అణు చట్టాల్లో మార్పులు?

  • అమెరికా సంస్థల కోసం
  • మోడీ సర్కారు అడ్డగోలు చర్యలు
  • విదేశీ కంపెనీలకు అవకాశమిస్తూ పార్లమెంటు సమావేశాల్లో సవరణలకు చర్యలు

న్యూఢిల్లీ : భారత్‌లోని అణు బాధ్యత చట్టాల్లో మోడీ సర్కారు మార్పులు తీసుకురానున్నట్టు తెలుస్తున్నది. విదేశీ సంస్థలను ఆకర్షించటం కోసం వీటిని సులభతరం చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వంలోని కొన్ని విశ్వసనీయ వర్గాలు ఈ విషయాన్ని తెలిపాయి. ఎక్విప్‌మెంట్‌ సప్లయర్స్‌(పరికరాల సరఫరాదారులు)పై ప్రమాద సంబంధిత జరిమానాలను పరిమితం చేయటానికి భారత్‌ తన అణు బాధ్యత చట్టాలను సులభతరం చేయాలని యోచిస్తున్నదని వివరించాయి. ముఖ్యంగా, యూఎస్‌ సంస్థలను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా మోడీ సర్కారు ఈ మార్పులు తీసుకురావటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అమెరికా అణు సంస్థలను ఆకర్షించటం ద్వారా 2047 నాటికి అణు విద్యుత్‌ సామర్థ్యాన్ని 12 రెట్లు పెంచి 100 గిగావాట్స్‌ (జీడబ్ల్యూ)కి చేరుకోవటాన్ని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్నది. మోడీ సర్కారు అటువైపుగా ప్రతిపాదనలను చేస్తున్నట్టు తెలిసింది.

చట్టంలోని కీలక నిబంధన తొలగింపు

ఇందులో భాగంగా.. అణుశక్తి విభాగం రూపొందించిన ముసాయిదా చట్టం.. పౌర అణు బాధ్యత నష్ట చట్టం, 2010లోని కీలకమైన నిబంధనను తొలగిస్తుందనీ, ఇది సరఫరాదారులను ప్రమాదాలకు అపరిమిత బాధ్యతకు గురి చేస్తున్నదని సంబంధిత వర్గాలు వివరించాయి. అయితే, ఈ విషయంలో భారత అణుశక్తి విభాగం, ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ), ఆర్థిక మంత్రిత్వ శాఖ లు ఇప్పటి వరకు స్పందించలేదు. భారత్‌కు స్వచ్ఛమమైన, అత్యవసర అణుశక్తి అవసరమని డెలాయిట్‌ దక్షిణాసియా చీఫ్‌ గ్రోత్‌ ఆఫీసర్‌ దేబాసిశ్‌ మిశ్రా తెలిపారు. బాధ్యత పరిమితి అణు రియాక్టర్ల సరఫరాదారుల ప్రధాన ఆందోళనను తొలగిస్తుందని చెప్పారు. ఈ మార్పులు ప్రధానంగా అపరిమిత ప్రమాదాల కారణంతో ఏండ్లుగా దూరంగా ఉన్న జనరల్‌ ఎలక్ట్రిక్‌ కో, వెస్టింగ్‌ హౌస్‌ ఎలక్ట్రిక్‌ కో వంటి యూఎస్‌ సంస్థల ఆందోళనలను తగ్గిస్తాయని భారత ప్రభుత్వం ఆశిస్తున్నది.

అమెరికాతో వాణిజ్యం కోసం..

అమెరికాతో వాణిజ్యం కోసం భారత్‌ ఈ చట్టం ఆమోదాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. గతేడాది 191 బిలియన్‌ డాలర్ల(రూ.16.30 లక్షల కోట్లకు పైగా) నుంచి 2030 నాటికి 500 బిలియన్‌ డాలర్ల(రూ.42.69 లక్షల కోట్లకు పైగా)కు ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచే లక్ష్యంతో భారత్‌, యూఎస్‌ మధ్య ఈ ఏడాది వాణిజ్య ఒప్పంద చర్చల కోసం సవరించిన చట్టం ఆమోదం చాలా కీలకమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ఏడాది జులైలో ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలకు ఆమోదం లభిస్తుందని మోడీ సర్కారు విశ్వసిస్తున్నట్టు తెలిసింది.

ప్రతిపాదిత సవరణల ప్రకారం.. ప్రమాదం జరిగినపుడు సరఫరాదారు నుంచి పరిహారం పొందే ఆపరేటర్‌ హక్కు.. ఒప్పందం విలువకు పరిమితం చేయబడుతుంది. ఇది ఒప్పందంలో పేర్కొనవల్సిన కాలానికి కూడా లోబడి ఉంటుంది. అయితే, ఒక ఆపరేటర్‌ సరఫరాదారుల నుంచి కోరే పరిహారం మొత్తానికి, విక్రేతను ఎంతకాలం వరకు జవాబుదారీగా ఉంచవచ్చనే దానిపై చట్టం పరిమితిని నిర్వచించలేదు.

ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన పారిశ్రామిక ప్రమాదమైన భోపాల్‌ గ్యాస్‌ విపత్తు నుంచి భారతదేశ అణు బాధ్యత చట్టం, 2010 ఉద్భవించింది. భోపాల్‌ గ్యాస్‌ విపత్తు ఘటనలో యూఎస్‌ మల్టీనేషనల్‌ యూనియన్‌ కార్బైడ్‌ కార్ప్‌ యాజమాన్యంలోని కర్మాగారంలో 5000 మందికి పైగా మరణించారు. యూనియన్‌ కార్బైడ్‌ 1989లో కోర్టు వెలుపల 470 మిలియన్‌ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించటానికి అంగీకరించింది. ప్రస్తుత అణుబాధ్యత చట్టం విదేశీ కంపెనీలను మార్కెట్‌ నుంచి సమర్థవంతంగా మూసివేసింది. అలాగే, 2008 అణు సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నప్పటి నుంచి యూఎస్‌-భారత్‌ సంబంధాలను దెబ్బతీసింది.

‘అణు’పెట్టుబడులపై కేంద్రంతో భారతీయ కంపెనీల చర్చలు

పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ నేపథ్యంలో భారత్‌ అణుశక్తిపై ప్రధానంగా దృష్టి సారించిందని నిపుణులు చెప్తున్నారు. ఇందులో భాగంగా ప్రయివేటు భారతీయ కంపెనీలు అలాంటి ప్లాంట్లను నిర్మించటానికి అనుమతించాలని ప్రతిపాదించింది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, టాటాపవర్‌, అదానీ పవర్‌, వేదాంత లిమిటెడ్‌ వంటి భారతీయ కంపెనీలు ఈ రంగంలో దాదాపు 5.14 బిలియన్‌ డాలర్ల(రూ.43,888 కోట్లకు పైగా) చొప్పున పెట్టుబడి పెట్టేందుకు ఇప్పటికే చర్చలు జరపటం గమనార్హం.

➡️