- పాలసీల రెక్కల చప్పుడు
- విజన్ 2047 లోగుట్టు
రాష్ట్రంలో భూములపై కార్పొరేట్ రాబందులు కన్నేశాయి. సర్కారు అండదండలతో భూములను దిగమింగడమే లక్ష్యంగా దుర్భిణీ వేసి గాలిస్తున్నాయి. ప్రభుత్వ, పోరంబోకు, ఊరుమ్ముడి, అటవీ, చివరకుఉప్పు భూములు, మడ అడవులను సైతం స్వాహా చేయడానికి సిద్ధమౌతున్నాయి. కొండలమీద గిరిజనులు, సముద్ర తీరాల్లోని మత్స్యకారులు, పల్లెసీమల్లోని వ్యవసాయదారులు, నగరాలు, పట్టణాల్లోని పేద,మధ్యతరగతి బడుగుజనం వీరంతా ఈ భూ యజ్ఞంలో సమిధలే! ఆర్థిక, పారిశ్రామిక, పర్యాటక, క్రీడలు… పేరేదైనా చివరన చేర్చే అభివృద్ధి అర్ధం ఒక్కటే! అదే .. భూములను కొల్లగొట్టడం! అదాని, అంబానీల అడుగులకు మడుగులొత్తే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ కన్నుసన్నల్లో రాష్ట్రాన్ని కార్పొరేట్ల పరం చేయడం!! నమ్మశక్యం కావడం లేదా…! అయితే రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన పాలసీల రెక్కల చప్పుడు వినండి!!
‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్ర’ …ఇది కేంద్ర ప్రభు త్వపు అడుగుజాడల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రకటించిన ‘స్వర్ణాంధ్ర విజన్ 2047’ డాక్యుమెంట్ లక్ష్యం! అయితే, ‘వెల్తీ..హెల్ల్తీ..హ్యాపీ’ ఎవరికి దక్కనున్నాయన్నదే అసలైన ప్రశ్న! విజన్ డాక్యుమెంట్‌కు అనుబంధంగా విడుదల చేసిన వివిధ పాలసీలను పరిశీలిస్తే ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి సంగతేమో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూములపైన కార్పొరేట్ల దృష్టి పడిందన్నది అర్ధమవుతుంది.వారి కన్ను పడిన ప్రతి ఎకరాన్ని కట్టబెట్టడానికి ప్రభుత్వం జీ..హుజార్ అంటున్న విషయం స్పష్టమౌతుంది! పాలసీల అమలులో భాగంగా ఐదేళ్లలో భూ పందారాన్ని పూర్తిచేస్తారు! అభివృద్ధి అంటారా… అది 2047 నాటి మాట!!
ఎంత భూమి …..?
రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు ఎంత భూమి కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం! రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, ‘ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ పాలస’ీలో ఇప్పటి వరకు ఎంత భూమి అందుబాటులో ఉందో ప్రభుత్వం వివరించింది. ‘రాష్ట్రంలోని మూడు జాతీయ పారిశ్రామిక కారిడార్లు (విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్ బెంగళూరు)కు అదనంగా 20 క్లస్టర్లలో 14,093 ఎకరాల భూమి ఇప్పటికే అందుబాటులో ఉంది.’ అని ఈ పాలసీలో ప్రభుత్వం పేర్కొంది. ‘ఇది కాకుండా మరో 30 క్లస్టర్లకోసం 1.30 లక్షల ఎకరాల భూమిని గుర్తించాం. దీనిలో 54,781 ఎకరాలు పోర్టు ఆధారిత భూమి. మిగిలిన 75,683 ఎకరాలు పోర్టులతో సంబంధం ఉన్న లోతట్టు భూములు(హింటర్‌ల్యాండ్) అని ప్రభుత్వం పేర్కొంది. ఇలా గుర్తించిన భూమిలో 44,777 ఎకరాల భూమి ఇప్పటికే ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు పాలసీలో పేర్కొన్నారు.’ ఇంతటితో కార్పొరేట్లకు భూ పందేరం ఆగిందనుకుంటే పొరపాటే! ఇవి పాక్షిక లెక్కలే! ఆ పాలసీలోనే ఇండిస్టియల్ పార్కు కోసం ప్రైవేటు వ్యక్తులు సొంతగా భూమిని సమకూర్చుకోవచ్చని పేర్కొంది. అలా సమకూర్చుకునే భూమికి అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంతో పాటు, రాయితీలను ఇస్తామని పేర్కొంది. ఇలా పైవేటు వ్యక్తులు సమకూర్చుకునే భూమికి ఎటువంటి పరిమితి పెట్టలేదు. పైగా ‘సొంతగా సమకూర్చుకోవాలి’ అని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ,సహకారాలు లభిస్తాయన్నది బహిరంగ రహస్యమే! ఇప్పటికే రాష్ట్రంలో 211 ఇండిస్టియల్ పార్కులు ఉన్నాయి. వీటిలో అధికభాగం పారిశ్రామిక కార్యక్రమాలకు దూరంగానే ఉన్నాయి. వాటికి కొత్తగా ఏర్పాటు కానున్న పార్కులు అదనం! ఇది కాకుండా, టూరిజం, క్రీడలు, మారిటైమ్ వంటి పాలసీలకు అదనంగా భూమిని సేకరించాల్సిఉంది!
తీరంలో మిగిలేదేమిటి?
