అక్షర యోధుడికి అశ్రునివాళి

Jun 9,2024 10:45 #death, #Ramoji Rao

ప్రజాశక్తి -యంత్రాంగం : పత్రికా రంగంపై చెరగని ముద్ర వేసిన రామోజీరావు మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, చంద్రబాబునాయుడు, తెలంగాణ సిఎం రేవంత్‌రెడ్డితో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

చెరగని ముద్ర వేసిన గొప్పవ్యక్తి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
”రామోజీరావు దూర దృష్టితో సమాజంలో చెరగని ముద్ర వేశారు. ఆయన మరణంతో మీడియా, వినోద రంగం ఓ టైటాన్‌ను కోల్పోయింది. పత్రికా, టీవీ రంగంతో సహా అనేక సంస్థలు స్థాపించిన ఆయన ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచిన సృజనాత్మక వ్యాపారవేత్త. వివిధ రంగాలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి” అని ఆమె పేర్కొన్నారు.

దేశాభివృద్ధి కోసం ఆలోచించారు: ప్రధాని మోడీ
”రామోజీరావు మరణం ఎంతో బాధాకరం. ఆయన ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించే వారు. ఆయన లేని లోటు దేశానికి తీరని నష్టం. భారతీయ సినీ, పత్రికా రంగాల్లో చెరగని ముద్ర వేశారు. పట్టుదల, కృషితో సినీ, మీడియా రంగంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికి. నూతన ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన నుంచి ఆపార జ్ఞానాన్ని పొందేందుకు అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి” అని ప్రధాని పేర్కొన్నారు.

మీడియా రూపురేఖలు మార్చారు : రాహుల్‌
భారత మీడియా రంగంలో అగ్రగామి రామోజీరావు మరణం విచారకరం.

ఆయన సేవలు చిరస్మరణీయం : తమిళనాడు సిఎం ఎంకె స్టాలిన్‌
రామోజీరావు మరణం తీవ్ర విచారకరం. మీడియా, జర్నలిజం, సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
సంతాపం తెలిపిన వారిలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అమిత్‌షా, కేరళ సిఎం పినరయి విజయన్‌, పశ్చిమబెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ, సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటుడు చిరంజీవి తదితరులు ఉన్నారు.

పూడ్చలేని లోటు: తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి
”రామోజీరావు లేని లోటు పూడ్చలేనిది. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత, తెలుగు పారిశ్రామిక రంగానికి విలువలు జోడించిన వ్యక్తిగా ఆయన చిరస్మరణీయులు. ఇటీవలే ఆయనతో భేటీ అయ్యాను. రామోజీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

అక్షర వీరుడు రామోజీరావు: కెసిఆర్‌
అక్షర వీరుడు రామోజీరావు. ఆయన తెలుగు పాత్రికేయ, సినీ రంగాలకు ఎనలేని సేవలు చేశారు. ఆయన మృతి తీరని లోటు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం.
శోక తప్తులైన ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి” అని కేసీఆర్‌ సంతాప సందేశంలో తెలిపారు.

పలువురి సంతాపం
తెలుగు మీడియా, సినీ రంగాలకు రామోజీ చేసిన సేవలు మరవ లేనివని పేర్కొంటూ పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటించారు.
తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు
తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో తనదైన శైలిని సృష్టించుకున్న వ్యక్తి ఈనాడు గ్రూప్‌ ఛైర్మన్‌ రామోజీరావు అని గవర్నర్‌ ఎస్‌ అబ్ధుల్‌ నజీర్‌, టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు, వైసిపి అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జనసేన అధ్యక్షులు పవన్‌కల్యాణ్‌, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

తెలుగుకు వన్నె తెచ్చిన వ్యక్తి: చంద్రబాబు
”రామోజీరావు తెలుగుకు వెలుగులు నింపి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి. సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన కోలుకుంటారని భావించాను. కాని ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా తీరని లోటు” అని చంద్రబాబు పేర్కొన్నారు.

సిపిఎం సంతాపం
ఈనాడు సంస్థలు, ప్రముఖ వ్యాపారవేత్త రామోజీరావు మరణం బాధాకరమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు తెలుగుమీడియా రంగానికి నూతన వరవడి దిద్దారని, పత్రికా విలువలు నిలబెట్టడంలో ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. సుందరయ్య, రాజేశ్వరరావు లాంటి ప్రముఖ కమ్యూనిస్టు నాయకులను ఎంతో అభిమానించేవారని పేర్కొన్నారు. రామోజీరావు మృతి ప్రజాతంత్ర ఉద్యమానికి తీరనిలోటని పేర్కొన్నారు. అలాగే ఐద్వా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభావతి, రమాదేవి కూడా వేరొక ప్రకటనలో సంతాపం ప్రకటించారు.

