పంచదారదీ అదే పరిస్థితి
ఈనెలలో రూరల్‌లో కేవలం బియ్యమే
అర్బన్‌లో గోధుమపిండి, రాగులు పంపిణీ
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి : ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌లో ఏ సరుకు ఏ నెల అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. రేషన్ కార్డుదారులకు ఏడాదికి పైగా రాయితీ కందిపప్పు పంపిణీ నిలిచిపోయింది. రెండు నెలలుగా పంచదార ఇవ్వడం లేదు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆగస్టు నుంచి బియ్యం, కందిపప్పు, పంచదార సరుకులను అందించాలని నిర్ణయించినా టెండర్ల ప్రక్రియలో జాప్యం కావడంతో, ఈసారి అన్ని సరుకులూ అందే పరిస్థితి కనిపించడం లేదు. అర్బన్‌లో బియ్యంతో పాటు రాగులు, గోధుమపిండి ఇవ్వనున్నారు. రూరల్ ప్రాంతాల్లో కేవలం బియ్యం మాత్రమే అందించనున్నారు. సరుకుల పంపిణీపై జిల్లా పౌర సరఫరాల సంస్థ అధికారులకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.
.శ్రీకాకుళం జిల్లాలో 1603 రేషన్ దుకాణాలు ఉన్నాయి. వీటి పరిధిలో 6,71,803 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటిలో 19,77,698 మంది లబ్ధిదారులు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలోని 422 మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ (ఎండియు) వాహనాల ద్వారా ఈనెలలో సరుకులను అందించనున్నారు. బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార అందిస్తారని అంతా భావించినా జిల్లాకు సరుకులు రాలేదు. పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులు సరుకుల కోసం టెండర్లను ఆహ్వానించినా, సకాలంలో పూర్తి కాలేదని తెలుస్తోంది. దీంతో ఎప్పటి మాదిరిగానే కార్డులో ఎంతమంది సభ్యులు ఉంటే అన్ని కేజీల బియ్యం ఇవ్వనున్నారు. అర్బన్ ప్రాంతంలో మాత్రం బియ్యంతో పాటు రాగులు, గోధుమపిండి ఇవ్వనున్నారు. ప్రతి కార్డుపై కేజీ చొప్పున అందించనున్నారు. అదేవిధంగా బియ్యం మూడు కేజీలను తగ్గించి దాని స్థానంలో అంతే మొత్తంలో రాగులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
కందిపప్పు ధరలు పైపైకి
ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) ద్వారా పంపిణీ నిలిచిపోవడంతో కందిపప్పు ధరలు క్రమేణా పెరుగుతున్నాయి. ఎండియు వాహనాల ద్వారా గతంలో రాయితీపై ప్రభుత్వం కేజీ రూ.67కే కందిపప్పు అందించేది. ఇప్పుడు పంపిణీ చేయకపోవడంతో మార్కెట్‌లో కందిపప్పు ధర అంతకంతకూ పెరగుతోంది. ప్రస్తుతం కందిపప్పు ధర రూ.180 నుంచి రూ.200కు చేరింది. పంచదార పరిస్థితి అలానే ఉంది. రాయితీపై అరకేజీ పంచదార రూ.17కే పేదలకు దక్కేది. ఇప్పుడు మార్కెట్‌లో రూ.24 వరకు పెరిగింది.
ఎండియుల కొనసాగింపుపై సందిగ్ధత
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేసేందుకు మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ (ఎండియు) వ్యవస్థను 2021, ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. రేషన్ డోర్ డెలివరీ కోసం ప్రభుత్వం రూ.5.83 లక్షల విలువైన వాహనాలను అందించింది. వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసేందుకు జిల్లాలో 422 మంది ఆపరేట్లను నియమించారు. డోర్ డెలివరీ చేసే ఆపరేటర్‌కు తొలుత ప్రభుత్వం రూ.16 వేలు వేతనంగా నిర్ణయించింది. వాహనాలకు డ్రైవర్లుగా మాత్రమే పనిచేయాల్సి ఉంటుందని చెప్పిన ప్రభుత్వం తర్వాత వారితో తూకం, ఈ-పాస్ మిషన్‌లో వివరాలు నమోదు తదితర పనులు అప్పగించింది. దీంతో తమకు ఇస్తున్న వేతనం చాలదని అప్పట్లో వారు ఆందోళనకు దిగడంతో వేతనాన్ని రూ.21వేలకు పెంచింది. రేషన్ వాహనానికి సమకూర్చిన రుణానికి వాయిదా సొమ్ముగా రూ.మూడు వేలను జమ చేసుకుంటోంది. రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో ఈ వ్యవస్థను రద్దు చేసి, పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల ద్వారా సరుకులను అందిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికిప్పుడే దీన్ని రద్దు చేసే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఎండియు వ్యవస్థ నిర్వహణకు గతంలోనే బడ్జెట్ కేటాయింపులు చేసిన నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగవచ్చని అంచనా వేస్తున్నారు.