రోజుకు 20 గంటలు డ్యూటీ!

  • కనీస వేతనం, చట్టబద్ధ హక్కులు కరువు
  • ఎలక్ట్రికల్‌ ఎసి బస్సుల కాంట్రాక్టు డ్రైవర్ల వెతలు

ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో : వారు పనిచేసేది ఎసి బస్సుల్లో. వారి జీవితాలు మాత్రం కష్టాల కొలిమే. రోజుకు 20 గంటల వరకూ పని చేయాల్సి వస్తోంది. ఆ తర్వాత ఒక రోజు సెలవు ఇచ్చినా ఆ మరుసటి రోజు మళ్లీ అన్నే గంటలు వారితో పని చేయించుకున్నారు. రోజుకు 20 గంటలపాటు నెలలో 15 రోజులు పనిచేస్తే వారికి నెలకు వచ్చే వేతనం రూ.20 వేలు మాత్రమే. నెలకు 180 గంటలు పని చేయాల్సి ఉండగా, దాదాపు 300 గంటలకుపైన వెట్టిచాకిరీ చేయాల్సి వస్తోంది. యూనిఫాం, గుర్తింపు కార్డులు, ఇఎస్‌ఐ, పిఎఫ్‌లు వంటి చట్టబద్ధమైన హక్కులేవీ వారికి అమలు కావడం లేదు. తిరుమల శ్రీవారి పాదాల చెంత అలిపిరి డిపోలో ఎలక్ట్రికల్‌ ఎసి బస్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు డ్రైవర్ల దీనగాథ ఇది.

తిరుపతి రీజియన్‌ పరిధిలో అలిపిరి డిపో నుంచి మాత్రమే ఎలక్ట్రికల్‌ ఎసి బస్సులు తిరుగుతున్నాయి. మొత్తం వంద బస్సులు ఉన్నాయి. వీటిలో 50 బస్సులను తిరుపతి-తిరుమల మధ్య, తిప్పుతున్నారు. మిగిలిన బస్సులను తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, తిరుపతి నుంచి నెల్లూరు నాన్‌స్టాఫ్‌ సర్వీసులుగా నడుపుతున్నారు. తిరుపతిలోని అలిపిరి నుంచి తిరుమలకు తిరుగుతున్న ఈ బస్సుల్లో పనిచేస్తోన్న కాంట్రాక్టు డ్రైవర్లు కట్టుబానిసలుగా పనిచేయాల్సి వస్తోంది. తెల్లవారుజామున మూడు గంటలకు డ్యూటీకి హాజరైతే రాత్రి 11 గంటలకు డ్యూటీ దిగుతున్నారు. అలిపిరి నుంచి తిరుమలకు రోజుకు ఐదు ట్రిప్పులు తప్పనిసరిగా తిరగాలి. వెనువెంటనే ఈ బస్సులకు అనుమతిస్తే 12 నుంచి 14 గంటల్లో వీటి డ్యూటీ పూర్తవుతుంది. అయితే, ఈ బస్సులను వెనువెంటనే అనుమతించకపోవడం, బ్యాటరీ ఛార్జింగ్‌కు గంటల సమయం పడుతుండడంతో నిర్దేశించిన త్రిప్పులు పూర్తి కావడానికి 20 గంటల వరకూ సమయం పడుతోందని డ్రైవర్లు వాపోతున్నారు. 1,960 మోటార్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యాక్ట్‌ ఛాప్టర్‌ 1లో సెక్షన్‌ 1, 2 ప్రకారం 12 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉన్నప్పటికీ అదనంగా ఎనిమిది గంటల వరకూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఆదాయం అంతా బస్సు యజమాన్య సంస్థ మెగా’ కంపెనీకి వెలుతోంది. ఆర్‌టిసి అలిపిరి డిపో మేనేజర్‌కు నిర్వహణ బాధ్యత మాత్రమే ఉంటోంది. ఎలక్ట్రానిక్‌ వాహనాలకు ఇన్స్యూరెన్స్‌ ఉన్నప్పటికీ ఏదైనా అద్దం పగిలినా, బస్సు డ్యామేజీ అయినా బీమా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే, డ్రైవర్లకు ఇచ్చే అరకొర జీతంలోనే కాంట్రాక్టర్‌ సంస్థ కోత పెడుతోంది.

పనిగంటలు తగ్గించి జీతం పెంచాలి :జి.బాలసుబ్రమణ్యం, ఎలక్ట్రికల్‌ బస్సు కాంట్రాక్టు వర్కర్ల యూనియన్‌ తిరుపతి జిల్లా గౌరవాధ్యక్షులు

అలిపిరి డిపో పరిధిలో పనిచేస్తున్న ఎలక్ట్రికల్‌ ఎసి బస్సు కాంట్రాక్టు డ్రైవర్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రోజుకు 20 గంటల వరకూ పని చేయించుకుంటున్నారు. ఇస్తున్న తక్కువ జీతం కూడా పదో తేదీ తర్వాతే చెల్లిస్తున్నారు. ఆర్‌టిసి యాజమాన్యం, ప్రభుత్వం జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలి. పని గంటలు తగ్గించి జీతం పెంచి సకాలంలో చెల్లించాలి.

అగ్రిమెంట్‌ ప్రకారం పనిచేయాల్సిందే : సింగం హరిబాబు, డిపో మేనేజర్‌, అలిపిరి

మెగా సంస్థతో ఎలక్ట్రికల్‌ బస్సు డ్రైవర్లు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం పనిచేయాల్సిందే. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ ఆ సంస్థే చూసుకుంటుంది. జీతభత్యాల బాధ్యత వారిదే. మాకు ఏ సంబంధమూ లేదు. మమ్మల్ని మాత్రం నిర్వహణ బాధ్యత చూసుకోమని చెప్పారు. ఆ ప్రకారమే మేం పనిచేయించుకుంటున్నాం. రోజుకు ఐదు ట్రిప్పులు ఎంత త్వరగా పూర్తయితే అంత త్వరగా ఇళ్లకు వెళతారు.

➡️