చిక్కని చిరుత

Sep 30,2024 03:31 #East Godavari, #Leopard
  • 23 రోజులుగా ముప్పతిప్పలు
  • తాజాగా బుర్రిలంకలో అడుగుజాడలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : తూర్పుగోదావరి జిల్లాలో చిరుత కలకలం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. 23 రోజుల క్రితం దివాన్‌ చెరువు అటవీ ప్రాంతంలోని దూరదర్శన్‌ కేంద్రం కార్యాలయ ఆవరణలో దీని అడుగుజాడలను తొలిసారిగా అధికారులు గుర్తించారు. తాజాగా ఈ చిరుత కడియం మండలం బుర్రిలంకలో సంచరిస్తున్నట్లు అటవీ శాఖాధికారులు ఇటీవల ధ్రువీకరించారు. అప్పటి నుంచి చిరుత కోసం గాలిస్తూ ఉన్నా అది చిక్కడం లేదు. జిల్లాలో సంచరిస్తున్న చిరుత సమీపంలో ఉన్న మారేడుమిల్లి ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చిందని అధికారులు అభిప్రాయపడ్డారు. కానీ, నేటికీ దీన్ని ధ్రువీకరించలేదు. ఒక్కటే వచ్చిందా? లేక జంటగా వచ్చిందా? అనే అనుమానం కూడా వ్యక్తమైంది. ఒక్క చిరుతే వచ్చినట్టు 15 రోజుల తర్వాత నిర్ధారణకు వచ్చారు. కడియం మండలం బుర్రిలంక శివారులోని లంక ప్రాంతాల్లో జింకలు ఉన్నందున అటువైపు వెళ్లేందుకు ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు.

అధికారుల ప్రయత్నాలు విఫలం
చిరుతను బంధించేందుకు అటవీ శాఖాధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. దివాన్‌ చెరువు రిజర్వ్‌ ఫారెస్టులో 70 ట్రాప్‌ కెమెరాలను అమర్చి చిరుత కదలికలను పరిశీలిస్తూ వచ్చారు. దాన్ని బంధించేందుకు ఏడు బోన్లను అమర్చారు. తాజాగా చిరుత దిశ మార్చడంతో కడియంలో 20 ట్రాప్‌ కెమెరాలను, ఐదు సోలార్‌ బేస్డ్‌ సిసి కెమెరాలను, రెండు బోనులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఐదు బృందాలు గాలిస్తున్నాయి. 60 మంది అటవీ సిబ్బంది డ్రోన్లతోనూ జల్లెడ పడుతున్నారు. ఇప్పటి వరకూ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అధికారుల ప్రణాళికలకు అనుగుణంగా బోనులోకి వెళ్తేసరే, లేకుంటే మేకపై దాడి చేస్తే తగు జాగ్రత్తలు తీసుకుని మత్తు ఇంజక్షన్‌ ఇచ్చేందుకు కూడా సిద్ధపడినా చిరుత జాడ లేక అయోమయంలో పడ్డారు.

ప్రజల్లో ఆందోళన
జిల్లాలో చిరుత సంచారంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వర్షాకాలంలో మొక్కల ఎగుమతులు, దిగుమతులు అధికంగా జరుగుతుంటాయి. నర్సరీల మధ్యగా చిరుత సంచా రం నేపథ్యంలో కార్మికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు నాలుగు వేల ఎకరాల్లో ఉన్న నర్సరీల్లో 30 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. నర్సరీలను అనుకునే జనావాసాలు ఉండడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. ప్రస్తుతం చిరుత సంచారంతో కొంతమంది కార్మికులు పనులకు కూడా వెళ్లడం లేదు.

అసత్య ప్రసారాలు చేస్తే చర్యలు : ఎస్‌ భరణి, జిల్లా అటవీ శాఖాధికారి, తూర్పుగోదావరి జిల్లా
గోదావరి లంకల్లో అటవీ శాఖ బృందాలు అన్వేషణ సాగిస్తున్నాయి. కడియం నర్సరీల్లో పనిచేసే వారికి, చుట్టుపక్కల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నాం. అసత్య ప్రచారాలకు పాల్పడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు.

 

➡️