నాయకుడు – సన్నిహిత మిత్రుడు

1978వ సంవత్సరం 3వ అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ మహాసభలు పాట్నాలో జరుగు తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధులతో కలిసి పాట్నా రైల్వే స్టేషన్‌లో దిగాము. తెల్లని కుర్తా, పైజామాలో సీతారాం, ఆ తర్వాత లుంగీతో ప్రకాశ్‌. ఇది మనసులో ముద్రించుకున్న రూపం. చివరగా 4 నాలుగు

నెలల క్రితం ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు ఇలా అర్ధాంతరంగా…
అప్పటినుండి ఇప్పటివరకు వారి నాయకత్వంలో పనిచేశాము. నాయకుడిగా మాత్రమే కాదు ఓ స్నేహితుడిగా కూడా! గుంటూరులో బహుశా అప్పుడు 1986 ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర క్లాసులు. సీతారాం బ్రాడీపేట ఇంటిలోనే మకాం. అప్పుడు గుంటూరు ఆఫీస్‌లో ఓ చిన్న టివిఎస్‌ ఉండేది. నరసింహా రావు ఆ బండి మీదనే తిప్పేవాడు.1988లో మన పార్టీ రాష్ట్ర మహాసభలు విజయవాడలో జరిగాయి. అప్పటికి భరత్‌ పుట్టి జస్ట్‌ నెల నిండి రెండవ నెల మాత్రమే. మహాసభలకు నేను ప్రతినిధిగా హాజరు కావాలని ప్రతిపాదన. రాలేనని చెప్పాను. అంగీకరించలేదు. ఉదయం 6.30 గంటలకి వెంకటపతిగారు గుంటూరు నుండి కారు తీసుకుని స్వయంగా మా ఊరులో అమ్మ వాళ్లింటికి వచ్చారు. తప్పించుకోవడానికి అవకాశాలు లేవు. వాడిని తీసుకుని సాయంగా పెద్దమ్మను వెంటబెట్టుకుని విజయవాడ వచ్చాము. స్టేట్‌ గెస్ట్‌ హవుస్‌లో బస. పక్కరూములో సీతారాం. మహాసభ మూడు రోజులు ఆయనతో కలిసి క్షేత్రయ్య కళాక్షేత్రంకి వెళ్లి రావడం. అప్పటినుండి ఎప్పుడు కలిసినా వాడి యోగక్షేమాల ప్రస్తావన వస్తుంది. ఎంహెచ్‌ గారి పలకరింపు మాదిరే!.

పిల్లలపై చూపిన ప్రత్యేక శ్రద్ధ ఆదర్శప్రాయం
లా చదువు పూర్తయ్యాక నేను 1985లో ఎస్‌ఎఫ్‌ఐ నుండి రిలీవ్‌ అయ్యాను. నరసింహారావు ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీలో ఉండేవారు. పరీక్షలు రాశాక తనతోపాటు నేను కూడా ఢిల్లీ వెళ్లాను. సీతారాం క్వార్టర్‌లోనే మా మకాం. ఆ తర్వాత నేను మహిళా కమిటీ సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు సీతారాం ఢిల్లీలో ఉంటే కలిసే అవకాశం ఉండేది. ఓ రోజు సాయంత్రం సమయంలో విపి హౌస్‌ ఎదురుగా బస్టాప్‌ దగ్గర సీతారాం ఎదురుచూస్తూ ఉన్నారు. ఎవరికోసం ఎదురుచూస్తూ ఉన్నారని అడిగా. ”పెద్దవాడు స్కూల్‌కి వెళ్లి వస్తాడు. వాడిని ఇంటికి తీసుకెళ్లడం కోసం” అన్నారు.
వర్కింగ్‌ పేరెంట్స్‌ అందులోనూ అమ్మానాన్న ఇద్దరూ పార్టీ పూర్తికాలం కార్యకర్తలైతే పిల్లలకు సమయాన్ని ఇవ్వలేని పరిస్థితులే! అప్పటికే ఆయన పెద్ద నాయకుడు. అలాంటివారు పిల్లల బాధ్యతను చూడడం మాలాంటి వారికి నాయకత్వం మీద ప్రేమ, విశ్వాసాన్ని మరింత పెంచింది.
గుంటూరు జిల్లా వెల్లటూరులో 2011లో మోటూరు హనుమంతరావు గారి విగ్రహ ఆవిష్కరణ. సీతారాం ముఖ్య అతిధి. ఆయన వస్తూ చిన్న కొడుకు డానిష్‌ను వెంటబెట్టుకుని వచ్చారు. మన రాష్ట్రం, తాను పుట్టి పెరిగిన ప్రాంతాలు ఓసారి చూపించే ప్రయత్నం. నిత్యం ఊపిరి సలపని పనులతో మునిగి తేలుతున్న ఓ తండ్రిగా బిడ్డలతో స్నేహంగా తగిన సమయం గడిపే ప్రయత్నం. ఆయన వ్యక్తిత్వానికి, కమ్యూనిస్టు ఔన్నత్యానికి ఓ చిహ్నం.
సహజమైన చిరునవ్వు, ప్రేమపూర్వక సంభాషణలు, అభిప్రాయాలను పంచుకునే లక్షణం, మార్క్సిజంపై చెక్కుచెదరని విశ్వసనీయత, లోతైన అవగాహన, మానవీయత, ఆయనను ప్రేమించని వారు ఎవరు ఉంటారు? ఇంత అకస్మాత్తుగా ఆయన దూరమవడాన్ని జీర్ణించుకోవడం ఎంతో కష్టం.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులుడి.రమాదేవి

➡️