మళ్లీ మొదటికే!

  • ప్రకాశం బ్యారేజీ దిగువన రెండు బ్యారేజీ నిర్మాణాలకు తిరిగి అంచనాలు
  • గతంలో రూ.4,761.81 కోట్లతో ప్రతిపాదనలు
  • తాజాగా సాగునీటి ప్రాజెక్టులకు ప్రభుత్వ 4పి పాట

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి : ప్రకాశం బ్యారేజీ దిగువన మరో రెండు బ్యారేజీల నిర్మాణ ప్రతిపాదన మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో ఈ రెండు ప్రాజెక్టులకూ రూ.4,761.81 కోట్లతో డిపిఆర్‌ను జలవనరుల శాఖ సిద్దం చేసింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం ఈ రిపోర్టును పక్కనబెట్టింది. 2024 అక్టోబర్‌లో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకుని 15 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినా తట్టుకునేలా తిరిగి డిపిఆర్‌ను రూపొందించాలని నిర్ణయించింది. ఈ బ్యారేజీల నిర్మాణానికి మూడోసారి సమగ్ర నివేదిక సిద్దం చేయడానికి జలవనరుల శాఖ రంగం సిద్దం చేసింది. 2017 నుంచి ఈ ప్రాజెక్టులు నివేదికలకే పరిమితమవుతోంది. డిపిఆర్‌ సవరణల పేరుతో పాలకులు కాలయాపన చేస్తున్నాయి. మరోపక్క సమ్రుదతీర ప్రాంతంలోని భూములకు ముంపు బెడద తప్పించేందుకు రూ.3,044.50 కోట్లతో ప్రతిపాదించిన ఏడు అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల నిర్మాణాలకు నిధులు విడుదలలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. తాజాగా సాగునీటి రంగంలోనూ పబ్లిక్‌ ప్రయివేటు పీపుల్స్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపిపి)ను తీసుకొస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఏ పద్ధతిలో చేపడతారనేది చర్చనీయాంశమైంది. కృష్ణా నది వరదలకు సముద్రంలో కలుస్తున్న నీటి నీటిని సద్వినియోగం చేసుకోవడానికి, తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు, భూగర్బ జలాల్లోకి సముద్రపు ఉప్పు నీరు చొచ్చుకురాకుండా నివారించేందుకు ప్రకాశం బ్యారేజీకి 16 కిలోమీటర్ల దిగువన పెనమలూరు మండలం చోడవరం వద్ద, 67 కిలోమీటర్ల దిగువన మోపిదేవి మండలం బండికోళ్లలంక వద్ద రెండు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి తొలుత 2017లో జలవనరుల శాఖ డిపిఆర్‌ సిద్ధం చేసింది. ఇది కార్యరూపం దాల్చలేదు. 2023లో వైసిపి ప్రభుత్వం చెక్‌డ్యామ్‌ల ప్రతిపాదనను పక్కనపెట్టింది. రూ.2,235.42 కోట్లతో చోడవరం వద్ద 5.3 టిఎంసిలు, రూ.2,526.39 కోట్లతో బండికోళ్లలంక వద్ద 4.7 టిఎంసిల నిల్వ సామర్ధ్యంతో బ్యారేజీలకు డిపిఆర్‌ సిద్దం చేసింది. రూ.204.37 కోట్లకు పాలనా ఆమోదం ఇచ్చింది. అయితే, నిధులు విడుదల చేయలేదు. దీంతో, డిపిఆర్‌ మినహా ఒక్కడుగూ ముందుకు పడలేదు. దీంతో, వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.
డ్రెయిన్లపై అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల విషయంలో నిర్లక్ష్యం
భారీ వర్షాలు కురిసినా పంట పొలాలు ముంపునకు గురవ్వకుండా రక్షించడంలో డెల్టా ప్రాంతంలో డ్రెయిన్లు కీలకం. ఈ డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతంలో గతంలో అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు నిర్మించారు. సముద్రపు నీరు ఎగువకు డ్రెయిన్లలోకి రాకుండా అడ్టుకుంటూ, ఎగువ నుంచి అధికంగా వచ్చిన నీటిని దిగువన సముద్రంలోకి మళ్లించడానికి ఏర్పాటు చేసిన స్లూయిజ్‌ రెగ్యులేటరీ వ్యవస్థ పూర్తిగా శిథిలమైంది. దీంతో, కోడూరు, నాగాయలంక, బందరు మండలాల్లోని వేలాది ఎకరాల వ్యవసాయ భూములు సముద్రానికి పోటు వచ్చినప్పుడు ముంపునకు గురవుతున్నాయి. రత్నకోడు, న్యూ ఇరాలీ డ్రెయిన్‌, లింగన్నకోడు, సాగ కాలువ, కోడూరు అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌, మేకల కాలువ, ఉప్పు కాలువ పరివాహక ప్రాంతంలోని ఏడు వేల ఎకరాలు సముద్రపు నీటితో ఏటా ముంపు బారినపడుతున్నాయి. దీంతో ఈ భూముల్లో పంటల సాగు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో రూ.3,044.50 కోట్లతో ఏడు అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌ల నిర్మాణ ప్రతిపాదనలు నాలుగేళ్ల క్రితం తయారు చేశారు. ఇవి కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. తాజాగా నీటి ప్రాజెక్టుల నిర్మాణానికి పిపిపిపి విధానాన్ని తీసుకొస్తామని టిడిపి కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రెండు బ్యారేజీలు, ఏడు అవుట్‌ఫాల్‌ స్లూయిజ్‌లు నిర్మాణాన్ని ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి.

➡️