- రూ.151.77 కోట్లు సాయం చేయాలి
- ఖరీఫ్ 2024 కరువు సాయంపై కేంద్రానికి నివేదిక
- రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా
- కేంద్ర బృందంతో సమావేశం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో కరువు పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన కేంద్ర బృందం సభ్యులు రైతులకు సాయం అందించేలా ఉదారంగా స్పందించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా కోరారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయంలో గురువారం కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమశాఖ జాయింట్ సెక్రటరీ పెరిన్ దేవి నేతృత్వంలోని కేంద్ర బృందంతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను వారికి వివరించారు. ఖరీఫ్ 2024 కరువు పరిస్థితులు, పంట నష్టం వివరాలపైనా నివేదిక అందించారు. ఐదు జిల్లాల్లో 1.06 లక్షల హెక్టార్లలో 1.44 లక్షల మంది రైతులు నష్టపోయారని తెలిపారు. వారిని ఆదుకునేందుకు రూ.151.77 కోట్లు సాయం చేయాలని కోరారు. ఐదు జిల్లాల్లో 54 మండలాలు (అన్నమయ్య 19, చిత్తూరు 16, సత్యసాయి 10, అనంతపురం 7, కర్నూలు 2) మండలాను ప్రకటించామని తెలిపారు. వాటిల్లో 27 తీవ్ర కరువు మండలాలుగానూ, 22 మధ్యస్థ కరువు మండలాలుగానూ కేంద్ర నిబంధనల ప్రకారమే కరువుగా ప్రాంతాలుగా ప్రకటించామని తెలిపారు. పత్తి, జొన్న, వేరుశనగ, ఎర్రశనగలు, మొక్కజొన్న వంటి 14 రకాల పంటలు దెబ్బతిన్నాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష మంది రైతులకు రూ.16.67 కోట్ల వ్యయంతో 80 శాతం సబ్సిడీకి విత్తనాలు, రూ.55 కోట్ల వ్యయంతో పశుగ్రాసం విత్తనాలు 60 శాతం సబ్సిడీపై అందించామని తెలిపారు. 40 శాతం సబ్సిడీపై చాప్ కట్టర్లు, మందుల సరఫరా వంటి ఉపశమన చర్యలు చేపట్టామని సిసోడియా వివరించారు. వ్యవసాయశాఖ ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రూ.90.52 కోట్లు, రూరల్ వాటర్ సరఫరా కోసం రూ.0.72 కోట్లు, అర్బన్ వాటర్ సరఫరా కోసం రూ.4.89 కోట్లు, పశు సంవర్థకశాఖకు రూ.55.47 కోట్ల ఆర్థికసాయం అవసరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కరువు నష్టానికి సంబంధించి వాస్తవిక వివరాలను అందించామని రైతులను ఆదుకోవడానికి సత్వరమే రూ.151.77 కోట్లు సాయం చేయాలని కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ పెరిన్‌దేవి మాట్లాడుతూ కరువు వల్ల నష్టపోయిన పంటల వివరాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడించారు. పంట నష్టం జరిగి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు చూస్తామని చెప్పారు. కరువు ప్రాంత జిల్లాల్లో వాస్తవ పరిస్థితులను గమనించామని, అన్ని విషయాలనూ సమగ్రంగా కేంద్రానికి నివేదిస్తామని చెప్పారు. వీలైనంత త్వరంగా సాయం అందించేందుకు సహకారాన్ని అందిస్తామని హామీనిచ్చారు. కేంద్రం బృందంలో సుప్రియా మాలిక్, అనూరాధ బట్నా, దీపాంకర్ సేథ్, ప్రదీప్‌కుమార్, మన్నూజీ ఉపాధ్యాయ, జయంతి, కె.పొన్నుస్వామి తదితరులు ఉన్నారు.