సామాన్యులకు సైతం పత్రికను దగ్గర చేశారు : సిపిఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు


విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగు పత్రికారంగాన్ని కొత్త పుంతలు తొక్కించిన దార్శనికుడు రామోజీరావు అని సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. శనివారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్‌సిటీలో రామోజీరావు భౌతికకాయాన్ని సిపిఎం సీనియర్‌ నేత మధుతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణాలు, నగరాలకే పత్రికలు పరిమితమైన రోజుల్లో…ఈనాడు పత్రికను స్థాపించి, గ్రామీణ ప్రాంత వార్తలకు ప్రాధాన్యమిస్తూ సరళమైన తెలుగుభాషలో సామాన్యులకు సైతం పత్రికను దగ్గరచేశారని తెలిపారు. సమాచార విప్లవంలో పెను మార్పుకు రామోజీరావు దోహదపడ్డారన్నారు. సామాజిక సేవలో ముందుండే తెలుగు ప్రముఖుల్లో రామోజీరావు ఆద్యుడని వి శ్రీనివాసరావు తెలిపారు. రామోజీరావు మృతికి సిపిఎం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయన తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. రామోజీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.

తెలుగు మీడియాకు, దేశానికి తీరని లోటు : ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్‌
రామోజీరావు మృతికి ప్రజాశక్తి సంపాదకులు బి.తులసీదాస్‌ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆయన మరణం తెలుగు మీడియాకు, దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
రామోజీరావు మృతి సాహిత్యలోకానికి తీరనిలోటని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గేయానంద్‌, కుర్ర రామారావు, సాహితీ స్రవంతి రాష్ట్ర కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెంగార మోహన్‌, కె.సత్యరంజన్‌, ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చందు జనార్ధన్‌ పేర్కొన్నారు.

టిడిపి కార్యాలయంలో నివాళి
టిడిపి కార్యాలయంలో రామోజీరావుకు నేతలు నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, నక్కా ఆనంద్‌బాబు, బొండా ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్సీ పి అశోక్‌ బాబు, దువ్వారపు రామారావు, ఎమ్మెల్యేలు కొండ్రు మురళి, దాట్ల సుబ్బరాజు, ఎంఎస్‌ రాజు, మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డి, నాయకులు ఎవి రమణ, దారు నాయక్‌, దారపనేని నరేంద్రబాబు తదితరులు రామోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామోజీరావు మృతి తెలుగు ప్రజలకు తీరని లోటని ఈ సందర్భంగా నేతలు అన్నారు.

సారా ఉద్యమానికి రామోజీ రావు బాసటగా నిలిచారు : ఐద్వా నాయకులు పుణ్యవతి
ఈ నాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు నాటి సారా వ్యతిరేక ఉద్యమానికి బాసటగా నిలిచారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు ఎస్‌ పుణ్యవతి గుర్తు చేశారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపారు. రామోజీరావు ఈనాడు పత్రిక ద్వారా ఆనాటి సారా ఉద్యమానికి ఎంతో మద్దతు ప్రకటించారని తెలిపారు. మహిళల కోసం తొలిసారిగా ఈనాడు పత్రికలో ప్రత్యేకించి వసుంధర పేజీని ప్రారంభించారని గుర్తు చేశారు. 1993లో విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం స్వర్ణోత్సవ సభలకు ముఖ్య అతిథిగా హాజరై మద్దతు ప్రకటించారని తెలిపారు.రామోజీ మరణం పట్ల ఐద్వా సీనియర్‌ నాయకులు టీ జ్యోతి, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్‌ అరుణజ్యోతి, మల్లు లక్ష్మీ, తదితరులు సంతాపాన్ని ప్రకటించారు.

రామోజీ ప్రస్థానం
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్‌ 16న చెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను ప్రారంభించి తెలుగునాట సంచలనం సృష్టించారు. 1962లో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను స్థాపించారు. 1969లో రైతుల కోసం అన్నదాత పత్రికను ప్రారంభించారు. 1974 ఆగస్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభించారు. రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా రాణించారు. హైదరాబాద్‌లో ఫిల్మ్‌సిటీని నిర్మించారు.
1995 ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈ-టివిని రామోజీరావు ప్రారంభించారు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్‌వర్క్‌గా అది విస్తరించింది. ప్రతిక్షణం ప్రపంచ వీక్షణం పేరిట 13 భాషల్లో వార్తలు అందించారు. ఈ-టివి ప్లస్‌, ఈ-టివి సినిమా, ఈ-టివి అభిరుచి, ఈ-టివి లైఫ్‌, ఈ-టివి బాలభారత్‌ ఛానళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ-టివి వినోదాత్మక, విజ్ఞానదాయక కార్యక్రమాలు విశేష ప్రేక్షకాదరణపొందాయి. ‘పాడుతా తీయగా’ కార్యక్రమం ద్వారా వందల మంది గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు. మట్టిలో మాణిక్యాలను ఎంతోమందిని వెలుగులోకి తీసుకొచ్చారు. ఉషా కిరణ్‌ మూవీస్‌ ద్వారా రామోజీరావు వివిధ భాషల్లో 87 సినిమాలు నిర్మించారు. తెలుగు వంటకాల రుచులను ప్రపంచానికి పరిచయం చేసేలా 1980 ఫిబ్రవరిలో ప్రియా ఫుడ్స్‌ను ప్రారంభించారు. ఆహార ఉత్పత్తుల రంగంలో ప్రియా ఫుడ్స్‌కు అనేక రాష్ట్ర, జాతీయ పురస్కారాలు లభించాయి. రామోజీరావు సేవలకుగాను 2016లో భారత ప్రభుత్వం ఆయనను దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది.

➡️