భిన్నత్వంలో ఏకత్వం పట్ల ఉద్వేగభరిత నిబద్ధత

  • సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి. రాఘవులు

సీతారాం ఏచూరితో సుదీర్ఘ అనుబంధం కలిగిన సహచరులకు, కామ్రేడ్స్‌కు, మిత్రులకు ఆయన తమ మధ్యలో లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టం. అంతకు మించి ఫాసిస్టు హిందూత్వ తరహా మతోన్మాదులు చేస్తున్న భయంకర దాడులకు వ్యతిరేకంగా సమ్మిళిత భారత్‌ పరిరక్షణ కోసం ప్రస్తుతం పోరాటం సాగుతున్న ఈ తరుణంలో ఆయన మన నుంచి భౌతికంగా, శాశ్వతంగా దూరం కావడంతో ఏర్పడిన వెలితి ఇప్పట్లో పూడ్చగలిగేది కాదు. విభిన్న మతాలు, జాతులు, సంస్కృతులతో కూడిన ‘సమ్మిళిత భారతం’ అనేది ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైన భావన. మతోన్మాద వ్యతిరేక పోరాటం పట్ల ఆయన రాజీలేని నిబద్ధత, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ పట్ల ఆయన అంకితభావం, దోపిడీకి గురవుతున్న, అణగారిన వర్గాల ప్రయోజనం కోసం జీవితాంతం పాటుపడిన తీరు- ఆయన విడిచివెళ్లిన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనల్ని నిరంతరం ఉత్తేజితుల్ని చేస్తూనే ఉంటాయి.
సీతారాం తన సహచరులందరికన్నా ఎక్కువ విశ్వజనీన వ్యక్తి, అంతర్జాతీయవాది. ఆయన ప్రపంచ వ్యాపిత పర్యటనలు, అనేక భాషలను ధారాళంగా, వినసొంపుగా మాట్లాడగలిగిన నేర్పు, ఒక అత్యున్నత శ్రేణి కమ్యూనిస్టు ప్రచారకునిగా ప్రతి అంశంపై ఆయనకున్న బహుముఖ పరిజ్ఞానాన్ని వినియోగించడం- ఇవన్నీ ఆయనను ఆత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. అంతేకాదు, ఆయన అభ్యుదయ తెలుగు సంస్కృతి విశిష్ట ఉత్పాదన కూడా. ఆ సంస్కృతి ఆయనలో పొంగిపొర్లే హాస్యచతురతలోను, వ్యంగ్యోక్తులలోనూ ప్రతిబింబిస్తుంది.
యావత్‌ జీవితం ప్రజలు, దేశం, సిపిఐ(ఎం) కోసం అంకితం
సీతారాం బాల్యం తెలుగు ప్రజల రాజకీయాల్లోని ఎత్తుపల్లాలతో పరోక్షంగా ప్రభావితమైంది. అప్పటి మద్రాసు రాష్ట్ర రాజధాని చెన్నైలో ఆయన జన్మించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు గుంటూరులో ఏర్పడటంతో జడ్జిగా ఉన్న తన తాతగారితో పాటు సీతారాం గుంటూరుకు వచ్చారు. తర్వాత ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రాజధాని హైదరాబాద్‌కు 1956లో చేరుకున్నారు.
మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కల్లోలం. 1969లో ప్రత్యేక తెలంగాణా కోసం ఆందోళన. దీంతో నవయువకుడుగా ఉన్న సీతారాం తన చదువు ఆగకుండా కొనసాగించేందుకు ఢిల్లీకి మారాల్సి వచ్చింది. అక్కడ ఆయన ప్రెసిడెంట్స్‌ ఎస్టేట్‌ స్కూలులోను, సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీలోను ప్రతిభావంతంగా చదువుకుని జేఎన్‌యూకు చేరుకున్నారు. అక్కడే కామ్రేడ్‌ సీతారాం ఏచూరిగా మారారు. తన యావజ్జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం, తన పార్టీ సిపిఐ(ఎం) కోసం అంకితం చేశారు.
తన కార్యాచరణ కేంద్రం ఢిల్లీ అయినప్పటికీ, తెలుగు ప్రజల రాజకీయాలతో తన సంబంధాన్ని సీతారాం ఎన్నడూ వీడలేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం, జాతీయ రాజకీయాలలో అతి చురుకైన పాత్ర వహించడం, సిపిఐ(ఎం) కేంద్ర బాధ్యతల్లో ఉన్న సీతారాం జాతీయ స్థాయి రాజకీయాల్లో జోక్యం పెంచుకోవడం ఏక కాలంలో జరిగాయి.
1984లో ఎన్‌టి రామారావు ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలదోసినపుడు దేశవ్యాపితంగా మద్దతు కూడగట్టే కృషిలో సీతారాం అగ్రభాగాన నిలిచారు. తన మెజారిటీని రాష్ట్రపతి ముందు చూపించడానికి ఎన్‌టి రామారావు ఆనాడు ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకు వచ్చినప్పుడు వారికి ఏర్పాట్లు చేయడంలో యువనేతగా ఉన్న సీతారాం చురుకైన పాత్ర వహించారు. ఆ తర్వాత దేశవ్యాపితంగా కాంగ్రెస్‌ వ్యతిరేక శక్తులను కూడగట్టి 1989-90లో నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో ఎన్‌టి రామారావు ముఖ్య పాత్ర వహించారు. ఆ కృషిలో సిపిఐ(ఎం) కీలక పాత్ర వహించింది. 1996-98లో ఎన్‌టి రామారావు కన్వీనర్‌గా యునైటెడ్‌ ఫ్రంట్‌ ఏర్పడిన సమయంలో జరిగిన చర్చలు, సంప్రదింపుల్లో సిపిఐ(ఎం) అగ్రనేతలతో పాటు సీతారాం చురుగ్గా పాల్గొన్నారు.
2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సంప్రదింపుల్లో ఆయన సంప్రదింపుల ప్రావీణ్యాన్ని ప్రత్యక్షంగా గమనించే అవకాశం నాకు లభించింది. సీతారాం, నేను ఆనాడు ఢిల్లీలోని కొందరు ముఖ్య కాంగ్రెస్‌ నేతలతో జరిగిన చర్చల్లో పాల్గొన్నాము. ఎదుటివారు చెప్పిన దానికి అంగీకరించకుండా, అదే సమయంలో తెగదెంపులు చేసుకోకుండా అంగుళం అంగుళం ముందుకు కదులుతూ ఓపిగ్గా మనం అనుకున్నదానికి చేరుకోవడం ఆయన సంప్రదింపుల నేర్పరితనపు ముఖ్య లక్షణం.
చాలా దూరంలో ఉన్న ఢిల్లీలో అఖిల భారత స్థాయిలో బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు, పార్టీకి సహాయం చేయడానికి సీతారాం ఎల్లప్పుడూ అందుబాటు లో ఉండేవారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు, సిపిఐ(ఎం) వైఖరిని దేశానికి తెలియజేయడంలో పార్లమెంటులో ఆయన ముఖ్యపాత్ర వహించారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్‌, బిజెపిల మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను ఆయన ఎండగట్టారు. ‘దేశమంటే మట్టి కాదోరు, దేశమంటే మనుషులోరు’ అంటూ గురజాడను ఉటంకిస్తూ, ఇరు ప్రాంతాల ప్రజలకు హాని కల్గించబోయే ఇలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి వెనక ఉన్న దురుద్దేశాలను ఆయన ప్రశ్నించారు. మీరు రెండు పడవల్లో ప్రయాణిస్తున్నారు, మధ్యలో మునిగిపోతారు అంటూ ఆనాడు కాంగ్రెస్‌ వారిని సీతారాం హెచ్చరించారు. ఆ హెచ్చరిక సరైందని అనతి కాలంలోనే రుజువైంది. తదుపరి 2014 ఎన్నికల్లో ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలైంది.


ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం అమలు గురించి 2014 ఫిబ్రవరి 20వ తేదీన పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీల అమలు గురించి 2016, జులై 28న రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చ జరిగింది. అప్పుడు తన మాతృభాష అయిన తెలుగులో ప్రసంగిస్తూ చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే సిపిఐ(ఎం) చూస్తూ ఊరుకోదని, హామీల అమలుకు పోరాటం చేస్తుందని సభలో ప్రకటించారు.
మతోన్మాద శక్తుల వల్ల దేశ సమైక్యతకు ఏర్పడిన ముప్పు పట్ల ఆయన ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉండేవారు. ముందు తరాల నుంచి మనకు సంక్రమించిన భారత సమ్మిళిత సంస్కృతి దేశ సమైక్యతను పరిరక్షిస్తుందని ఆయన గట్టిగా విశ్వసించారు. భారత దేశ విశిష్టతలో ముఖ్యలక్షణమైన భిన్నత్వంలో ఏకత్వం పట్ల ఉద్వేగభరిత నిబద్ధత ఆయన హృదయాంతరాళాల్లోంచి వచ్చింది.
రాజ్యసభలో 2017, ఆగస్టు 10న ఆయన వీడ్కోలు ప్రసంగం ఈ అంశాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించింది. తన కుమారుడ్ని ఉత్తర భారతీయుడంటారా, దక్షిణ భారతీయుడంటారా, ఉన్నత కులస్తుడంటారా, నిమ్న కులస్తుడంటారా, హిందూ అంటారా, ముస్లిం అంటారా అని ప్రశ్నించి, ఈ ముద్రలేవీ అతనికి వర్తించవని, ఒక్క భారతీయుడన్నది మాత్రమే వర్తిస్తుందని గర్వంగా ప్రకటించారు. 1921లో అహ్మదాబాద్‌లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ మహాసభలో మౌలానా హస్రత్‌ మొహాని, స్వామి కుమారనంద కలిసి సంపూర్ణ స్వరాజ్యాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని, స్వాతంత్య్ర పోరాటంలోని ఆ ఘట్టాన్ని ప్రస్తావించారు. వారిరువురు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టడం మత గుర్తింపులకు అతీతమైన భారత ప్రజల సమైక్యతకు చిహ్నంగా భాసిల్లుతుందని చెప్పారు.

