ఎర్రజెండా ‘నీడ’లో..పేదల ‘గూడు’…!

Jan 23,2025 04:22 #25 colonies, #construction, #cpm, #Nellore
  • నెల్లూరులో 25 కాలనీల నిర్మాణం

ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి : రాష్ట్ర మహాసభకు సిద్ధమౌతున్న నెల్లూరు జిల్లాలో సిపిఎం పోరాటాలది ఒక ప్రత్యేక స్థానం! ఎర్రజెండా చేతపట్టి జిల్లా ప్రజానీకం చేసిన ఒక్కో పోరాటానికి ఒక్కో చరిత్ర! వాటిలో నెల్లూరు నగరంలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం కోసం జరిగిన పోరాటాలది ప్రత్యేక స్థానం! నాయకులు, కార్యకర్తలు నిరంతరం చేసిన ఈ పోరాటాల ఫలితంగా ఒకటి, రెండు కాదు. ఏకంగా 25 కాలనీలు నిర్మాణమయ్యాయి. వేలాదిమందికి’గూడు’ లభించింది. నగరం విస్తరించడం, ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు కల్పించడంతో వాటి విలువ కూడా పెరిగింది.
పేదలకు కూడు…గూడు…గుడ్డ… ప్రభుత్వాల నినాదాలు. కానీ, ఏ ప్రభుత్వం కూడా పేదలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడంతో సిపిఎం నేత జక్కా వెంకయ్య నేతృత్వంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటి స్థలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్బంధాలు, లాఠీఛార్జీలు,. కేసులను ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. పేదలను స్థలాల్లోకి సిపిఎం నేతలు తీసుకువెళ్లి, వారి చేత నిర్మాణాలు ప్రారంభింపచేసిన తరువాతే ప్రభుత్వం జోక్యం చేసుకోవడం, చట్టబద్దత కల్పించడం జరిగింది. బాలాజీ నగర్‌ ప్రాంతంలోని ఎద్దలరేపు సంగం వద్ద పేదలను ప్రభుత్వం తొలగించిన సమయంలో సిపిఎం నిర్వహించిన పోరాట ఫలితంగా పేదలకు ఇంటి స్థలాలు అందజేశారు. అదే ఇప్పటి ఎన్‌టిఆర్‌ నగర్‌ . వేలాది మందికి ఇక్కడ ఇంటిస్థలాలు ఇచ్చారు. ఇప్పుడు అది నగరంలో ప్రత్యేక కాలనీగా మారింది. రోడ్లు, డ్రెయినజీ, వీధి దీపాలు, పార్కులతో అభివృద్ది చెందింది. సిపిఎం దశలవారీగా చేసిన ఆందోళన ఫలితంగా మౌలిక సదుపాయాలు కల్పించారు.ఇక్కడ వేలాది మంది నివాసముంటున్నారు. జాతీయ రహదారి పక్కన పడారుపల్లి ప్రాంతంలో ప్రభుత్వ భూమి, కొందరు వ్యక్తుల చేతుల్లో దురాక్రమణగా ఉన్న భూముల్లో సిపిఎం నాయకులు ఇంటి స్దల పోరాటం నిర్వహించారు. అనేక ఆందోళన ఫలితంగా సుమారు 1,000 మందికి ఇంటిస్దలాలు అందజేశారు. అదే పుచ్చపల్లి సుందరయ్యకాలనీ. ఇటీవల కాలంలో మౌలిక సదుపాయాలు కల్పించడంతో కాలనీ అభివృద్ధి చెందింది. జాతీయ రహదారిపక్కనే అయ్యప్పగుడి సమీపంలో డ్రైవర్స్‌ కాలనీ పేరుతో 500 మంది పేదలకు ఇంటి స్దలాలు అందజేశారు. ఏన్నో పోరాటాలు ఇందుకోసం నిర్వహించారు. వివిధ సంస్దల్లో డ్రైవర్స్‌గా పనిచేస్తున్న కార్మికులు ఇక్కడ సిపిఎం ఆధ్వర్యంలో స్థలాలు ఇచ్చారు. ఇది నగరంలో ప్రత్యేక కాలనీగా మారింది. అయ్యప్పగుడి వెనుక వైపు కమ్యూనిస్టు నేత వి. మాలకొండారెడ్డి పేరుతో కాలని ఏర్పడింది. ఇక్కడ సుమారు 500 మందికి , అదే ప్రాంతంలో డాక్టర్‌ రామచంద్రారెడ్డి నగర్‌పేరుతో మరో 500 మందికి ఇంటి స్దలాలు అందజేశారు. ఇవి కూడా సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించి సాధించినవే! నెల్లూరు చెరువు ప్రాంతంలో కమ్యూనిస్టు యువనేత, రాడికల్స్‌ చేతిలో అతిదారుణంగా హత్యచేయబడి మన్సూర్‌ బారు పేరుతో నగర్‌ ఏర్పాటు చేశారు. సిపిఎం కృషి ఫలితంగా అన్ని వర్గాల పేదలకు 400 మందికి ఇక్కడ ఇంటిస్దలాలు కేటాయించారు. జాతీయ రహదారి నుండి గొలమూడికి వెళ్లే మార్గంలో ప్రభుత్వ భూమిలో పోరాటం నిర్వహించి 500 మంది పేదలకు ఇంటి స్దలాలు ఇచ్చారు. ఈ కాలనీకి జక్కా వెంకయ్య పేరు పెట్టుకున్నారు. నగరంలోని వివిధ చోట్ల కూలీ పనులుచేసుకునే ప్రజలకు ఇక్కడ స్దలం ఇచ్చారు. అప్పుడిప్పుడే సదుపాయాలు పొందుతున్నారు.

