గొప్ప మానవతావాది డాక్టర్‌ జ్యోతి

Jan 23,2024 12:40 #Dr. Jyoti, #katuru, #tribute

కాటూరు : కృష్ణా జిల్లా కాటూరుకు చెందిన నాగళ్ళ రాజేశ్వరమ్మ, జానకి రామయ్యల ఏకైక కుమార్తె డాక్టర్‌ జ్యోతి (82) గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్త విన్న పార్టీ నేతలు, సానుభూతిపరులు, సన్నిహితులు ఆమెకు విప్లవ జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ జ్యోతి మానవీయకోణాన్ని ఆమె సేవలను నేతలు స్మరించుకున్నారు. నివాళులర్పించారు. ఎపి మహిళా సంఘం నాయకులు రమాదేవి, స్వరూపారాణి, తదితరులంతా డాక్టర్‌ జ్యోతికి నివాళులర్పించారు.

విప్లవ జోహార్లు అర్పించిన సత్తెనపల్లి మాజీ ఎంఎల్‌ఎ పుతుంబాక భారతి

సత్తెనపల్లి మాజీ ఎంఎల్‌ఎ పుతుంబాక భారతి సంతాపం తెలియజేస్తూ … జ్యోతి మృతికి విప్లవ జోహార్లు అర్పించారు. భారతి మాట్లాడుతూ … డాక్టర్‌ జ్యోతి సంపన్న కుటుంబంలో జన్మించారని అన్నారు. తన తల్లి రాజేశ్వరమ్మ వారసురాలిగా ఆమె అడుగుజాడల్లో నడిచారని తెలిపారు. పార్టీ నియమాలను తూ.చ తప్పకుండా అమలుజరుపుతూ వచ్చారని వివరించారు. వారిది చాలా సంపన్న కుటుంబం అని, జ్యోతి ఒక్కరే వారసురాలు అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీతోను, పేదలతోనూ వారి కుటుంబానికి చాలా అనుబంధం ఉందన్నారు. సంపన్న కుటుంబమైనప్పటికీ ఆమె సామాన్యురాలిగా ఉంటూ మానవతాదృక్పథంతో అన్నింటికీ స్పందించడం గొప్ప విషయమన్నారు. డాక్టర్‌ జ్యోతికి విప్లవ జోహార్లు అర్పించారు.

గొప్ప మానవతావాది డాక్టర్‌ జ్యోతి అని, ఆమె తన జీవితమంతా తన తల్లి ఆశయాలను కొనసాగించి.. పేదవారికి ఎనలేని సేవలందించారని .. వైద్యులు సైతం ఆమె సేవలను చూసి విస్మయం చెందేవారని ఎపి మహిళా సంఘం నాయకురాలు స్వరూపారాణి స్మరించుకున్నారు.

డాక్టర్‌ జ్యోతి మానవత్వాన్ని స్మరించుకుంటూ … స్వరూపారాణి మాటల్లో….

1980 నుండి జ్యోతితో తనకు పరిచయముందన్నారు. రాజేశ్వరమ్మ, జానకి రామయ్యల ఏకైక కుమార్తె డాక్టర్‌ జ్యోతి.. ఇండియాలో చదువు పూర్తయ్యాక ఎనస్తీషియన్‌ గా దాదాపు అన్ని దేశాల్లో వైద్య వృత్తిని చేశారు. హైదరాబాద్‌లో కూడా ప్రాక్టీస్‌ పెట్టారు. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు తన తల్లిదండ్రులకు సేవ చేయాలన్న ఆలోచనతో స్వగ్రమానికి వచ్చి స్థిరపడ్డారు. హాస్పిటల్‌కు వచ్చిన పేదవారికి ఉచితంగా వైద్య సేవలందించేవారు. పేదవారికి సాయమందించేవారు. గుడి దగ్గర ఉండేవాళ్లకు భిక్షం వేస్తూ చలికాలాల్లో వారికి దుప్పట్లు ఇస్తూ మానవత్వం చూపేవారు. తల్లిదండ్రుల మరణానంతరం కూడా తన ఇంట్లో అవసరం లేనప్పటికీ ఐదుగురు పనివాళ్లను పోషించేవారని.. వాళ్ల ఉపాధి తీసేస్తే వాళ్లు ఎలా బతుకుతారని అందుకే వారిని కొనసాగిస్తున్నానని తనతో చెప్పేవారని స్వరూపారాణి గుర్తు చేసుకున్నారు. వారందరి జీతాల కోసం నెలకు లక్ష రూపాయల వరకు ఖర్చయ్యేదన్నారు. వారి ఖర్చులన్నీ భరించేవారని తెలిపారు.

