మిత్రులకు మొండిచేయి ..కీలక పదవులన్నీ బిజెపికే

Jun 12,2024 09:08

11 మంత్రి పదవులతో సరి
అందులోనూ ఐదుగురికే క్యాబినెట్‌ హోదా
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ మంత్రిమండలిలో బిజెపి భాగస్వామ్య పక్షాలకు సముచిత ప్రాతినిధ్యం లభించలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనేక మిత్రపక్షాల డిమాండ్లను మోడీ ఖాతరు చేయలేదు. మోడీ క్యాబినెట్‌లోని 72 మంది సభ్యుల్లో బిజెపి భాగస్వామ్య పక్షాలకు చెందిన 11 మందికే చోటుదక్కింది. వారిలోనూ ఐదుగురికే క్యాబినెట్‌ హోదా లభించింది.
క్యాబినెట్‌ పదవులు వీరికే
దక్షిణది నుండి జెడిఎస్‌ నేత హెచ్‌డి కుమారస్వామికి భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ లభించింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. బీహార్‌ నుండి హిందుస్థానీ ఆవామ్‌ మోర్చ సెక్యులర్‌ పార్టీకి చెందిన జితన్‌ రామ్‌ మాంఝీకి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖను అప్పగించారు. అదే రాష్ట్రానికి చెందిన జెడియు ఎంపీ రాజీవ్‌ రంజన్‌సింగ్‌కు పంచాయతీరాజ్‌తోపాటు మత్స్య. పశు సంవర్థక, డెయిరీ శాఖను ఇచ్చారు. లోక్‌ జనశక్తి పార్టీ (రాం విలాస్‌) నేత చిరాగ్‌ పాశ్వాన్‌కు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల శాఖను కేటాయించాయి. మిత్రపక్షాలకు చెందిన ఈ ఐదుగురికి మాత్రమే క్యాబినెట్‌ హోదా దక్కింది.
సహాయ మంత్రులు వీరే
శివసేనకు చెందిన జాదవ్‌ ప్రతాప్‌రావు గణపతిరావ్‌, ఆర్‌ఎల్‌డీకి చెందిన జయంత్‌ చౌదరికి స్వతంత్ర హోదాతో మంత్రి పదవులు లభించాయి. ఇక రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (అథావలే) నేత రాందాస్‌ అథావలేకు ఒక మంత్రిత్వ శాఖలో, అప్నాదళ్‌కు చెందిన అనుప్రియా పటేల్‌కు రెండు మంత్రిత్వ శాఖల్లో సహాయ మంత్రి పదవులు ఇచ్చారు. ఆయా పార్టీలకు సభలో వీరిద్దరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, సోషలిస్టు నేత కర్పూరీ ఠాకూర్‌ కుమారుడు రామ్‌నాథ్‌ ఠాకూర్‌, తెలుగుదేశం పార్టీకి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్‌లకు కూడా సహాయ మంత్రి పదవులు లభించాయి.
డిమాండ్లు నెరవేరలేదు
పదహారు మంది సభ్యులున్న తెలుగుదేశం పార్టీ స్పీకర్‌ పదవితో పాటు నాలుగు కీలక మంత్రిత్వ శాఖల కోసం పట్టుబట్టి, చివరికి రెండు పదవులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని తెలిసింది. జనసేనకు క్యాబినెట్‌లో స్థానం దక్కలేదు. మరోవైపు 12 మంది ఎంపీలున్న జెడియు రైల్వేలు సహా మూడు మంత్రిత్వ శాఖలను కోరింది. ఒకప్పుడు తన తండ్రి రాం విలాస్‌ పాశ్వాన్‌ నిర్వహించిన రైల్వే శాఖను తనకు కేటాయించాలని చిరాగ్‌ కూడా అడిగారు. నరేంద్ర మోడీ మాత్రం కీలక శాఖలన్నింటినీ బిజెపి సభ్యులకే కట్టబెట్టారు.
మిత్రపక్షాలకు పరిమాణంలోనే (క్వాంటిటీ)లోనే కాదు…నాణ్యత (క్వాలిటీ)లోనూ మొండిచేయే చూపారని అమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ సంజరు సింగ్‌ వ్యంగ్యోక్తి విసిరారు. ‘హోం లేదు. రక్షణ లేదు. ఆర్థికం లేదు. విదేశాంగ శాఖా లేదు. వాణిజ్యం లేదు. రైల్వే లేదు. విద్య లేదు. ఆరోగ్యమూ లేదు. వ్యవసాయం లేదు. జల శక్తీ లేదు. పెట్రోలియం లేదు. టెలీకమ్యూనికేషన్లూ లేవు’ అని సెటైర్‌ వేశారు. బిజెపి మిత్రపక్షాలకు ఇది అవమానకరమని ఆయన చెప్పారు. మంత్రి పదవిని ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌ తిరస్కరించారని, తనకు ఇవ్వజూపిన పదవి తన స్థాయిని తగ్గిస్తుందని ఆయన భావించారని కాంగ్రెస్‌ ప్రతినిధి జైరాం రమేష్‌ తెలిపారు.

➡️