సౌర విద్యుత్‌ ప్లాంట్లకు భూముల సేకరణ, 2013-భూసేకరణ చట్టం ప్రకారం భూములిచ్చిన రైతులకు పరిహారం అందించడం ఇబ్బందిగా పరిణమించడంతో కేంద్రం 'పిఎం-కుసుం' పథకాన్ని తెచ్చిందని తెలుస్తోంది.

కార్పొరేట్లకు వాటం..
రైతుల పచ్చని పంట పొలాలను కంపెనీల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని సమాచారం. రైతులకు చెల్లించే అద్దె కొంచెం ఆశాజనకంగానే కనిపిస్తున్నా, ప్రైవేటు సంస్థలు ఆ భూముల్లో చేసే వ్యాపారంతో పోల్చితే అది నామమాత్రం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి భారీగా రాయితీలు, తాము నిర్ణయించిన ధరలకు విద్యుత్‌ అమ్మకాలు వెరసి ప్రైవేటు సంస్థలకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు కురిపిస్తాయి. రైతులు పాతికేళ్ల పాటు తమ భూములను వదిలేసి చోద్యం చూడాలి.