సమస్యలపై గళమెత్తిన ఓటరు

May 14,2024 09:23 #issue, #savvy voter
  • ఎన్నికలు బహిష్కరణ – తహశీల్దార్‌ హామీతో పోలింగ్‌
  • పంచాయతీలుగా గుర్తించాలని గిరిజనుల ఆందోళన

ప్రజాశక్తి – యంత్రాంగం : ఐదేళ్లకు ఒక్కసారి జరిగే పోలింగ్‌ సమయంలోనైనా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఏలూరు జిల్లా దేశవరం గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. రోడ్డువేస్తేనే ఓటు అని ఎన్నికలను బహిష్కరించారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు సౌదీ నుంచి నరసాపురం వచ్చిన ఓటర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తన ఓటు లేకపోవడంతో నిరుత్సాహపడ్డారు. గిరిజన గ్రామాలను పంచాయతీలకు ఏర్పాటు చేయాలని ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని పలు గిరిజన గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
రోడ్డు వేస్తేనే ఓటు వేస్తామని ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలోని దేశవరం గ్రామస్తులు ఓటింగ్‌ బహిష్కరించారు. ఎన్నో ఏళ్లుగా తాము నడవడానికి దారి లేదని మొరపెట్టుకున్నా, అర్జీలు ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి, తహశీల్దార్‌ వారి వద్దకు వెళ్లి రోడ్డు వేస్తామని, సమస్యను పరిష్కరిస్తామని చెప్పినా వారు ఓటు వేయడానికి నిరాకరించారు. కలెక్టర్‌ దృష్టిలో పెట్టామని, రోడ్డు వేసే బాధ్యత తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు పోలింగ్‌లో పాల్గొన్నారు.

ప్రత్యేక పంచాయతీ కోసం గిరిజనుల డిమాండ్‌
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలంలోని గిరిజన గ్రామాలకు ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేసి ఐటిడిఎలో కలపాలని వంక బొత్తప్పగూడెం, మర్రిగూడెం, తంగేళ్లగూడెం, బిల్లిమిల్లి, కిచప్పగూడెం గ్రామాల ప్రజలు ఓటు వేయడానికి నిరాకరించారు. మర్రిగూడెం, వంకబొత్తగూడెం గ్రామంలో నివసిస్తున్న గిరిజనుల్లో 358 మంది ఓటర్లు ఉండగా వారు పోలింగ్‌ బహిష్కరించారు. తమ గ్రామాలకు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు చేసి ఐటిడి పరిధిలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న కొయ్యలగూడెం తహశీల్దార్‌ వారి వద్దకు వెళ్లారు. గిరిజనులంతా కలిసి అధికారులకు వినతిపత్రం అందించారు. ఓటు గ్రామానికి చెందిన ఒకరితో ఓటు వేయించి తహశీల్దార్‌ వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో గిరిజనులు తహశీల్దార్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. స్థానిక విఆర్‌ఒ అడపా రాంబాబు గిరిజనులతో మాట్లాడి వారిని ఒప్పించారు. గిరిజనులు రాసుకున్న వినతిపత్రాన్ని విఆర్‌ఒ రాంబాబుకు అందించిన అనంతరం గిరిజనులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

వ్యాన్‌ బోల్తా పడి 18 మందికి గాయాలు
అల్లూరి జిల్లా పెద్దకోట పంచాయతీ పరిధి వేలమామిడి, సీడివలస పాటిపల్లి గ్రామాలకు చెందిన 35 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వైసిపి నాయకులు ఏర్పాటు చేసిన బొలెరో వాహనంలో పెద్దకోట పోలింగ్‌ బూత్‌కు వెళ్తుండగా కివర్ల ఘాట్‌ రోడ్డు కుడియా గ్రామ సమీపంలో వాహనం బోల్తాపడింది. 18 మందికి గాయాలవ్వగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.క్షతగాత్రులను విన్నకోట ప్రభుత్వ ఆసుపత్రికి, విశాఖలోని కెజిహెచ్‌కు తరలించారు.

సౌదీ నుంచి వచ్చినా ఓటు లేదు
ఎన్నికల్లో ఓటు వేసేందుకు నరసాపురం పట్టణంలోని 25వ పోలింగ్‌ బూత్‌లో చినముత్తేవి బాలాజీ శ్రీరామ్‌ సౌదీ నుంచి ఇండియాకు వచ్చారు. ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లగా..ఓటు లేదని చెప్పడంతో శ్రీరాము షాకయ్యారు. వీసాకు ఇంకా సంవత్సరం ఉన్నప్పటికీ రూ.50 వేలు టికెట్టు తీసుకొని ఇండియాకు వచ్చానని, తీరా ఓటు లేదని చెప్పడంతో బాధేసిందని శ్రీరాము చెప్పారు.

పాడేరులో కుండపోత వర్షం
అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర గంటల వరకు కురిసిన కుండపోత వర్షంతో పోలింగ్‌కు అంతరాయం కలిగింది. కొంతమంది ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేకపోయారు.

➡️