బలమైన వామపక్షం అవశ్యం

Apr 19,2024 08:38 #Interview, #Prakash Karat
  • ‘దేశాభిమాని’ ఇంటర్వ్యూలో ప్రకాశ్‌ కరత్‌

ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం బిజెపి అనుసరిస్తున్న మతతత్వం, సమాజంలో చీలికలు తీసుకొచ్చే విద్వేష రాజకీయాలను సమర్థవంతంగా తిప్పికొట్టేది వామపక్షాలేనని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ అన్నారు. పార్లమెంటులో వామపక్షాల బలం పెరగాల్సిన ఆవశ్యకత గురించి ఆయన నొక్కి చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), అధిక ధరలు, నిరుద్యోగం సహా ప్రజలను పీడిస్తున్న సమస్యలపై నికరంగా పోరాడుతున్న పార్టీ సిపిఎం, ఇతర వామపక్షాలేనని చెప్పారు. కేరళలోని దేశాభిమాని పత్రికకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కరత్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ విశేషాలు..
ఈసారి 400 దాటుతుందని మోడీ చెబుతున్నారు.

దీనిపై వ్యాఖ్యానిస్తారా?
400కు పైగా సీట్లు గెలవడం అనేది కేవలం బిజెపి కార్యకర్తలకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి చేస్తున్న ప్రచారం మాత్రమే. సమాజంలో మత పరమైన చీలికలు తేవడం ద్వారా లబ్ధి పొందాలనేది బిజెపి ఎత్తుగడ. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రజలు అడుగుతున్నారు. ఇటీవలి అధ్యయనాలు, సర్వేలన్నీ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. బిజెపి మేనిఫెస్టోలో దీనికి పరిష్కారం చూపే ప్రతిపాదనేదీ లేదు. దాని దృష్టి అంతా మతతత్వం, విభజన రాజకీయాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపైనే ఉంది. గత సారి పుల్వామా దాడిని ఉపయోగించుకుని ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి అది లాభపడింది. ఈసారి అలాంటి పరిస్థితి లేదు..పలు ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు సాగించిన పోరాటాలు ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించనున్నాయి.

ప్రతిపక్షాలన్నీ అవినీతి మయమైనట్లు ముద్రవేసే యత్నం మోడీ చేస్తున్నారు. దీనిని మీరు ఏవిధంగా ఎదుర్కొంటారు?
ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా బిజెపి పాల్పడిన భారీ అవినీతిని ప్రజల ముందు బట్టబయలు చేసేందుకు వామపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. గత ఆరేళ్లలో బాండ్ల ద్వారా బిజెపికి రూ.8, 252 కోటు ముట్టాయి..ఇందులో రెండు రకాల అవినీతి ఉంది.అనుచిత లబ్ధి పొందడం కోసం కోట్ల రూపాయలు ముడుపులు ముట్టజెప్పడం ఒక రకమైన అవినీతి. ఇడిని, ఆదాయపు పన్ను శాఖను పంపి బాండ్లను కొనుగోలు చేయమని కంపెనీలను బెదిరించడం రెండో రకం అవినీతి.. ఇదంతా అధికార పార్టీ ఒక్కటే చేయలేదు, ప్రభుత్వంతో కలసి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా అవినీతిని అది సంస్థాగతీకరించింది. ఈ అవినీతి బయటకొచ్చిన తర్వాత కూడా మోడీ రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరకుపోయాయని నిందించడం చాలా హాస్యాస్పదంగా ఉంది.

బిజెపి మేనిఫెస్టోలో ఉన్న సిఎఎపై కాంగ్రెస్‌ మౌనం వహించడంపై మీ కామెంట్‌…?
కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం ఊసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, దానిపై విమర్శలు వచ్చాయి, అయినా, కాంగ్రెస్‌ కచ్చితమైన వైఖరిని తీసుకోలేకపోయింది. కాంగ్రెస్‌ అవకాశవాద రాజకీయాలకు ఇదో ఉదాహరణ. బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌ల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన హిందువులకు పౌరసత్వం వస్తుందని బిజెపి అదేపనిగా ఊదరగొడుతోంది. సిఎఎ నుంచి వైదొలిగేలా కాంగ్రెస్‌ని ఇదే ప్రేరేపించినట్టుగా ఉంది.
కేరళలో సిఎఎ అమలు చేయరాదన్న వైఖరిని కాంగ్రెస్‌ తిరస్కరిస్తోంది కదా..! ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని బిజెపి కూడా వాదిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకోవచ్చు.

