అరటి రైతు దిగాలు

  • నిరాశాజనకంగా ధర
  • దసరా, దీపావళి పైనే ఆశలు

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : అరటి రైతులకు సీజన్‌లోనూ ఊరట లభించడం లేదు. ఓ వైపు ముహూర్తాలు, మరోవైపు దసరా నవరాత్రులు ప్రారంభం కానున్నప్పటికీ ధరలు మాత్రం ఆశాజనకంగా లేవు. గత సీజన్‌ కంటే ఈ ఏడాది ఒక్కో గెలపై రూ.100 నుంచి రూ.200 వరకూ ధర పతనమైంది. పండుగ వేళ మంచి ధర పలుకుతుంందనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. గతేడాది ఇదే సీజన్‌లో కర్పూర రకం అరటి గెల రూ.300 నుంచి రూ.400 వరకూ ధర పలికింది. ప్రస్తుతం రూ.110 నుంచి రూ.270 మించడం లేదు. చక్రకేళి రకం గెల గత సీజన్‌లో రూ.550 కాగా, ప్రస్తుతం రూ.280కు పతనమైంది. అమృతపాణి రకం కూడా ఇదే బాటలో పయనిస్తోంది. గతేడాది గెల రూ.350 ఉండగా, ప్రస్తుతం రూ.250కు దిగజారింది. మిగిలిన రకాల అరటి పండ్ల ధరలూ ఇలాగే పతమయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరిలో ఎక్కువగా తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలో అరటి సాగు చేస్తున్నారు. కాకినాడ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అరటి సాగు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 45 వేల ఎకరాల్లో అరటి సాగవుతోంది. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రావులపాలెం, ఆత్రేయపురం, కొత్తపేట, అంబాజీపేట మండలాల్లో విస్తారంగా సాగులో ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో కొవ్వూరు, పెరవలి, ఉండ్రాజవరం, తాళ్లపూడి మండలాల్లోనూ అరటిని అధికంగా సాగు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 28 వేల మంది అరటిపై ఆధారపడి జీవిస్తున్నారు. రావులపాలెం మార్కెట్‌ నుంచి ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కోల్‌కత్తా తదితర రాష్ట్రాలకు అరటి పండ్లు ఎగుమతి చేస్తున్నారు. రావులపాలెం, ఆత్రేయపురం అరటికి మంచి డిమాండ్‌ ఉంటుంది. సైజు, నాణ్యతతో పాటు రుచి, సువాసనను ఇక్కడి అరటి పండ్లు కలిగి ఉంటాయి. ప్రధానంగా కర్పూరం, తెల్ల చక్రకేళి, బుసావళి, ఎర్ర చక్రకేళి, బొంత తదితర రకాల అరటిని ఇక్కడ రైతులు సాగు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎనిమిది లక్షల టన్నుల వరకూ దిగుబడి వస్తుంది. అరటి సాగుకు ఎకరానికి రూ.90 వేల వరకూ పెట్టుబడి అవుతోంది.

గిట్టుబాటు కావడం లేదు :కరుటూరు జనార్థనరావు, అరటి రైతు, తీపర్రు, పెరవలి మండలం

గత 20 సంవత్సరాలుగా అరటి సాగు చేస్తున్నాను. ఈ సీజన్‌లో కర్పూర రకం అరటి సాగు చేశాను. పది టన్నులు రూ.95 వేలకు విక్రయించాను. ఈ లెక్కన గెలకు రూ.150 ధర కూడా పలకట్లేదు. మార్కెట్లో రోజుకో ధర ఉంటోంది. ధర ఉందని అధిక సంఖ్యలో గెలలు దించితే ఒకేసారి ధర పడిపోతోంది. అరటి నిల్వ చేసుకునే సౌకర్యాలు లేకపోవడంతో వ్యాపారులు అడిగిన ధరకు విక్రయించక తప్పడం లేదు. సీజన్‌లో అయినా గెలకు రూ.300 వస్తేగానీ గిట్టుబాటు కాదు.

➡️