కుల మత వివక్షే ప్రధాన సమస్య : ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ : దేశాన్ని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య మత, కుల వివక్షేనని మెజారిటీ భారతీయులు…అంటే 70 శాతానికి పైగా అభిప్రాయపడుతున్నారు. ప్రపంచంలోని 36 దేశాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలపై ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. మన దేశానికి సంబంధించినంత వరకూ కుల మత వివక్షే ప్రధాన సమస్య అని ఎక్కువ మంది కుండబద్దలు కొట్టారు. 70 శాతానికి పైగా భారతీయులు మత వివక్షను ప్రస్తావించగా 69 శాతం మంది కుల, జాతి వివక్షను వేలెత్తి చూపారు. ఇతర దేశాల ప్రజలు కుల వివక్ష కంటే జాతి వివక్షే అతి పెద్ద సమస్య అని చెప్పారు.

సర్వే ఇలా…
‘ప్రపంచంలో అతి పెద్ద సవాలుగా ఆర్థిక అసమానత’ అనే పేరుతో ప్యూ రిసెర్చ్‌ సెంటర్‌ గురువారం తన నివేదికను ప్రచురించింది. ఆసియా-పసిఫిక్‌ ప్రాంతం, యూరప్‌, లాటిన్‌ అమెరికా, మధ్యప్రాచ్యం, ఉత్తర అఫ్రికా ప్రాంతం, ఉత్తర అమెరికా, సబ్‌-సహారా ఆఫ్రికాలోని 36 దేశాల్లో సర్వే నిర్వహించారు. అమెరికాలో 3,600 మందిని సర్వే చేయగా మిగిలిన దేశాలన్నింటిలో కలిపి 41,503 మంది అభిప్రాయాలు సేకరించారు. గత సంవత్సరం జనవరి 5-మే 24 తేదీల మధ్య ఈ సర్వే జరిగింది. మూడింట ఒక వంతు దేశాల్లో ఫోన్‌ ద్వారా సర్వే జరపగా భారత్‌ సహా మిగిలిన దేశాల్లో ప్రజలను వ్యక్తిగతంగా కలిశారు.

ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం
ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం అతి పెద్ద సమస్యగా ఉన్నదని ప్రతి దేశంలోనూ మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.
మన దేశంలోని 64 శాతం మంది ప్రజలు ఈ వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పగా 17 శాతం మంది ఓ మాదిరిగా ఉన్నదని తెలిపారు. తమ సర్వేలో మత వివక్ష కంటే ఇతర అంశాల పైనే ఎక్కువగా ఆందోళన వ్యక్తమైందని నివేదిక వివరించింది. అయినప్పటికీ మతం ప్రాతిపదికన వివక్ష చూపడం అతి పెద్ద సమస్యగా ఉన్నదని 29 శాతం వయోజనులు చెప్పారు. 27 శాతం మంది అది ఓ మోస్తరుగా ఉన్నదని తెలిపారు. మత వివక్ష ఎక్కువ ఆందోళన కలిగిస్తోందా అని భారత్‌ సహా కొన్ని దేశాలకు చెందిన వారినే సర్వేలో ప్రశ్నించడం జరిగింది.

కుల, జాతి వివక్షలే కారణం
బంగ్లాదేశ్‌, ఫ్రాన్స్‌, భారత్‌, నైజీరియా, శ్రీలంక దేశాల్లోని సగం మంది లేదా అంతకంటే ఎక్కువ మంది మత వివక్ష పెద్ద సమస్యేనని అభిప్రాయపడ్డారు. మన దేశంలో 57 శాతం మంది మత వివక్ష పెద్ద సమస్య అని చెబుతుంటే 14 శాతం మంది ఓ మాదిరి సమస్య అని అన్నారు. కాగా తాము నివసిస్తున్న దేశాల్లో జాతి వివక్ష అధికంగా ఉన్నదని 34 శాతం మంది చెప్పగా 34 శాతం మంది ఆ సమస్య మధ్యస్థంగా ఉన్నదని తెలిపారు. కుల, జాతి వివక్షల కారణంగా అసమానతలు బాగా పెరిగిపోతున్నాయని 28 శాతం మంది భారతీయులు చెప్పారు. మరో 28 శాతం మంది ఈ అసమానతలు మధ్యస్థ స్థాయిలో ఉన్నాయని అన్నారు. అసమానతలకు సంపన్నుల రాజకీయ ప్రభావమే కారణమని భారతీయుల్లో 79 శాతం మంది స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను 72 శాతం మంది తప్పుపట్టారు. దేశంలో కొందరు బాగా కష్టించి పనిచేయడం, మరికొందరు చేయకపోవడం ఆర్థిక అసమానతలకు దారి తీస్తోందని 32 శాతం మంది అభిప్రాయపడ్డారు.

➡️