సుందరయ్యనగర్‌ నుంచి సీతానగరం వర్కుషాప్‌ వరకూ .. కనెక్టివిటీకి క్లియర్‌ లైన్‌

  • ఎలివేటెడ్‌ కారిడార్‌కు అనుమతి మంజూరు
  • ప్లానింగు ఇచ్చిన ప్రణాళికా విభాగం
  • మణిపాల్‌ వద్ద జాతీయ రహదారిపై ట్రంపెట్‌ సర్కిల్‌
  • పేదల ఇళ్లకూ ఇబ్బందే
  • అతి త్వరలో పనులు ప్రారంభం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాజధాని అమరావతికి ఆయువు పట్టయిన సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును 16వ నెంబరు జాతీయ రహదారికి కలిపేందుకు మార్గం సుగమం అయింది. ఎలివేటెడ్‌ కారిడార్‌ రూపంలో దీన్ని నిర్మించనున్నారని, దీనికోసం ఎలైన్‌మెంట్‌ కూడా పూర్తి చేశారని, 2019 మే 17న ప్రజాశక్తి తొలిసారి బయటపెట్టింది. దీనిపై 2018 డిసెంబర్లో జరిగిన 19వ బోర్డు సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై అప్పట్లో ప్రజల నుండి పెద్దయెత్తున విమర్శలు, ఆందోళనలు రావడంతో కొంత వెనక్కు తగ్గింది. విషయం బయటకు పొక్కిందనే పేరుతో అప్పట్లో సిఆర్‌డిఎలో పనిచేసే ఓ సిఇని కూడా మార్చేశారు. అనంతరం మార్కింగ్‌ ఇచ్చినా కొంత వెనక్కు తగ్గారు. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎలివేటెడ్‌ కారిడార్‌ వేళ్లే మార్గం మధ్యలో అక్కడక్కడ నిర్మాణాలకూ అనుమతులిచ్చింది. దీంతో వైసిపికి చెందిన ఓ ఎమ్మెల్యే అక్కడ పెద్దయెత్తున అపార్టుమెంట్లు నిర్మించారు. కారిడార్‌ పక్కగా ఈ నిర్మాణాలున్నాయి. అప్పట్లో దీనిపై విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు. రెండు రోజుల క్రితం ప్లానింగ్‌ అధికారులు సుందరయ్యనగర్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. గతంలో ఉన్న ఎలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. కొత్తగా వచ్చిన ప్లానులో మణిపాల్‌ ఆస్పత్రి స్థలంలోకి మార్కింగ్‌ ఇవ్వడంతోపాటు కొన్ని నివాసాలూ అడ్డు వస్తాయని తేల్చారు. అయితే ముందుగానే వ్యవహారం బయటకు వస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో గుమ్మనంగా ప్లానింగు, మ్యాపింగు చక్కబెట్టేశారు. అతి త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. మణిపాల్‌ ఆస్పత్రి వద్ద ట్రంపెట్‌ సర్కిల్‌ నిర్మించనున్నారు. ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ (ఫ్లై ఓవర్‌) కోసం 2019లోనే రూ.1,181 కోట్లు ఖర్చవుతాయని అంచనాలు రూపొందించారు. ధరల పెరుగుదల (కాస్ట్‌ ఎస్కలేషన్‌)తో ప్రస్తుతం రూ.1,500 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇటీవల గుట్టుచప్పుడు కాకుండా మణిపాల్‌ ఆస్పత్రి నుండి రైల్వే ట్రాక్‌, శీతానగరం వరకూ అధునాతన సాంకేతిక పద్ధతుల్లో భూసార పరీక్షలు నిర్వహించారు.

పక్కనే ఉన్న ఇళ్ల పరిస్థితి ఏమిటి ?
ప్రస్తుతం ఎలివేటెడ్‌ కారిడార్‌ వస్తున్న ప్రాంతం సుందరయ్యనగర్‌ నుంచి ఎన్‌టిఆర్‌ కట్ట, సీతానగరం, వర్కుషాప్‌ కట్టరోడ్డు ఉన్నాయి. అక్కడ పేదలు ఎక్కువ మంది నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తామని, ఇళ్లకు ఇబ్బంది లేదని చెబుతున్నా పనులు జరిగే సమయంలో కారిడార్‌కూ అటూ ఇటు 60 అడుగుల వరకూ ఇళ్లను ఎత్తేయనున్నారు. నిబంధనల ప్రకారం జాతీయ రహదారిలో కలిపే రోడ్లకు కచ్ఛితంగా ఫీడర్‌ యాక్సెస్‌ ఉండాల్సి ఉంటుంది. ఇది ప్రత్యామ్నాయ రహదారిగానూ ఉండాలని ప్లానింగు అధికారులు చెబుతున్నారు. అలాంటి ఫీడర్‌ లేకపోతే జాతీయ రహదారుల విభాగం వారి రోడ్లను స్థానిక రోడ్లను కలిపేందుకు అనుమతి ఇవ్వదు. ఈ నేపథ్యంలో కారిడార్‌ నిర్మాణం సమయంలో బయటకు చెప్పకపోయినా అంతో ఇంతో సుందరయ్యనగర్‌ ప్రాంత నివాసితులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.

➡️