- ఒక్కో నిర్వాసిత కుటుంబానికి రూ.4 లక్షలకుపైగా నష్టం
- పునరావాస కాలనీలు త్వరితగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి
ప్రజాశక్తి- పశ్చిమ డెస్క్, కుక్కునూరు రూరల్ : ‘పోలవరం’లో నిండా మునుగుతున్నాం. నాడు భూముల పరిహారం జమలో పలు కోతలు పెట్టారు. తర్వాత పునరావాస ప్యాకేజీ ఇచ్చేందుకు 2016లో సర్వే నిర్వహించారు. కుటుంబానికి గిరిజనులకు రూ.6.86 లక్షలు, గిరిజనేతరులకు రూ.6.36 లక్షలుగా ప్యాకేజీ నిర్ణయించారు. 2017 జూన్ 30వ తేదీ కటాఫ్ తేదీగా నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు ప్యాకేజీ వర్తింపజేస్తామని ప్రకటించారు. నాటి నుంచి నేటి వరకూ ప్యాకేజీ సొమ్ము కోసం ఎదురుచూడగా నేడు ఖాతాల్లో పడుతున్నాయి. సంతోషం లేదుకదా నిర్వేదమే మిగిలింది’.. ఇదీ ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని నిర్వాసిత కుటుంబాల ఆవేదన. ప్యాకేజీ నిర్ణయించి ఏడున్నరేళ్లయిందని, నాడు నిర్ణయించిన ప్యాకేజీనే ఇప్పుడు ఇవ్వడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. నాటి ధరలు, జీవన ప్రమాణాలు తదితర అంశాల ఆధారంగా పునరావాస ప్యాకేజీ నిర్ణయించినట్లు నాడు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం ప్రకటించింది. పరిహారం పెంచాలని, యువతీ యువకులకు ప్యాకేజీ అందజేతకు కటాఫ్ తేదీ మార్చాలని నిర్వాసితులు వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. ఈలోపు ఎన్నికలు రావడంతో వైసిపి అధినేత జగన్ తాను అధికారంలోకొస్తే రూ.పది లక్షలు ప్యాకేజీ ఇస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పోలవరం ముంపు మండలాల పరిధిలో వైసిపి ఎంఎల్‌ఎలే గెలుపొందారు. జగన్ నాటి నుంచి అధికారం కోల్పోయే వరకూ రూ.పది లక్షల ప్యాకేజీ అమలు చేయలేదు ఈ క్రమంలో మళ్లీ టిడిపి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. గత టిడిపి ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన ఏడున్నరేళ్ల తర్వాత ప్యాకేజీ సొమ్ము వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురయ్యే గ్రామాల్లోని కుటుంబాలకు శుక్రవారం నుంచి పునరావాస ప్యాకేజీ సొమ్ము జమవుతోంది. కుక్కునూరు మండలంలో బోనగిరి, చీరవల్లి, దామరచర్ల, గొమ్ముగూడెం, గంపనపెల్లి, కివ్వాక, కుక్కునూరు, రామచంద్రపురం సీతారామపురం మొత్తం ఎనిమిది గ్రామాలు, వేలేరుపాడు మండలంలో రుద్రంకోట, తాట్కూరుగొమ్ము, వేలేరుపాడు, రేపాకగొమ్మి, కన్నాయిగుట్ట, శ్రీరామపురం, పూచిగొంది, నాళ్లవరం కాలనీ, నాళ్లవరం, నాగులగూడెం, కొయిదా, కట్కూరు, జగన్నాథపురం, చిగురుమామిడి, బుర్రెడ్డిగూడెం మొత్తం 17 గ్రామాలు ఈ కాంటూరు పరిధిలో ఉన్నాయి. మొత్తంగా రెండు మండలాల్లో ఆరు వేలకుపైగా కుటుంబాలకు ప్యాకేజీ సొమ్ము జమ కావాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యాం పూర్తి కావడంతో గోదావరికి చిన్నపాటి వరదొచ్చినా కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో చాలా గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఎట్టకేలకు ఏడున్నరేళ్ల తర్వాత పాత ప్యాకేజీ నిధులే జమవుతున్నాయి. అప్పటి నుంచి కనీసం బ్యాంకు వడ్డీ కింద లెక్కగట్టినా సుమారు రూ.నాలుగు లక్షలకుపైగానే అంటే తమకు కుటుంబానికి రూ.11 లక్షల వరకూ రావాల్సి ఉందని వారు చెప్తున్నారు. పాత ప్యాకేజీతోనే సరిపెట్టడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. ఈ కాలంలో తరచూ వరదలు రావడంతో పనులకు వెళ్లలేక, అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొచ్చామని, కనీసం ప్యాకేజీ కింద కుటుంబానికి రూ.పది లక్షలు ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీనివల్ల సకాలంలో ప్యాకేజీ ఇవ్వకపోవడం వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చటం తప్ప, అదనంగా తమకు ఇచ్చేదేమీ ఉండదని వారు అంటున్నారు. యువతకు ప్యాకేజీకి 18 ఏళ్లు వయస్సు నిండి ఉండాలనే కటాఫ్ తేదీ 2024 డిసెంబర్ 31గా మార్చాలని కోరుతున్నారు. తమకు పునరావాస ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు.
మండలం యూనిట్‌గా పరిహారం ఇస్తే బాగుండేది : -రావి శ్రీనివాసరావు, కుక్కునూరు ఎ-బ్లాక్ నిర్వాసితుడు
ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పునరావాస పరిహారం ఎట్టకేలకు బ్యాంకు ఖాతాలో జమైంది. ఏటా వచ్చే గోదావరి వరదలకు కుక్కునూరు గ్రామం మొత్తం ముంపునకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మండలం మొత్తం యూనిట్‌గా తీసుకుని పరిహారం ఇస్తే సంతోషంగా ఉంటుంది. ప్రభుత్వం స్పందించి అందరికీ న్యాయం చేయాలి.
పునరావాస కాలనీల్లో ఉపాధి కల్పించాలి : షేక్ గంగ, కుక్కునూరు ఎ-బ్లాక్ నిర్వాసితురాలు
ఏటా వచ్చే గోదావరి వరదలకు మా ఇల్లు ముంపునకు గురవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. సామాన్లు సర్దుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవాళ్లం. మాకు ఇచ్చే పునరావాస కాలనీలో ఉపాధి కల్పించి న్యాయం చేయాలి.