- పరిష్కరించటంలో కేంద్రం విఫలం
- ‘సుభాశ్ చంద్ర గార్గ్’ పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ పాలనలో భారత్‌లో కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. దీనిపై పలు జాతీయ, అంతర్జాతీయ నివేదికలు, సంస్థలు హెచ్చరిస్తున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం పరిస్థితి మారటం లేదు. దేశంలో వాహనాల వినియోగం విరివిగా పెరిగిపోవటం, పరిశ్రమలు నిబంధనలను గాలికొదిలేస్తూ కాలుష్య కారకాలను విడుదల చేయటం కారణంగా భారత్‌లో పరిస్థితులు నానాటికీ క్షీణిస్తున్నాయి. గాలి, నేల, నీరు.. ఇలా అన్నీ కలుషితమవుతున్నాయి. భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో చేష్టలుడిగి చూస్తున్నది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి కారణంగా భారత్‌లో కాలుష్యం తీవ్రమవుతున్నది. కాలుష్యాన్ని అధిగమించటంలో భారత ప్రభుత్వం విఫలమైంది. కేంద్రంలో వివిధ హౌదాల్లో పని చేసిన ఐఏఎస్ అధికారి సుభాశ్ చంద్ర గార్గ్ రాసిన పుస్తక సారాంశం 2019-24 మధ్య మోడీ 2.0 పాలనలో జరిగిన పలు విషయాలను వెల్లడిస్తున్నది.
భారత్‌లోని అనేక పరిశ్రమలు, నగరాలు నదులు, చెరువుల్లోకి కర్బన పదర్థాలతో పాటు ఇతర కాలుష్య కారకాలను ఒదులుతున్నాయి. దీంతో నీరు కాలుష్యమవుతున్నది. ఫలితంగా నీరు తాగటానికి, ఇతర వినియోగాలకు కూడా అనుకూలంగా ఉండటం లేదు. నీటి నాణ్యత కోసం 2016లో కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) పర్యవేక్షించిన 521 నదుల్లో 320కి పైగా కాలుష్యానికి గురి కావటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 2015లో సీపీసీబీ నివేదిక ప్రకారం భారత్‌లో కాలుష్యానికి గురైన నదుల సంఖ్య 121 నుంచి 275కి, 2018లో 351కి పెరగటం గమనార్హం.
2019లో ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం భారత్ 83.2 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్‌తో అధిక గాలి కాలుష్యాన్ని కలిగి ఉన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నిర్ధారించిన సురక్షిత పరిమితి 10 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ కంటే ఇది ఎక్కువ కావటం ఆందోళనకరం. 2010-19 మధ్య నైజీరియా, బంగ్లాదేశ్ తర్వాత గాలి నాణ్యతో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. భారత్‌లో కాలుష్య నియంత్రణ (సీఓపీ) పథకం 2018 నుంచి అమలులో ఉన్నది. దేశవ్యాప్తంగా గాలి నాణ్యతను పర్యవేక్షించటం, తగిన ఉపశమన చర్యలు తీసుకోవటం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీనితో పాటు నీటి నాణ్యతను, శబ్ధ కాలుష్యాన్ని కూడా ఇది పర్యవేక్షిస్తుంది. 2022-23లో సీఓపీ కింద వాస్తవ వ్యయం రూ.599.91 కోట్లుగా ఉన్నది. 2023-24లో సవరించిన అంచనాలు రూ.848 కోట్లకు చేరాయి. ఈ పథకం కింద నిధులు సీపీసీబీకి విడుదలవుతాయి. ఆ తర్వాత దాని నుంచి రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు నిధులు అందుతాయి.
కోట్ల రూపాయల మొత్తంలో ప్రభుత్వం నిధులను కేటాయిస్తున్నప్పటికీ.. కాలుష్య నియంత్రణలో మాత్రం ఆశించిన ఫలితాలు రావటం లేవు. మేనేజింగ్ ది నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్‌సీఏపీ) కింద 2019లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 131 నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపర్చటానికి నిర్ణయించారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్‌సీసీ) వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2022-23లో కేవలం 9 నగరాల్లో మాత్రం గాలి నాణ్యతలో మెరుగుదల కనిపించింది. దాదాపు నాలుగేండ్ల పాటు పథకం నడిచినా.. ఆ 9 నగరాల్లో కూడా నాణ్యత అనేది ఎంత మొత్తంలో జరిగిందన్నది కేంద్రం వెల్లడించలేకపోవటం గమనార్హం. అలాగేఏ, 41 నగరాల్లో గాలి నాణ్యత క్షీణించటం లేదా స్తబ్దుగా ఉన్నది.
కేంద్రం వైఫల్యంపై పర్యావరణ, శాస్త్రవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ సర్కారుకు దేశంలో పర్యావరణ పరిరక్షణపై శ్రద్ధ కరువైందనీ, అందుకే కోట్ల రూపాయలను వెచ్చించినా.. కాలుష్య రక్కసిని దేశంలో నియంత్రించలేకపోతున్నదని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని, కాలుష్యంపై కఠినంగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.