చురుగ్గా విమానాశ్రయ రహదారి పనులు

Feb 2,2025 08:04 #Busy airport road works
  • ప్రస్తుతం 6కిలోమీటర్ల వరకే భూములు లభ్యం
  • వాహనాలు వెళ్లేలా పలుచోట్ల అండర్‌ పాస్‌లు
  • 200 అడుగుల వెడల్పుతో నాలుగు లైన్ల రహదారి

ప్రజాశక్తి – భోగాపురం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళేందుకు అవసరమైన అప్రోచ్‌ రోడ్డు రహదారి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతానికి 6కిలో మీటర్లు వరకు ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడంతో చురుగ్గా సాగుతున్నాయి. మిగతా రహదారికి సంబంధించి పరిహారం విషయంలో విశాఖ భూసేకరణ ట్రిబ్యునల్‌ కోర్టులో కేసులు కొనసాగుతున్నాయి. విమానాశ్రయానికి జాతీయ రహదారి నుంచి వెళ్ళేందుకు ఉప్పాడపేట జంక్షను వద్ద నిర్మించనున్న ట్రంపెట్‌ నుంచి వెళ్లాలి. కానీ ఏ.రావివలస రెవెన్యూ పరిధిలో ఉన్న ఈ ట్రంపెట్‌ సమీపంలో ఇంకా రైతులకు పరిహారం ఇవ్వకపోవడంతో దీనికి 500 మీటర్లు దూరం నుంచి ప్రస్తుతం రోడ్డు పనులు సాగుతున్నాయి. అక్కడ నుంచి ఆరు కిలో మీటర్లు వరకు ఎటువంటి ఇబ్బందులూ లేకపోవడంతో ఇటీవలి ఈ రహదారి నిర్మాణ పనులు ప్రారంభించారు.
200 అడుగుల వెడల్పుతో రహదారి
జాతీయరహదారి నుంచి 500 మీటర్లు దూరం విడిచిపెట్టి అక్కడ నుంచి విమానాశ్రయానికి వెళ్ళేందుకు ప్రస్తుతం రహదారి పనులు జరుగుతున్నాయి. కెపిసి అనే నిర్మాణ సంస్థ ఈ పనులను చేపడుతోంది. 22 మీటర్లు అంటే 200 అడుగుల వెడల్పుతో నాలుగులైన్లతో ఈ రహదారి పనులు జరుగుతున్నాయి. స్థానికుల వాహనాలు అటూ ఇటూ వెళ్ళే విధంగా అక్కడక్కడ అండర్‌పాస్‌లను సైతం నిర్మిస్తున్నారు. ఏ.రావివలస జగనన్న కాలనీ, గూడెపువలస మూడుగుళ్ళు సమీపంలో, పలుచోట్ల అండరర్‌ పాస్‌లు నిర్మాణం జరుగుతున్నాయి. ప్రస్తుతం మట్టి పనులు జోరందుకున్నాయి. అవసరమైన చోట కల్వర్టులను సైతం నిర్మిస్తున్నారు. ఇదే రహదారికి గూడెపువలస రెవెన్యూ పరిధిలో 20 ఎకరాలకు రైతుల నుంచి అనుమతి లభించింది.
ఇటీవలి ఈ 20 ఎకరాలకు అవార్డ్‌ కూడా పాస్‌ చేశారు. విశాఖ ట్రిబ్యునల్‌ కోర్టులో కేసు పరిష్కారం కావడంతో త్వరలో రైతుల ఖాతాలోకి పరిహారం పడుతుందని గూడెపువలస గ్రామ సర్పంచ్‌ మట్టా ఆయ్యప్పరెడ్డి సమక్షంలో రైతులకు ఆర్‌డిఒ దాట్ల కీర్తి చెప్పడంతో రైతులు సమ్మతించారు. ఈ 20 ఎకరాల్లో కూడా అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. కంచేరు రెవెన్యూ పరిధిలోని బైరెడ్డిపాలెం, ఏరావివలస రెవెన్యూ పరిధిలో ఇంకా కోర్టు కేసులు తేలకపోవడంతో రైతులు రహదారి నిర్మాణానికి అనుమతించడం లేదని, ఇవి కూడా త్వరలో తేలిపోతాయని అధికారులు చెబుతున్నారు.

➡️