- చక్రం తిప్పిన అనకాపల్లి పార్లమెంట్ ప్రాంత ‘కూటమి’ ప్రజాప్రతినిధి
- బొగ్గు సరఫరా పాత కాంట్రాక్టులన్నీ రద్దుకు యాజమాన్యంపై ఒత్తిడి?
- అదానీ బొగ్గు కాంట్రాక్టు అమల్లోకి వస్తే విశాఖ పోర్టుపైనా ప్రభావం
ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో : ప్రభుత్వాలను, ప్రజాప్రతినిధులను లోబర్చుకుని దేశ, విదేశాల్లో అనేక ఆర్థిక లూటీలకు పాల్పడిన గౌతమ్ అదానీ తాజాగా ఉమ్మడి విశాఖపట్నం ప్రాంతం పరవాడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్‌టిపిసి) పవర్ ప్రాజెక్టులోకి అడ్డగోలు ప్రవేశానికి సిద్ధమయ్యాడు. సదరు సంస్థ టెండరు పిలవలేదు, బొగ్గు సరఫరాకు కొత్త కాంట్రాక్టర్లు కావాలని ఎక్కడా ప్రకటనా ఇవ్వలేదు. కానీ, అదానీ ఇక్కడకు ఎంట్రీ ఇచ్చేశాడు. రాష్ట్రం, కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని రూ.వందల కోట్ల కాంట్రాక్టులను కొల్లగొట్టే వ్యూహ రచన చేశాడు. ‘ఈ వ్యవహారంలో మిగతా అన్నిచోట్ల మాదిరిగానే ప్రభుత్వ పాలకులు ఎలాగైతే అదానీకి సాగిలపడ్డారో అనకాపల్లి పార్లమెంట్ ప్రాంతంలోగల ‘కూటమి’కి చెందిన 2024 ఎన్నికల్లో గెలిచిన ఓ ప్రజాప్రతినిధి అదానీ అడుగులకు మడుగులొత్తి ఎన్‌టిపిసి యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి మరీ పాత కాంట్రాక్టులన్నింటినీ రద్దు చేయించడం ఈ ప్రాంతంలో తాజాగా చర్చనీయాంశమైంది. సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి అదానీ, అదానీ గ్రూపునకు చెందిన వ్యక్తులు దేశంలోని అధికారులకు ముడుపులు ముట్టజెప్పారని అమెరికా కోర్టులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం అంతర్జాతీయంగా పెను సంచలనం రేకెత్తిస్తున్న తరుణంలోనూ పరవాడ ఎన్‌టిపిసిలో అడ్డగోలుగా అడుగు మోపి ఇది వరకు బొగ్గు సరఫరా చేసిన కాంట్రాక్టర్లను వెనక్కి నెట్టినట్లు సమాచారం. రాష్ట్రంలో కూటమి (బిజెపి సహా) అధికారంలో ఉండడం, కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడంతో బొగ్గును ఇప్పటివరకూ ఎన్‌టిపిసికి సరఫరా చేసిన కాంట్రాక్టర్లు బయటకు చెప్పుకోలేకపోతున్నారు. ఎన్‌టిపిసికి ఎన్ని వర్క్ ఆర్డర్లయితే ఉన్నాయో వాటన్నిటినీ అనకాపల్లి ప్రాంత ‘కూటమి’ ప్రజాప్రతినిది ద్వారా రద్దు చేయించినట్లు తాజాగా పరవాడ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.
అదానీ బొగ్గు రాబోతుందంటూ కొత్త వ్యక్తులు రంగ ప్రవేశం
పరవాడ ఎన్‌టిపిసికి అదానీ బొగ్గు రాబోతుందంటూ పెద్ద ఎత్తున ఇక్కడ కాంట్రాక్టర్లు, ఉద్యోగుల్లో తాజాగా చర్చ సాగుతోంది. నాలుగు రోజుల క్రితం పరవాడ ఎన్‌టిపిసికి ఉత్తరాదికి చెందిన కొద్దిమంది వ్యక్తులు వచ్చి తాము అదానీ మనుషులమని ఎన్‌టిపిసికి అదానీ బొగ్గు రాబోతోందని అడిగిన వారికీ, అడగని వారందరికీ హిందీలో చెబుతూ తమకు నివాస భవనాలు కావాలంటూ ఎన్‌టిపిసి ప్లాంట్ చుట్టూ తిరిగారు. అదానీ బొగ్గు ప్రత్యేకమైనదని, ఎన్‌టిపిసికి ఇప్పుడు వచ్చే కోల్ కంటే నాణ్యమైనందని వీరు చెప్పినట్లు ఈ ప్రాంతానికి చెరందిన కొంతమంది ‘ప్రజాశక్తి’కి తెలిపారు. కొద్దిమంది కాంట్రాక్టర్లను సైతం అదానీ మనుషులు ఈ సందర్భంగా కలవడంతో వారంతా తీవ్ర ఆందోళనలో పడ్డారు.
