సంధి కాలంలో ఖరీఫ్‌ రైతు

Jun 10,2024 08:14 #Farmer, #Kharif, #Seeds
  • వర్షాల వేళ విత్తనాల చెర
  •  సీమలో వేరుశనగ సమస్య
  • అరకొరగా సబ్సిడీ సీడ్‌
  • అదీ నాసిరకం సరఫరా
  • ఆర్‌బికెలకు వాపస్‌ ఇస్తున్న వైనం
  • కొత్త ఎంఎల్‌ఎలపై ఒత్తిడి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : శాసనసభ ఎన్నికలు, కొత్త ప్రభుత్వ ఏర్పాటు.. ఈ సంధి కాలంలో ఖరీఫ్‌ రైతు ఉన్నాడు. గత సంవత్సరం సరైన వానల్లేక సీజన్‌ అస్తవ్యస్తంగా నడిచింది. పంటల సాగు విస్తీర్ణం తగ్గిపోగా, వేసిన పంటలు నష్టపోయాయి. ఈ ఏట రుతుపవనాలు కొంచెం ముందుగా పలకరించడంతో రాయలసీమలో ఒక మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సరిగ్గా ఈ సమయంలో విత్తనాల సమస్య తలెత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సీమలో ప్రధాన పంట వేరుశనగ. చినుకు పడగానే వేరుశనగను సాగు చేయడం రైతులకు రివాజు. కానీ వానలు పడుతున్నా విత్తనం రైతులకు తగినంతగా అందుబాటులో లేదు. సబ్సిడీ విత్తనాల సేకరణ సజావుగా జరగలేదు. ఎన్నికలు కదా ఎవరూ అడగరులే అనుకున్న అధికారులు నాసిరకం వేరుశనగ విత్తనాలను, అదీ అరకొరగా సేకరిస్తున్నారు. పంపిణీ మొదలైన నాలుగైదు రోజుల్లోనే విత్తనాలు అయిపోయాయి. మరోవైపు పంపిణీ జరిగిన చోట నాణ్యతలేని విత్తనాలిచ్చారని రైతులు ఆగ్రహంతో వాపస్‌ ఇస్తున్నారు. రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) సిబ్బంది ఎలాగోలా రైతులను సముదాయించి పంపుతున్నారు. నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం, మంత్రివర్గ కూర్పులపై కొత్తగా గెలుపొందిన టిడిపి ఎంఎల్‌ఎలు బిజీగా ఉన్నారు. సీజన్‌ గడిచిపోతుందన్న ఆవేదనలో రైతులు తమకు విత్తనాలందించాలని ఎంఎల్‌ఎలపై డిమాండ్‌ తెస్తున్నారు. ఈ పరిస్థితి తమకు, ప్రభుత్వానికి సంకట స్థితేనన్న అభిప్రాయం అధికార టిడిపిలో వ్యక్తమవుతోంది.

గతేడాది ప్రామాణికంగా…
నిరుడు రుతుపవనాలు వైఫల్యం చెందిన కారణంగా సీమ జిల్లాల్లో సరైన వానలు పడలేదు. కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సాగు విస్తీర్ణం తగ్గింది. కాగా నిరుడు ఆర్‌బికెలలో ఎంత పరిమాణంలో సబ్సిడీ విత్తనాలు అమ్మారో అంత మేరకే ఇండెంట్‌లు తీసుకొని ఆ మేరకే విత్తనాలను సరఫరా చేశారు. నిరుడు కరువు వలన ఖరీఫ్‌, రబీలో సాగు చేసిన పంట దెబ్బతిన్నది. కర్ణాటక, మహారాష్ట్రలోనూ కరువు ఉంది. ఆ కారణంగా బహిరంగ మార్కెట్‌లో సైతం వేరుశనగ విత్తనానికి కొరత ఉంది. దాంతో సబ్సిడీ విత్తనాల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. సరిగ్గా ఇప్పుడే ఆర్‌బికెలలో విత్తనం లేదు.

నాణ్యత తీసికట్టు
కంపెనీలకు కాంట్రాక్టులిచ్చి అరకొరగా సేకరించిన విత్తనం సైతం నాసిరకంగా ఉందని ఆరోపణలొస్తున్నాయి. ఎన్నికల సమయం కావడంతో జిల్లాల డిఎఒలు నేరుగా ప్రాసెసింగ్‌ కేంద్రాలతో మాట్లాడుకొని ఒక్కో లారీ లోడుకు ఇంత అని కమీషన్లు జేబులో వేసుకున్నారని, ప్రాసెసింగ్‌ సరిగ్గా చేయని విత్తనం ఆర్‌బికెలకు సరఫరా అయిందని విమర్శలొస్తున్నాయి. రైతులకు పంపిణీ చేసిన 30 కిలోల విత్తన కాయలను ఒలిస్తే 70 శాతానికి తక్కువ కాకుండా విత్తనాలు రావాలి. అంటే తక్కువలో తక్కువ 21 కిలోలు రైతుకు రావాలి. కానీ చాలాచోట్ల 20 కిలోలు కూడా రావట్లేదు. నిర్ణీత నాణ్యతా ప్రమాణాల కంటే చాలా ఎక్కువ మోతాదులో చెత్త, చెదారం, తాలు ఉండటంతో రైతులు సబ్సిడీ విత్తనాలను ఆర్‌బికెలకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళితే… లోడు దించుకునేటప్పుడే చూసుకోవాలంటూ ఎదురు సిబ్బందిపై నెపం వేస్తున్నారు. చేసేది లేక రైతులకు సిబ్బంది నచ్చజెప్పి పంపుతున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల్లో ఘన విజయాలతో ఖుషీగా మూడ్‌లో ఉన్న టిడిపి ఎంఎల్‌ఎలు, విత్తన సమస్యతో తమకు రైతుల్లో చెడ్డపేరు వస్తుందని మదన పడుతున్నారు.

➡️