- ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే రూ.3,752 కోట్లు
- యూనియన్ బ్యాంకు రుణాలు రూ.1,687.99 కోట్లు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో బ్యాంకింగ్ రంగంలో నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ (ఎన్‌పిఎ) పెరిగిపోతున్నాయి. నాన్ ప్రయారిటీ రంగంలో బకాయిల సంఖ్య వందల కోట్ల నుండి వేల కోట్లలోకి చేరింది. వీటిపై బ్యాంకర్లు పెద్దయెత్తున ఆందోళన చెందుతున్నారు. రుణాలు తీసుకున్న సంస్థలు తిరిగి చెల్లింపులు చేయకపోవడంతో సమస్య జఠిలమవుతోందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎన్‌పిఎల సంఖ్య ఎక్కువగా ఉంటోందని, రుణాలు తీసుకున్న సంస్థలు తిరిగి చెల్లింపులు చేయడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, వాటిని వసూలు చేయడం తలకుమించి పనిగా మారుతోందని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే రుణాల్లోనూ తమ సెక్టార్ నుండే ఎక్కువ రుణాలు ఇస్తున్నామని, కమర్షియల్ బ్యాంకుల నుండి ఇచ్చే రుణాలు తక్కువగా ఉంటున్నాయని, దీంతో ఎన్‌పిఎల సంఖ్య ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువగా ఉంటోందని బ్యాంకు అధికారుల సంఘం నాయకులు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 33 బ్యాంకులు, ఒక కో-ఆపరేటివ్ బ్యాంకు, నాలుగు ఆర్‌ఆర్‌బిలు, మూడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 71,66,390 ఖాతాలు ఉండగా, వాటికి గానూ 3,46,550.93 కోట్లు రుణాలిచ్చారు. అలాగే 2,47,648 ఖాతాలకు సంబంధించి రూ.6,358.96 కోట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి ఎన్‌పిలుగా మారాయి. వీటిల్లో ముఖ్యంగా యూనియన్ బ్యాంకుకు సంబంధించిన 29,490 ఎన్‌పిఎ ఖాతాలకు రూ.1,687.99 కోట్లు ఉన్నాయి. మొత్తంగా ఈ బ్యాంకు 2024 మార్చి 31 నాటికి 4,26,544 ఖాతాలకు రూ.41,500 కోట్ల రుణాలిచ్చింది. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.1,11,407 కోట్లు ఇవ్వగా, ఈ బ్యాంకుకు సంబంధించిన ఎన్‌పిఎగా మారిన రుణాలు రూ.475.79 కోట్లున్నాయి. అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించి రూ.662.68 కోట్లు ఎన్‌పిఎలుగా మారాయి. ఎపి కో-ఆపరేటివ్ బ్యాంకు రూ.8,102 కోట్ల రుణాలిస్తే.. రూ.424 కోట్ల బకాయి ఉంది. ఎపిజిబి, ఎపి గ్రామీణ వికాస్ బ్యాంకు, సిజిజిబి, సప్తగిరి గ్రామీణ బ్యాంకులకు సంబంధించి మొత్తం రూ.91.76 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఈక్విటీస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు లిమిటెడ్ రూ.12 కోట్లు, పిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు రూ.5 కోట్లు బకాయిలున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనే ఎక్కువ రుణాలు
రాష్ట్రంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు 13, ప్రైవేటు రంగ బ్యాంకులు 21 ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 28,09,024 ఖాతాలు ఉండగా, రూ.2,32,558.05 కోట్ల రుణాలిచ్చాయి. వాటిల్లో రూ.3,752.47 కోట్లు బకాయిలున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకుల్లో 38,61,568 ఖాతాలుంటే రూ.99,820.87 కోట్ల రుణాలిచ్చాయి. ఈ బ్యాంకుల్లో రూ.2,072 కోట్లు బకాయిలున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలన్నా తక్కువ మొత్తం తీసుకుంటాయి.
ప్రైవేటురంగ బ్యాంకులో ఖాతాలు తెరవాలంటే రూ.1100 నుండి రూ.5000 వరకూ కనీస మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఆ రూపంలోనే వాటి దగ్గర ఎక్కువ డిపాజిట్లు జమవుతున్నాయి. కానీ రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం ఆసక్తి చూపించడం లేదని ఇటీవల ప్రభుత్వం వెల్లడించిన ఓ నివేదికలో బయటపడింది.