మరో రూ.9,412 కోట్ల భారం

Nov 30,2024 04:42 #a, #electric charges
  • పబ్లిక్‌ హియరింగ్‌ లేకుండానే విద్యుత్‌ ‘సర్దుపోటు’
  • ఉత్తర్వులు విడుదల చేసిన ఎపిఇఆర్‌సి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా విద్యుత్‌ వినియోగదారులపై డిస్కంలు భారాలపై భారాలు మోపుతున్నాయి. ఇప్పటికే ట్రూఅప్‌తో పాటు రెండు ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌ (ఎఫ్‌పిపిసిఎ) ఛార్జీలతో నడ్డివిరుస్తున్న విద్యుత్‌ సంస్థలకు మరో భారాన్ని మోపేందుకు ఎపి విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) అనుమతి ఇచ్చింది. పబ్లిక్‌ హియరింగ్‌ నిర్వహించకుండానే ఎఫ్‌పిపిసిఎ ఛార్జీలను కూడా వసూలు చేసుకోవచ్చని చడిచప్పుడు లేకుండా ఇఆర్‌సి కార్యదర్శి పి కృష్ణ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.12,844 కోట్లు ఎఫ్‌పిపిసిఎ కింద వసూలు చేసుకునేందుకు అనుమతినివ్వాలని ఇఆర్‌సికి డిస్కంలు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 19లోపు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు పంపాలని ఇఆర్‌సి ఈ నెల 4న బహిరంగ ప్రకటన విడుదల చేసింది. వేల కోట్లకు సంబంధించిన భారంపై కనీసం బహిరంగ విచారణ జరపకుండా రూ.9,412 కోట్లు వసూలు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది.

ఇఆర్‌సి అనుమతించిన దానిలో గత ఆర్థిక సంవత్సరం ప్రతినెలా 40 పైసలు చొప్పున రూ.2,868.90 కోట్లు డిస్కంలు వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి. మిగిలిన రూ.6,543.60 కోట్లను వచ్చే డిసెంబర్‌ నుంచి 2026 నవంబర్‌ వరకూ వసూలు చేసుకోవాలని ఎపిఇఆర్‌సి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిఎస్‌పిడిసిఎల్‌) పరిధిలో యూనిట్‌కు 0.9132 పైసలు, ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిసిపిడిసిఎల్‌) పరిధిలో 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎపిఇపిడిసిఎల్‌) పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి డిస్కంలు వసూ లు చేయనున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఒక నెలకు సంబంధించిన ఎఫ్‌పిపిసిఎ భారాన్ని రెండు నెలల్లో వసూలు చేసుకోమంది.

➡️