వామపక్షాల నుంచి ఎక్కువ మంది పార్లమెంటులోకి ఎందుకు రావాలి?
బిజెపిని ఓడించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. పార్లమెంటులో బలమైన వామపక్ష ఉనికి లేకుండా, ఆ ప్రభుత్వం బలమైన లౌకిక వైఖరిని తీసుకోదు, ప్రజానుకూల విధానాలను రూపొందించదు, సమాఖ్య సూత్రాలకు కట్టుబడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదు. కేరళ లాంటి రాష్ట్రానికి ఇది చాలా ముఖ్యం. కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత చర్యలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏకైక రాష్ట్రం కేరళ.
రాష్ట్రాల హక్కుల కోసం కాంగ్రెస్‌ నిలబడలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356ని ఉపయోగించి కాంగ్రెసేతర ప్రభుత్వాలను రద్దు చేసిన చరిత్ర దానికి ఉంది. ప్రజావ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు పార్లమెంట్‌లో ఒక బలమైన శక్తి ఉండాలి. వామపక్షాలు సమాఖ్య సూత్రాలకు కట్టుబడి లౌకికవాదాన్ని కాపాడేందుకు గట్టిగా నిలబడతాయి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలను కొనసాగించడంలో కాంగ్రెస్‌కు సరైన ట్రాక్‌ రికార్డ్‌ లేదు. ఇంతకుముందు అధికారంలో ఉన్న ఫ్రంట్‌ ప్రభుత్వాలు మాత్రమే అలా చెప్పుకోగలవు. బలమైన వామపక్షాలు మాత్రమే భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక , సమాఖ్య సూత్రాలను పరిరక్షించగలవు.

దేశంలో వామపక్ష ఉద్యమం గురించి…
ప్రధాన పోటీ బెంగాల్‌, కేరళ , త్రిపురల్లో ఉంది. వీటితో బాటు ఇతర రాష్ట్రాల్లో కొద్ది స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నాం. ప్రతిపక్షాల ఓట్లు చెదరకుండా ఉండేందుకు ఇది ముందస్తు జాగ్రత్త. చిన్న విభజన అయినా బిజెపికి ఉపయోగపడుతుంది. అందుకే కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేయడం లేదు.
బీహార్‌, రాజస్థాన్‌లలో గెలిచే అవకాశమున్న స్థానాల్లోనే పోటీ చేస్తున్నాం.. త్రిపురలో బిజెపి దాడులను తిప్పికొట్టడానికి ఈ పోటీ ఉపయోగపడుతుంది.

రాహుల్‌ గాంధీ మళ్లీ వాయనాడ్‌లో పోటీ చేయడం గురించి…
ఇది కాంగ్రెస్‌ రాజకీయ బలహీనతను తెలియజేస్తోంది. ఇతర ప్రాంతాల నుంచి తమ నాయకుడు గెలుస్తాడనే విశ్వాసం ఆ పార్టీకి కొరవ డింది. యుపిలో ఆయన గెలవలేరని అర్థమవు తోంది. బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాష్ట్రాల్లో , తాను బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో రాహుల్‌ను పోటీకి నిలబెట్టలేకపోవడం కాంగ్రెస్‌ తాలూకు బలహీనత. ముస్లిం లీగ్‌తో పొత్తును బహిరంగం గా ప్రకటించడానికి కాంగ్రెస్‌కు ధైర్యం చాలడం లేదు. అలా చెప్పలేక ‘మీది మాది’ ఒకటే ఎజెండా అని అనడం అవకాశవాదమే అనిపించు కుంటుంది. పార్లమెంటులో యుడిఎఫ్‌ ఎంపీల పనితీరు గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. కేరళ ప్రయోజనాలను కాపాడడంలో యుడిఎఫ్‌ పూర్తిగా విఫలమైంది. కేరళలో ఎల్‌డిఎఫ్‌ ఎందుకు మెజారిటీ సాధించాలనే ప్రశ్నకు కూడా ఇదే సమాధానం. కేరళ ప్రయోజనాలు కాపాడబడా లంటే ఎల్‌డిఎఫ్‌కు మెజార్టీ పార్లమెంటు సీట్లు రావాలి. ఈసారి కేరళలో ఫలితాలు 2019 ఫలితాలకు భిన్నంగా ఉండబోతున్నాయి.

➡️