పరిహారం.. పరిహాసం !

Feb 13,2024 11:08 #special story
  • రైతులకు అందని మిచౌంగ్‌ తుపాను పంట నష్టం
  • అన్నదాతకు అందాల్సిన నష్ట పరిహారం సుమారు రూ.41 కోట్లు
  • దాళ్వా పెట్టుబడులకు రైతుల ఇబ్బందులు

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : గడిచిన ఖరీఫ్‌లో పశ్చిమ, ఏలూరు జిల్లాలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పొగాకు, మినుము, పత్తి, వేరుశెనగ వంటి అనేక పంటలను రైతులు సాగుచేశారు. పంట చేతికొచ్చి మాసూలు ప్రారంభించిన సమయంలో ఒక్కసారిగా మిచౌంగ్‌ తుపాను విరచుకుపడి విలయతాండవం సృష్టించింది. దీంతో ఏలూరు జిల్లాలో 37,936 ఎకరాలు, పశ్చిమలో 49,495 ఎకరాలు మొత్తం 87,431 ఎకరాల్లో రైతులు పంట కోల్పోయారు. ఈ లెక్కలు కేవలం 33 శాతం పైన దెబ్బతిన్న పంటలు మాత్రమే. 30 శాతంలోపు దెబ్బతిన్న పంట ఇంకా వేలాది ఎకరాల్లో ఉన్నప్పటికీ నిబంధనల పేరుతో ప్రభుత్వం లెక్కల్లోకి తీసుకోకుండా పక్కకు పెట్టేసింది. తుపాను దెబ్బకు అత్యధికంగా వరి పంట 69,697 ఎకరాల్లో దెబ్బతింది. మినుము, పొగాకు, పత్తి పంటలు సైతం దెబ్బతిన్న పరిస్థితి ఉంది. సంక్రాంతికి ముందే పంట నష్టపరిహారం అందిస్తామంటూ సిఎం జగన్‌ ప్రకటించారు. మిచౌంగ్‌ తుపానుకు దెబ్బతిన్న పంటలకు సంబంధించి ఏలూరు జిల్లాలో రూ. 14.87 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో రూ.26.06 కోట్లు సుమారు మొత్తం రూ.41 కోట్ల వరకూ రైతులకు అందాల్సి ఉంది. సంక్రాంతి పండుగ పూర్తయ్యి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతులకు పరిహారం అందని పరిస్థితి. ఖరీఫ్‌లో ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే సమయంలో దెబ్బతిన డంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు రూ.35 వేలకు పైగా పెట్టుబడులు పెట్టిన రైతులకు చిల్లిగవ్వ చేతికందని పరిస్థితి ఏర్పడింది. రెండెకరాలు సాగుచేసిన రైతు దాదాపు రూ.70 వేలకు పైగా నష్టపోగా, ఐదెకరాలు సాగుచేసిన రైతు దాదాపు రూ.రెండు లక్షల వరకూ నష్టాన్ని చవిచూశారు. జిల్లాలో 80 శాతం సాగు కౌలు రైతులే చేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు కోలుకో లేని దెబ్బతగలింది. ఖరీఫ్‌ దెబ్బతినడంతో రైతుల కు చేతిలో చిల్లిగవ్వలేకుండా పోయింది. దీంతో దాళ్వాపెట్టుబడుల కోసం నానా ఇబ్బందులు పడు తున్నారు. పంట నష్టం అందిస్తే ఎంతోకొంత ఆస రాగా ఉంటుందని అన్నదాత కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నాడు. ప్రభుత్వం మాత్రం రైతు లను పరిహారం అందించకుండా పరిహసిస్తున్న దుస్థితి కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలుబడితే ఎన్నికలు పూర్తయ్యి కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకూ రైతులకు పంట నష్ట పరిహారం అందే అవకాశం లేకుండా పోనుంది. దీంతో నష్ట పరిహారం వెంటనే విడుదల చేసి రైతులకు అండగా నిలవాలని అన్నదాత కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పంట నష్ట పరిహారం వెంట నే విడుదల చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.

ఖరీఫ్‌ సీజన్‌లో ఏర్పడిన వర్షాభావ పరిస్థితు లతో ఏలూరు జిల్లాలో తీవ్ర కరువు ఏర్పడింది. చింతలపూడి, చాట్రాయి, కామవరపుకోట, ద్వారకాతిరుమల, బుట్టాయగూడెం వంటి అనేక మండలాల్లో రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోవడంతో పశువుల మేతగా వదిలేయాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారుల లెక్కల ప్రకారం కరువు నేపథ్యంలో దాదాపు 12 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మిగిలిన ప్రజాప్రతినిధులు దెబ్బతిన్న పంటలను పరిశీలించి పరిహారం అందేలా చేస్తామని రైతుల కు మాటిచ్చారు. జిల్లాలో ఏ ఒక్క మండలాన్నీ కరువు మండలంగా ప్రభుత్వం ప్రకటించలేదు. నిబంధనల పేరుతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. కరువుతో దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.

➡️