ఫైళ్లు మాయం చేసేందుకు యత్నం!

Jun 11,2024 03:15 #ACB cases, #destroy, #files
  • వాసుదేవరెడ్డిపై కొనసాగుతున్న విచారణ
  • ఫైళ్లు, హార్డ్‌ డిస్కులు స్వాధీనం
  • అప్రూవర్‌గా మారతారనే ప్రచారం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎక్సైజ్‌ శాఖలో గతంలో ఉన్న పాలసీకి సంబంధించి జరిగిన అవకతవకల్లో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్నికల అనంతరం కీలక ఫైళ్లను తన సొంత ఇంటికి మార్చుకున్నారని వచ్చిన ఆరోపణలపై విచారించిన సిఐడి అధికారులు హైదరాబాద్‌లో అతని నివాసంలో కొన్ని కీలకఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఫైళ్లు తరలించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతోపాటు అతని ఇంట్లో, ల్యాప్‌ట్యాప్‌కు సంబంధించిన కీలక డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే వాటికి సంబంధించిన డేటాను క్రోఢకీరించి నివేదికను రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో రూ.1000 ఉన్న మద్యాన్ని ఇక్కడ రూ.1600కు విక్రయించారని, రూ.650 ఉన్న మద్యాన్ని రూ.1400కు విక్రయించారని ఇటీవల వివరాలను బయటపెట్టారు. వాటితోపాటు డిజిటల్‌ లావాదేవీలను అంగీకరించలేదు. బయట బేవరేజస్‌ కార్పొరేషన్‌ లావాదేవీలను చూపించి తనఖా పెట్టి అప్పులు తీసుకున్నారు. వాటికి సంబంధించిన ఫైళ్లు వాసుదేవరెడ్డి నివాసంలో దొరికినట్లు తెలిసింది. వీటి ద్వారా ఎవరెవరికి ఎంత లబ్ధి కలిగింది, ఎంతకు కొన్నారు? ఎంతకు అమ్మారు? మిగులు ఎంత? దాని లాభాలు ఏ ఖాతాల్లో వేశారు? అనే వివరాలను సిఐడి అధికారులు తెలుసుకున్నారు. దీనిపై తొలుత ఆయన స్పందించేందుకు నిరాకరించినా కేసు వివరాలు, మరింత ఇబ్బందులు పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక వివరాలను అధికారులకు ఇచ్చారని సమాచారం. దీంతోపాటు అధికారులు అప్రూవర్‌గా మారితే ఎసిబి కేసుల్లోనూ, సిఐడి కేసుల్లోనూ వారిని సాక్షిగా పరిగణిస్తారే తప్ప నిందితుడిగా చూడరు. ఈ నేపథ్యంలో అతను అప్రూవర్‌గా మారతారనే ప్రచారం జరిగింది.

➡️