రైతులకు షాక్‌

  • సొంత భూముల సర్వే నంబర్లను బ్లాక్‌ చేసిన అధికారులు 
  • అడంగల్‌, 1బి రాని పరిస్థితి
  • జమిందారీ వారసుల పేరుతో వెబ్‌లో నమోదు 
  • సోంపేట రెవెన్యూ అధికారుల లీలలు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి, సోంపేట : వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల్లో ఆ రైతులు వరి, నువ్వు తదితర పంటలు సాగు చేసుకుంటున్నారు. గత వైసిపి ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టులో ఆ ప్రాంతంలో అధికారులు చేపట్టిన భూసమగ్ర సర్వే సమయంలో వారినే పొలాల్లోకి తీసుకొచ్చి ఫొటోలు తీసి వారి వివరాలను నమోదు చేశారు. తమ భూములకు రక్షణ ఉంటుందని, శాశ్వత పట్టాలు పొందవచ్చని అంతా అనుకున్నారు. సరిగా ఎడాది గడిచింది. బ్యాంకు రుణాల రెన్యువల్‌ కోసం 1బి, అడంగల్‌ కాపీలు సమర్పించాల్సి రావడంతో వారంతా మీ సేవా కేంద్రాలకు వెళ్లారు. సర్వే నెంబర్లు చెప్పి తమకు ప్రింట్లు ఇవ్వాలని అడిగిన వారికి మీ సేవా నిర్వాహకుల నుంచి ఊహించని సమాధానం ఎదురైంది. ఆ సర్వే నెంబర్లల్లో మీ పేర్లు లేవని.. వేరే వ్యక్తి పేరు చూపుతోందని చెప్పడంతో వారంతా అవాక్కయ్యారు. ఇదీ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం కొర్లాం గ్రామ రైతుల పరిస్థితి. దీనిపై రైతులు తహశీల్దార్‌, పలాస ఆర్‌డిఒ కార్యాలయాలకు వెళ్లి మొరపెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో, వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది.
సోంపేట మండలం కొర్లాం గ్రామ రెవెన్యూ పరిధిలో సుమారు 800 ఎకరాల భూమి ఉంది. ఇందులోనే కొర్లాం గ్రామంతో పాటు లక్కవరం, బారువ, లక్ష్మీపురం, కుమ్మరిపాడు తదితర గ్రామాల్లోని సుమారు 160 మంది రైతులకు చెందిన 250 ఎకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వీరికి భూములు సంక్రమించినట్లు 1బి, అడంగల్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లూ ఉన్నాయి. ఆయా భూములకు రిజిస్ట్రేషన్లూ జరుగుతున్నాయి. క్రయవిక్రయాలూ నెరపుతున్నారు. రైతుల వద్ద ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా బ్యాంకులు రుణాలనూ అందిస్తున్నాయి. ఎప్పటి మాదిరిగానే రుణాల రెన్యువల్‌ కోసం బ్యాంకులకు పాసుపుస్తకాలు, అడంగల్‌ కాపీలను సమర్పించడానికి మీ సేవా కేంద్రాలకు వెళ్లిన రైతులకు ఆ కాపీలు రాలేదు. మీ-భూమి వెబ్‌సైట్‌లో వారి పేర్ల స్థానంలో ఒడిశా రాష్ట్రం జయంతపురం గ్రామానికి చెందిన భువనేశ్వర్‌ పాడి భక్షి పేరుతో ఇనాం భూములుగా కనిపిస్తుండడంతో రైతులు అవాక్కయ్యారు.

రెవెన్యూ రికార్డుల మార్పు

భూముల రీసర్వే జరుగుతున్న విషయం తెలుసుకున్న భువనేశ్వర్‌ పాడి భక్షి మనుమడు క్రిష్ణ చంద్రపాడి గతేడాది జూన్‌లో అప్పటి సోంపేట తహశీల్దార్‌ వైవి ప్రసాద్‌ను కలిశారు. జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారులనూ కలిసి వినతిపత్రాలు ఇచ్చినట్లు తెలిసింది. ఆ తరువాత రైతుల పేర్ల స్థానంలో భువనేశ్వర్‌ పాడి భక్షి పేరు నమోదైంది. దీని వెనుక రెవెన్యూ అధికారుల హస్తముందని రైతులు ఆరోపిస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున భూ రికార్డులను మార్చే ధైర్యం రెవెన్యూ అధికారులు చేశారంటే వీరి వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దలు ఉండొచ్చని అనుమారం వ్యక్తం చేస్తున్నారు.

కొర్లాం కాలనినీ రాసిచ్చేశారు

తమ భూమిగా చెప్పుకుంటున్న క్రిష్ణ చంద్రపాడి దగ్గర ఎటువంటి ఆధారాలూ లేకపోయినా ఆయన ఏం చెప్తే అది చేసేశారు. కొర్లాం పంచాయతీ పరిధిలోని హుకుంపేట కాలనీలో 40 ఏళ్లుగా సుమారు వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. వాటినీ భువనేశ్వర్‌పాడి భక్షికి చెందిన భూములుగా పేర్కొన్నారు. చివరకు బారువ రోడ్డులో ఐదు ఎకరాల్లో నిర్మించిన ప్రభుత్వ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ పాడి కుటుంబానిదే అని మార్చేశారు.

వంశపారంపర్య భూములను లాక్‌ చేయడమేమిటి? : రాంబుడ్డి గణపతి, కొర్లాం గ్రామ పెద్ద

కొర్లాం గ్రామ రెవెన్యూ పరిధిలోని 250 ఎకరాలకు సంబంధించి పలు సర్వే నెంబర్లనుయ అధికారులు లాక్‌ చేశారు. భూములన్నీ వంశపారంపర్యంగా సంక్రమించినవే. అందరి వద్ద 1బి, అడంగల్‌ ఒరిజనల్‌ పత్రాలు ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయలూ మా పేరుతోనే జరుగుతున్నాయి. ఏ ఆధారంతో క్రిష్ణచంద్రపాడి ఆ భూములను తనకు చెందినవని అంటున్నారో తెలియడం లేదు. అందరూ కలిసి మాకు అన్యాయం చేస్తున్నారు.

మా భూములు కావంటున్నారు : రాంబుడ్డి జానకిరామ్‌, రైతు

మా తాతగారు 1965లో క్రిష్ణచంద్రపాడి పూర్వీకుల నుంచి భూమి కొనుగోలు చేశారు. నాటి నుంచి మా అధీనంలోనే ఉంది. బ్యాంకుల నుంచి రుణాలూ తీసుకుంటున్నాం. ఈ క్రాప్‌లో ఆ సర్వే నెంబర్లే నమోదు చేస్తున్నారు. ఆ పొలంలో పండిన వరి పంటను ప్రభుత్వానికి ప్రతి ఏడాది అమ్ముతున్నాం. ఇప్పుడు అకస్మాత్తుగా మాకు అడంగల్‌, 1బి ఆపేశారు. భూముల సమస్యను వెంటనే పరిష్కరించాలి. లేకుంటే ఉద్యమిస్తాం.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం  : బి.అప్పలస్వామి, సోంపేట తహశీల్దార్‌.

కొర్లాం రైతుల భూములు వేరే వారి పేరు మీద నమోదు చేసినట్లు రైతులు చెప్పారు. భూముల రీ సర్వే సమయంలో నేను లేను. అప్పుడు ఏమి జరిగిందనే విషయాలను తెలుసుకుంటాను. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.

➡️