అంగన్‌వాడీలపై మరో భారం

  • కేంద్రాల వద్ద పోషక వనాల ఏర్పాటు
  • పర్యవేక్షణ బాధ్యత సిబ్బందిపైనే
  • ఇబ్బందులు తప్పవంటున్న వర్కర్లు

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : దేశంలోని బాల బాలికలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆంగన్‌వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. అంగన్‌వాడీ సిబ్బందికి నిర్ధిష్టమైన విధులను కూడా అప్పగించింది. అయితే వారి విధులకు ఆటంకం కలిగిస్తూ ఇతర పనులు అప్పగిస్తూ ప్రభుత్వాలు శ్రమ దోపిడీకి గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అంగన్‌వాడీలపై అదనపు భారాలు మోపుతున్నాయి. తాజాగా వీరిపై మరో అదనపు భారం పడుతోంది. అంగన్‌వాడీ కేంద్రాల వద్ద పోషక వనాల ఏర్పాటుకు టిడిపి కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా మొదటి విడతలో సొంత భవనాలున్న కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు.

కాకినాడ జిల్లా పరిధిలోని 10 ప్రాజెక్టుల్లో 1,986 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలోని 1,643 మంది గర్భిణులు, 11,989 మంది బాలింతలు, 6 నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులు 1,06,949 మంది సేవలు పొందుతున్నారు. కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నా చాలామందిలో రక్తహీనత ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, వాటిని అధిగమించే పనిలో భాగంగా టిడిపి కూటమి ప్రభుత్వం కిచెన్‌ గార్డెన్ల పేరుతో పోషన్‌ వాటిక కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. తొలి విడతలో జిల్లాలో సొంత భవనాలున్న 488 కేంద్రాల్లో పోషక వనాలు ఏర్పాటయ్యేలా చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నారు. వీటిలో ఆకుకూరలు, ఇతర మొక్కలు పెంచనున్నారు.

ఎటువంటి రసాయనాలు లేకుండా పండించిన పంటలతో కేంద్రాల్లో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు మధ్యాహ్న భోజనం పెట్టేందుకు ఈ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాలను ఉద్యాన శాఖ అధికారులు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆకు కూరలతో పాటూ మునగ, కరివేపాకు, మెంతి, పాల, తోటకూరలు, బొప్పాయి పెంచాలని నిర్ణయించారు.

బాధ్యత సిబ్బందిపైనే…

వనాల పర్యవేక్షణ, మొక్కల పెంపకం తదితర బాధ్యతలన్నీ ఆయా అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికే అప్పగిస్తామని అధికారులు తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం వండి పెట్టడం, పోషకాహార కిట్లు అందించే బాధ్యతను చూస్తూనే పోషక వనాలను కాపాడే బాధ్యతనూ వీరే చూడాల్సి ఉంది. ఈ అదనపు భారంపై అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడితో విధులను నిర్వర్తించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ సర్వేలకు సైతం తమతోనే చేయిస్తున్నారని వారు వాపోతున్నారు. తమకు జాబ్‌ చార్ట్‌లో ఉన్న విధులను మాత్రమే అప్పగించాలని, అదనపు పనులు అప్పగించడం సరికాదని డిమాండ్‌ చేస్తున్నారు.

➡️