- ఆర్‌టిసికి గుదిబండగా మారనున్న విద్యుత్ బస్సులు
- ప్రయాణికులపై అధిక భారం !
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థను కార్పొరేట్లకు అప్పజెప్పేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే గత డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం పిఎం ఇ-బస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ముఖ్య ఉద్ధేశం ఆర్‌టిసిని ప్రైవేటీకరణ చేయడమేనని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం అమలులో భాగంగా విద్యుత్ బస్సుల పేరుతో ప్రైవేట్ యాజమాన్యాలను, కార్పొరేట్లను ఆర్‌టిసిలోకి చొప్పించేందుకు పథక రచన చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర నిర్ణయాలకు అనుకూలంగా 2029 నాటికి 100 శాతం ఆర్‌టిసి బస్సులను విద్యుత్ బస్సులుగా మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జిఓ నెంబరు 88ని 11.12.24న విడుదల చేసింది. తొలి విడతగా రాష్ట్రంలోని 11 ప్రధాన నగరాల్లో 750 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలని డిప్యూటీ సిఎంఇ, డిపిటిఒలకు 11.12.24న లెటర్ ఇచ్చినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యుత్ బస్సుల కొనుగోలు వైపు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎపిఎస్‌ఆర్‌టిసిలో 11,216 బస్సులు ఉండగా, 2,751 అద్దె బస్సులు ఉన్నాయి. అందులో 100 విద్యుత్ బస్సులు ఉన్నాయి. విద్యుత్ బస్సుల్లో ఒక్క ఆర్‌టిసి ఉద్యోగి కూడా పనిచేయడం లేదు. ప్రస్తుతం ఇలా కొనసాగుతుంటే రానున్న రోజుల్లో 750 విద్యుత్ బస్సులు వస్తే, ఆర్‌టిసిలో 3,700 వరకు ఆర్‌టిసి ఉద్యోగులు, డ్రైవర్లు, మెకానిక్‌లు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత ఉండదని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. 2029 నాటికి అన్నీ ప్రైవేటు విద్యుత్ బస్సులే వస్తే ఆర్‌టిసి ఉద్యోగుల ఉద్యోగాలకు భద్రత ఉండదని, అంతేకాకుండా ప్రయాణ ఛార్జీలు భారం సామాన్యులపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి 2019 మధ్యలో ఫేమ్-1, 2 పథకాలను (ఫాస్టర్ అడాప్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) ప్రవేశపెట్టింది. ఇందులో బస్సుల కొనుగోలు, నిర్వహణ, నడపడం ప్రైవేటు వారే చేయాలనే షరతు విధించింది. దీనికి జిసిసి (గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు) అని పేరు పెట్టింది. ఈ విధానంలో ఖర్చులు, లాభాలు కలుపుకుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఇదే తరహాలో పిఎం ఇ-బస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. నూతన పథకం అమలులో భాగంగా విద్యుత్ బస్సులపై వేలకోట్లు ఖర్చు చేయనుంది. పర్యావరణ హితం కోసం అని పైకి చెబుతున్నప్పటికీ దీని వెనుక కార్పొరేట్లకు సబ్సిడీ అమౌంట్‌ను ఇవ్వాలని చూస్తోందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. తప్పనిసరిగా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలనుకుంటే… విద్యుత్ బస్సులకు కేంద్రం ఇచ్చే రాయితీలను ఆర్‌టిసిలకే ఇవ్వాలన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ నేరుగా ఆర్‌టిసికే కల్పించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్‌టిసి ప్రైవేటీకరణ ఆపాలని పేర్కొంటుంది.