దేశంలో 2 ప్రాంతాల నుంచి ఎన్‌టిపిసికి బొగ్గు
బొగ్గును మండించడం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సంస్థల్లో దేశంలో పరవాడలోని ఎన్‌టిపిసి (సింహాద్రి) ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. రోజుకు 2000 మెగావాట్ల థర్మల్ పవర్ ఇక్కడ ఉత్పత్తి జరుగుతోంది. దేశంలోని తాల్చేరు, సింగరేణి నుంచి రైలు వ్యాగన్లలో రోజుకు రెండుసార్లు బొగ్గు వస్తోంది. అదానీకి బొగ్గు కాంట్రాక్టు దక్కితే ప్రభుత్వ రంగ సంస్థకు బొగ్గు సరఫరాలో గుత్తాధిపత్యంతో ఎన్‌టిపిసినే మింగేస్తాడంటూ పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోర్టు ఉన్నతాధికారులు ఏమంటున్నారంటే…
విదేశాల నుంచి ఎన్‌టిపిసికి బొగ్గు ఇంతవరకూ సముద్రం ద్వారా రవాణా జరిగి విశాఖ పోర్టులోని డబ్ల్యు క్యు 1, 2 బెర్తుల మీదకు వచ్చి అక్కడి నుంచి వ్యాగన్లలో పరిశ్రమకు వెళ్తోంది. ఈ బొగ్గు సరఫరాలో పెత్తనం చిన్నా, చితక కాంట్రాక్టర్లు పోయి బడా కాంట్రాక్టరు అదానీ లాగేసుకుంటే వైజాగ్ పోర్టు నుంచి ఇంతవరకూ సరఫరా చేసే బొగ్గు ఇక్కడకు రాకుండా పోతుందని గంగవరానికి డైవర్ట్ అవుతుందని పోర్టు ఉన్నతాధికారులు బుధవారం రాత్రి ప్రజాశక్తికి తెలిపారు. గత ప్రభుత్వంలో అదానీకి గంగవరం పోర్టు వెళ్లిపోగా విశాఖ పోర్టు నుంచి కార్గోను దారి మళ్లించే కుట్రలు జరిగాయని, అదానీ ఆధీనంలోకి ఎన్‌టిపిసి వెళితే పోర్టు ఆదాయం పడిపోతుందన్నారు. అదానీతో విశాఖ పోర్టు అనుభవం చూస్తే… 2014లో బెర్తు తీసుకుని నాలుగేళ్లపాటు వ్యాపారం సరిగ్గా చేయలేకపోయాడు. ఆయనతో పాటు బెర్తులు తీసుకున్న వైజాగ్ సీ పోర్టు, వేదాంత సమర్థవంతంగా కార్గో చేసుకున్నాయి. కానీ, తాను పోర్టు బెర్తు తీసుకుని ఆర్థికంగా నష్టపోయానంటూ 2021లో రూ.280 కోట్లు పరిహారం తనకు ఇవ్వాలంటూ పోర్టుపై కేంద్రంలోని బిజెపి ద్వారా ఒత్తిడి తెచ్చాడు. బెర్తును తిరిగి స్వాధీనం చేసుకోవడానికి విశాఖ పోర్టు అధికారులు నానాపాట్లూ పడి ఎట్టకేలకు స్వాధీనం చేసుకోగలిగారు. విశాఖ ఉక్కుకు ముడి ఖనిజాన్ని, బొగ్గును రవాణా చేసే గంగవరం పోర్టు ఇది వరకే అదానీ పరం అయిపోయింది. దాని ఆధారంగా విశాఖ ఉక్కును అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆ పరిశ్రమ చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. తాజాగా ఎన్‌పిటిసి (సింహాద్రి)కి కీలకమైన బొగ్గు రవాణా కూడా ఈ కార్పొరేట్ సంస్థ చేజిక్కితే కీలక ప్రభుత్వరంగ పరిశ్రమ మనుగడ కూడా ప్రమాదంలో పడుతుంది.