జ్యోతి తల్లి రాజేశ్వరమ్మ ఉద్యమ నిర్మాత….

డాక్టర్‌ జ్యోతి తల్లి కృష్ణా జిల్లా మహిళా ఉద్యమ నిర్మాత రాజేశ్వరమ్మ అని తెలిపారు. 1936 నుండి రాజేశ్వరమ్మ అన్ని రాష్ట్రాల్లో, జిల్లాల్లో ఉద్యమిస్తూ పనిచేశారని చెప్పారు. రాజేశ్వరమ్మ తెలంగాణ సాయుధ పోరాట సమయంలో తన ఇంటిలోనూ, అండర్‌ గ్రౌండ్‌లలోనూ, రాత్రిపూట గ్రామాల్లోనూ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యపరిచేవారని చెప్పారు. ఆ సమయంలో డాక్టర్‌ జ్యోతి పసిపిల్లగా ఉన్నారని, నిర్విరామంగా ఉద్యమిస్తుండే రాజేశ్వరమ్మ తన బిడ్డకు దగ్గరుండి తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో ఉండేవారని.. ఆమె పెద్దమ్మ వచ్చి పిల్లకు తిండి పెట్టేదని తెలిపారు. తన తల్లి పోరాటపటిమను జ్యోతి గుర్తించుకొని అమ్మ అడుగుజాడలనే అనుసరించారని అన్నారు. తన తల్లి సేవలు చిరస్మరణీయంగా ఉండాలన్న ఆశతో ఉయ్యూరులో పార్టీ కేంద్రాన్ని విజ్ఞాన కేంద్రంగా మార్చారని తెలిపారు. దాదాపు రూ.30 లక్షలు ఖర్చు పెట్టి ఆ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారని అన్నారు. సమావేశాలకు ఎలాంటి ఇబ్బందీ కలగకుండా వెంటనే జెనరేటర్‌ను తెప్పించారని అన్నారు. ట్రస్ట్‌ నడవడానికి రూ.25 లక్షలు ఫండ్‌గా ఇచ్చారని అన్నారు.

తన తల్లిదండ్రుల పేరుతో ఉన్న ట్రస్ట్‌కే అంతా ఇచ్చేశారు…

తన ఆస్తికి సంబంధించిన వీలునామాను చివరి 15 రోజుల్లో మార్చి … తన మిగతా డబ్బంతా తన తల్లి పేరుతో ఉన్న ట్రస్ట్‌కి ఇవ్వాలని కొత్తగ వీలునామా రాశారని స్వరూపారాణి వివరించారు. ఆ సమయంలో తాను కూడా అక్కడ ఉన్నానని తెలిపారు. ఎవరైనా పేదవారికి అత్యవసర వైద్య సేవలు అవసరమైతే స్వయంగా తన కారులో వారిని ఆసుపత్రులకు పంపేవారనీ, వారి ఖర్చులన్నీ భరించేవారని చెప్పారు. డాక్టర్‌ జ్యోతి కమ్యూనిస్టు కాకపోయినప్పటికీ ఎంతో ఆదర్శంగా పేదవారికి అండగా నిలబడి తన తల్లి ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ప్రతీ సంవత్సరం మహిళా సంఘానికి, ప్రజా నాట్యమండలికి, ప్రజాశక్తి పేపర్‌కి తన తల్లి వర్థంతి రోజున యాడ్స్‌ ఇచ్చేవారని అన్నారు. విజ్ఞాన కేంద్రంలో చదువుకునేవారికి ముఖ్యంగా పేద మహిళలకి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కి అవసరమైనవన్నీ ఏర్పాటు చేయాలన్నదే ఆమె తాపత్రయమన్నారు. ఆమె మంచంపై ఉన్నప్పుడు కూడా ట్రస్ట్‌ లోని కార్యకలాపాల గురించి వివరాలు అడిగేవారని తెలిపారు. తన తల్లి ఎక్కువగా ఉద్యమించిన ఉయ్యూరులోనే … తన తల్లిదండ్రులు రాజేశ్వరమ్మ, జానకి రామయ్యల పేరుతో విజ్ఞాన కేంద్రం ద్వారా పేదవారికి సేవలందించాలన్నదే తన ఆశయమని, ఆమె చనిపోతూ కూడా ట్రస్ట్‌కు ఎలాంటి ఇబ్బందీ లేకుండా తన మిగతా బ్యాంకు బ్యాలన్స్‌నంతా ఇచ్చేశారని ఆమె గొప్ప మానవతావాది అని స్వరూపారాణి వివరించారు.

➡️