పోర్టులు, పోర్టు ఆధారిత పరిశ్రమల పేరుతో ప్రకటించిన ‘మారిటైం పాలసీ’ అమలు కోసం ఎంత భూమి అవసరమౌతుందన్న విషయం కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు వద్ద 9 వేల ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. తాజాగా మరో 10 వేల ఎకరాలను సేకరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇదిగాక, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌కు 6 వేల ఎకరాలను కేటాయించనున్నారు. ఈ జిల్లాలో ఇప్పటికే, కృష్ణపట్నం పోర్టు, సెజ్‌ల పేరిట వేలాది ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించి ఉంది. ఆ భూముల్లో అధికభాగం ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. తాజాగా ప్రకటించిన మారి టైం పాలసీ ప్రకారం పోర్టునుండి 100 కి.మీల పరిధిని పోర్టు సన్నిహిత ప్రాంతం (పోర్టు ప్రాక్సిమల్ ఏరియా)గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో పోర్టు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు పేరిట కార్పొరేట్లు ఎక్కడ కోరితే అక్కడ భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. దీంతో కోస్తా జిల్లాల ప్రజానీకంపై తీవ్రస్థాయిలో ప్రభావం పడనుంది. విజయనగరం,శ్రీకాకుళం వంటి జిల్లాలు దాదాపుగా నూరుశాతం పోర్టు ప్రాక్సిమల్ ఏరియా పరిధిలోకి వస్తుండటం గమనార్హం. ఈ ప్రాంతంలో ఏర్పడే పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం రాష్ట్రంలో అమలులో ఉన్న అన్ని రకాల భూ సేకరణ, సమీకరణ విధానాలను అమలు చేస్తామని పాలసీలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యధిక వ్యవసాయ భూములు ఈ పాలసీ పరిధిలోకి నేరుగా వస్తున్నాయి. అయితే, ఈ వ్యవసాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ఎటువంటి హామీ ఇవ్వలేదు. అదే విధంగా పర్యావరణ పరంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న ఉప్పు భూములు, మడ అడవుల పరిరక్షణ విషయంలోనూ ప్రభుత్వం పాలసీలో మౌనం వహించింది. ఇప్పటికే ఈ భూములపై కార్పొరేట్లు కన్నేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
టూరిజం కోసం వివాదాలు లేని భూమి
పర్యాటక రంగ అభివృద్ధికోసం ఎటువంటి వివాదాలు లేని (ఎన్‌కంబరెన్స్ ఫ్రీ) భూమిని కార్పొరేట్లకు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. పర్యాటక ప్రదేశాల్లో విలాసవంతమైన హోటళ్లు, ఎగ్జిబిషన్లు, ఇతర వినోదాల నిర్వహణ కోసం ఈ కేటాయింపులు జరగనున్నాయి. ఆలయాలు, అడవులు, సముద్రతీరాలను ఆరు రకాల సర్య్కూట్‌లగా విభజించిన ప్రభుత్వం ఈ అన్ని ప్రాంతాల్లోనూ భూములు కేటాయిస్తామని తెలిపింది. ఈ తరహా భూములను రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం. వీటి కేటాయింపులకు సంబంధించిన మార్గదర్శలకు త్వరలో విడుదల చేస్తామని పాలసీలో పేర్కొంది. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ భూములుంటే వాటిని కార్పొరేట్లకు అప్పగించడం. లేని పక్షంలో భాగస్వామ్యం పేరుతో ప్రజల నుండి భూమలను తీసుకోవాలని భావిస్తున్నటు సమాచారం.
మైదానాలతో పాటు ఊరుమ్ముడి స్థలాలకు ఎసరు !
క్రీడాభివృద్ధి లక్ష్యం చెప్పి విడుదల చేసిన స్పోర్ట్స్ పాలసీలో ఇప్పటికే ఉన్న మౌలికవసతులను దీర్ఘకాలిక ప్రాతిపదికన లీజుకివ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనర్ధం క్రీడా మైదానాలను ప్రైవేటుకు అప్పగించడమన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పిపిపి పద్దతిలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు పాలసీలో పేర్కొన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఊరుమ్ముడి స్థలాలను సైతం క్రీడల అభివృద్ధికోసం ప్రైవేటుసంస్థలకు కేటాయిస్తామని, రెవిన్యూ షేరింగ్ పద్దతిలో ఈ ప్రక్రియ జరుగుతుందని పాలసీలో పేర్కొనడం స్థానిక సంస్థలు, వాటి ప్రజాప్రతినిధులతో భూములపై వివాదం రాకుండా చూడటం కోసమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇండిస్టియల్ డెవలప్‌మెంట్ పాలసీ ప్రకారం ఏర్పాటు చేసే స్పోర్ట్స్ ఎకనామిక్ జోన్‌లకు ప్రత్యేకంగా భూ కేటాయింపులు చేయనున్నారు.
అన్ని పాలసీల్లోనూ…
ఇవే కాదు. మిగిలిన అన్ని పాలసీలూ భూమి చుట్టే తిరిగాయి. కొన్నింటికి పారిశ్రామిక విధానం ప్రకారం, మరికొన్నింటికి విడిగా భూములు కట్టబెడతామని ప్రభుత్వం పేర్కొంది. ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ (ముందు వచ్చినవాళ్లకి వచ్చినట్లు రాయితీలు) పెట్టుబడులు ఆధారంగా టైలర్ మేడ్ ఇన్సెంటివ్ ( అవసరానికి తగిన విధంగా రాయితీలు)గా ఈ ప్రక్రియ సాగనుంది. అదే సమయంలో పరిహారం గురించి మాత్రం ఇప్పటికే ఉన్న విధానాలను ప్రస్తావించి ఊరుకుంది. వాటి అమలు తీరు గురించిగాని, ప్రత్యేకంగా న్యాయం చేయడం గురించి గాని ఎటువంటి ప్రస్తావన లేదు.
-వి. రాజగోపాల్