ఏచూరి కుటుంబం మినీ భారతం
సీతారాం పుట్టింది దక్షిణ భారతంలో, స్థిరపడింది ఉత్తర భారతంలో. ఆయన బహు భాషలు మాట్లాడగలడు. తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళం మొదలైన భాషల్లో మాట్లాడుతూ వారితో తేలిగ్గా కలిసి పోగలడు. ఆయన కుటుంబం ఒక మినీ భారతం- అది భిన్నత్వంలో ఏకత్వం. తన స్వంత రాష్ట్రాన్ని వీడి చాల కాలమైనప్పటికీ తెలుగు చక్కగా మాట్లాడే వాడు. తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తున్నపుడు ప్రజలు ఆయనను తెలుగులోనే మాట్లాడమని కోరేవారు. ఆయన ఉపన్యాసాలు కథలు, జీవిత ఘట్టాలతో పండితులను, పామరులను కూడ ఆకట్టుకునేవి. ఆయన శైలి చాలా సరళంగా ఉంటుంది. ఆయనలో హాస్యచతురత పుష్కలంగా ఉంది. ఆయన ఒక అద్భుతమైన కమ్యూనిస్టు పార్లమెంటేరియన్‌, ప్రచారకుడు.
ఆయన పూర్వీకుల గృహం ఆంధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో ఉంది. ఆయన తల్లిగారు అక్కడే నివసించేవారు. ఆయన మేనమామ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్‌లో నివసిస్తారు. తెలుగు రాష్ట్రాలను సందర్శిం చినప్పుడల్లా ఆయన వీలు చేసుకుని వారి వద్దకు వెళ్ళేవారు. తన కుమారుడు అప్పుడప్పుడైనా వచ్చి తన చేతివంట తినాలన్నది ఆయన తల్లిగారి ఏకైక కోరిక. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఆయన తన తల్లి గారి కోర్కె తీర్చేందుకు ప్రయత్నించేవారు. ఆయన తన తుది శ్వాస విడిచే వరకు నిర్విరామంగా, ముమ్మరంగా సాగించిన కృషి మధ్యలో ఆగిపోయింది. దానిని నెరవేర్చడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.

➡️