కోకో రైతు కుదేలు

Mar 17,2025 06:23 #Farmers Protest

గతేడాది కిలో వెయ్యి…ప్రస్తుతం రూ.600
సిండికేటైన కంపెనీలు!
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ఉన్నా దక్కని ధర
ప్రజాశక్తి-ఏలూరు ప్రతినిధి : కోకో పంటకు ధర లేక రైతులు కుదేలవుతున్నారు. గతేడాది కిలో వెయ్యి రూపాయలు పలకగా ప్రస్తుతం రూ.600కు పడిపోయింది. కోకో గింజలు కొనుగోలు చేసే కంపెనీలు సిండికేటై రైతులకు సరైన ధర దక్కకుండా చేస్తున్నాయి. తమకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర అందేలా చూడాలని రైతులు రోడ్డెక్కి గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గతేడాది పలికిన ధరకు, ప్రస్తుత ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరిలో 50 వేల ఎకరాల్లో కోకోను సాగు చేశారు. కోకో గింజలను చాక్లెట్‌, కేకులు వంటివాటి తయారీలో అధికంగా వినియోగిస్తున్నారు. కొబ్బరి, పామాయిల్‌ తోటల్లో అంతర్‌ పంటగా కోకోను సాగు చేస్తున్నారు. ఎకరా కొబ్బరి తోటలో 180 నుంచి 240 మొక్కలు, పామాయిల్‌ తోటలో 150 మొక్కలు వరకూ నాటుతారు. ఒక ఎకరాలో సాగుకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకూ పెట్టుబడి అవుతోంది. ఎకరాకు రెండున్నర క్వింటాళ్ల నుంచి నాలుగు క్వింటాళ్ల వరకూ దిగుబడి వస్తోంది. జనవరి నుంచి జూన్‌ వరకూ కోకో సీజన్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కోకో సీజన్‌ ముమ్మరంగా సాగుతోంది. పాత, కొత్త పంట మొత్తం వెయ్యి టన్నుల వరకూ రైతులు వద్ద ఉన్నట్లు సమాచారం.
గతేడాది అంతర్జాతీయ మార్కెట్‌ ధరకు అనుగుణంగా కిలో కోకో గింజలకు వెయ్యి రూపాయలు ధర పలికింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో కిలో ధర రూ.900 ఉంది. రైతుల నుంచి రూ.600కు మించి కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. అంతరాత్జీయ మార్కెట్‌ ధరతో పోలిస్తే రైతులు కిలోకు దాదాపు రూ.300 వరకూ నష్టపోతున్నారు. ఎకరాకు దాదాపు రూ. 70,000 నష్టపోతున్నారు. దాదాపు 20 కంపెనీలు, ట్రేడర్స్‌ రైతుల నుంచి కోకో గింజలను సేకరిస్తున్నారు. కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి రైతులకు ధర దక్కకుండా చేస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం కోకో పంటకు ధర అమలు చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లా మొదలుకుని రాష్ట్ర స్థాయి అధికారుల వరకూ అందరినీ కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఏ ఒక్క అధికారి వారి మొరు ఆలకించలేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని కంపెనీల సిండికేట్‌ను అరికట్టి అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ధర అందేలా చర్యలు తీసుకోవాలని కోకో రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

 


అంతర్జాతీయ మార్కెట్‌ ప్రకారం ధర ఇవ్వాలి
నేను, మా అన్నయ్య మొత్తం 36 ఎకరాల్లో కోకో సాగు చేశాం. అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో కోకో గింజల ధర రూ.900 వరకూ ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం ఈ ధరకు కొనుగోలు చేయడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌ ధర ప్రకారం కొనుగోలు చేయాలి.
– పానుగంటి అచ్యుత రామయ్య, లకీëపురం, ఏలూరు మండలం

ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి
30 ఎకరాల్లో కోకో సాగు చేశాను. కంపెనీలు సిండికేటై తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకొని అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలి.
– బి.రామకృష్ణ, బాపిరాజుగూడెం, పెదవేగి మండలం

ధరల అమలుకు కమిటీలు
ధరల అమలుకు ప్రభుత్వం కమిటీలు వేసింది. నాణ్యత ఉన్న గింజల కొనుగోలులో ఇబ్బంది లేదు. గతేడాది పంట రైతుల వద్ద 30 శాతం వరకూ ఉంది. ప్రస్తుతం కిలో కోకో గింజలు ధర రూ.600 వరకూ ఉంది.
– ఎస్‌. రామ్మోహన్‌, ఉద్యాన శాఖ అధికారి, ఏలూరు జిల్లా

➡️