ఇన్‌ఛార్జీల మార్పులు బదిలీలు – వ్యతిరేకత తప్పించుకునేందుకా !

  • తెలంగాణా తీర్పుతో ముందు జాగ్రత్త

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నియోజకవర్గ ఇన్‌ఛార్జుల మార్పు రాష్ట్ర రాజకీయాల్లో దుమారాన్ని రేపింది. ఇది ఇంతటితో ఆగదని కనీసం 50 నుండి 60 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు జరుగుతాయనే చర్చ ఇప్పుడున్న వారిలో అలజడి రేపింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజా వ్యతిరేకత నుండి బయటపడాలనే ఉద్దేశంతోనే వైసిపి ఇలాంటి నిర్ణయం తీసుకుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కొద్దిమంది నిర్వాకం వల్ల పార్టీకి నష్టం వచ్చిందని, తాము మంచిపాలన చేస్తున్నామనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మార్పులు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ వ్యతిరేకత మూటగట్టుకున్న నేపథ్యం, అక్కడ ఎమ్మెల్యేలను మార్చిన కొద్ది స్థానాల్లో మంచి ఫలితాలు రావడాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ తరుపున అక్కడ సర్వేలు నిర్వహించి నిరంతరం ఎన్నికల వ్యవహారాన్ని నడిపిన ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే ఒకరు ఈ మార్పులు చేర్పుల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలను మార్చిన స్థానాల్లో అభ్యర్థులు విజయం సాధించారని, ఇక్కడ కూడా అదే వ్యూహం అమలు చేసి ప్రజల్లో వ్యతిరేకత లేకుండా చేసుకోవాలని వైసిపి అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. మార్చిన వారందరూ ఓడిపోయేవారు కాదని, సామాజిక సమీకరణల్లో భాగంగా సిఎం ఈ నిర్ణయం తీసుకున్నారని సీనియర్‌ నాయకులు వై.వి.సుబ్బారెడ్డి ప్రకటించారు. అదే నిజమైతే తొలిసారి జరిగిన మార్పుల్లో ఎక్కువ సీట్లు ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గాలే ఉన్నాయని, ఇద్దరు మంత్రులూ వారేనని, ఇది సామాజిక సమీకరణ ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. వ్యక్తులను మార్చినంత మాత్రాన వ్యతిరేకత పోతుందా అనే ప్రశ్న వస్తోంది. దీనిపై బొత్స లాంటి సీనియర్‌ మంత్రులు మాట్లాడుతూ సిఎం గత సమీక్షల సమయంలో మార్పుల గురించి ప్రస్తావించారని, అదే ఇప్పుడు చేశారని చెబుతున్నారు. ఎంత ప్రక్షాళన చేసినా ఒకేసారి ముగ్గురు మంత్రులను మార్చడంపైనే చర్చంతా నడుస్తోంది. ఒకటీ రెండు రోజుల్లో కృష్ణాజిల్లాతోపాటు రెండు మూడు ఉమ్మడి జిల్లాల్లో మార్పులు చేయనున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ సిఎం ఇప్పటికే మార్పులపై స్పష్టమైన నిర్ణయానికి వచ్చారనీ ఎక్కడ, ఎవరిని నిర్ణయిస్తే వారు పోటీచేస్తారని ప్రకటించారు. ఎన్నికలకు ఆరునెలల ముందు నుండే అభ్యర్థులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉండటంతో సిఎం వేగంగా నిర్ణయం తీసుకున్నారనీ చెబుతున్నారు.

వాళ్లు ఎలా గెలుస్తారు ?

సామాజిక సమీకరణాల్లో చూసినా మార్పులు చేర్పులు జరిగిన ముగ్గురు మంత్రుల్లో ఒకరు బిసి, ఇద్దరు ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గాల నుండి గెలిచినవారే కావడం విశేషం. వీటితోపాటు మరో రెండు ఎస్‌సి నియోజకవర్గాలూ ఉన్నాయి. ఇప్పటికే అసంతృప్తితోనూ, సీట్లు ఆశిస్తున్న ద్వితీయశ్రేణి వైసిపి నాయకుల్లో దీనిపై తీవ్ర మిగతా 7లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది, మంత్రిగా ఉంటూనే చిలకలూరిపేటలో వ్యతిరేకత మూటగట్టుకున్న విడదల రజనీ కీలకమైన గుంటూరులో ఎలా గెలుస్తారని ప్రశ్నిస్తున్నారు. వేమూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మేరుగ నాగార్జున, ఎర్రగొండపాలెం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ ఆయా నియోజకవర్గాలకు పనికిరారు అనుకంటే పక్క నియోజకవర్గాల్లో ఎలా గెలుపు గుర్రాలవుతారని అడుగుతున్నారు. రేపల్లె నియోజకవర్గంలో అయితే మార్పు మరింత చర్చనీయాంశమైంది. అక్కడ జగన్‌ కటుంబానికి నమ్మినబంటుగా అనేక కేసుల్లో ఇరుక్కున్న మోపిదేవి వెంకట రమణారావు మార్పును అక్కడి నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది.

➡️