వెంకటేశ్వరుపురం సమీపంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో సిపిఎం పోరాటం ఫలితంగా 1,000 మందికి ఇంటి స్దలాలు ఇచ్చారు. దానికి భగత్‌సింగ్‌ కాలనీగా పేరు పెట్టారు. ప్రస్తుతం నగరం నడిబొడ్డుగా ఉన్న ఉమ్మారెడ్డి గుంట ప్రాంతంలో 200 మందికి ఇంటి స్దలాలు అందజేశారు. భక్తవత్సలనగర్‌ ప్రాంతంలోని స్నేహ నగర్‌లో సుమారు 100 మందికి స్దలాలు అందజేశారు. నిప్పో ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న చంద్రమౌళి నగర్‌ ప్రాంతంలో సుమారు 150 మంది పేదలు సిపిఎం ఆధ్వర్యంలో ఇంటిస్దలాలు సాధించుకున్నారు. అయ్యప్పగుడి ప్రాంతంలోని మల్లయ్య గుంట ప్రాంతంలో పోరాటం ఫలితంగా 300 మందికి ఇంటి స్దలాలుదక్కాయి. పాత మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోని సుందరయ్య నగర్‌లో 200 మందికి, గుర్రాల మడుగు సంఘం వద్ద 1000 మందికి, పడారుపల్లి ప్రాంతంలో బిజెపి గూండాల చేతిలో అతిదారుణంగా హత్యకు గురైన గోను చలపతి, చెంచయ్య పేరుతో 300 మంది కి స్థలాలు సాధించారు. వెంకటేశ్వరపురం గాంథీగిరిజన కాలనీ, జ్యోతి నగర్‌, జాషువా నగర్‌, అంబేధ్కర్‌ కాలనీ, శివాజీ నగర్‌, శ్రామికనగర్‌ కొత్తూరు , సుభాన్‌ నగర్‌, కొత్త కాలువ సెంటర్‌, చిట్టేటి రమణారెడ్డి కాలనీ, వైఎస్‌ఆర్‌ నగర్‌, ప్రాంతాల్లో పేదలకు సిపిఎం ఆధ్వర్యంలో ఇంటిస్థలాలు సాధించారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ నగర్‌గా కొత్తూరు వద్ద ఉన్న కాలనీలో తొలిత సిపిఎం ఆద్వర్యంలో ఏడు వేల మందిపేదలు ఎర్రజెండా పట్టుకొని అడుగులు వేశారు. అటు తరువాత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 5,600 మందికి ఇంటిస్దలాల ఇచ్చారు. ఇంటిస్దలాల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు సాగాయి. వేలాది మంది ప్రజలు పాల్గోన్నారు. పోలీసులు లాఠీ చార్జ్‌ చేశారు. సిపిఎం నాయకులపై కేసులు పెట్టారు. జైళ్లకు వెళ్లారు. ఇప్పటికీ కొందరు కేసులున్నాయి.

25 కాలనీలు ఇవే!
సిపిఎం పోరాటం కారణంగా ఏర్పాటైన వాటిలో పలు కాలనీలకు ఉద్యమ నేతల పేర్లే పెట్టడం గమనార్హం.
1. సుందరయ్య కాలనీ,
2.డ్రైవర్స్‌ కాలనీ,
3 వి. మాలకొండారెడ్డినగర్‌
4. పుచ్చలపల్లి రామచంద్రారెడ్డినగర్‌
5. మన్సూర్‌ నగర్‌
6. వైఎస్‌ఆర్‌ నగర్‌
7. జక్కా వెంకయ్య నగర్‌.
8. భగత్‌సింగ్‌ నగర్‌ (వెంకటేశ్వరపురం)
9. ఎన్‌టిఆర్‌ నగర్‌
10. భక్తవత్సలనగర్‌ (స్నేహ నగర్‌)
11. చంద్రమౌళినగర్‌
12. మల్లయ్య గుంట
13.సుందరయ్య నగర్‌ (పాతమున్సిపల్‌ ఆపీసు )
14 చిట్టేటి రమణారెడ్డి నగర్‌
15 గుర్రాల మడుగు సంగం
16. చలపతి , చెంచయ్య నగర్‌
17. గాంధీగిరిజన కాలనీ
18. ఉమ్మారెడ్డిగుంట
19.జ్వోతి నగర్‌
20 జాషువా నగర్‌
21. అంబేద్కర్‌ కాలనీ,
22. అంబేద్కర్‌ నగర్‌
23. శ్రామికనగర్‌
24. సుభాన్‌ నగర్‌
25. భగత్‌ సింగ్‌ కాలనీ (బుజబుజనెల్లూరు) కాలనీ

➡️