- బిజెపి రాజకీయ సందేశాలకు వేదికలుగా చట్టసభలు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట… అధికారం రాగానే మరో మాట. కమల నాథులకు నాలుక మడతపడుతోంది. పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడం ప్రజాస్వామ్య రూపమేనని ఒకప్పుడు వాదించిన బిజెపి నేతలు ఇప్పుడు అదే పని చేస్తున్న ప్రతిపక్షంపై నోరు పారేసుకుంటున్నారు. ప్రతిపక్షాల నిరసనను పార్లమెంట్ ‘హైజాకింగ్’గా ప్రధాని అభివర్ణించారు. అప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన నిరసన ఇప్పుడు పార్లమెంటును హైజాక్ చేయడం ఎలా అవుతుందో కాషాయ నేతలే చెప్పాలి.
న్యూఢిల్లీ : తన సొంత రాజకీయ సందేశాలు ఇవ్వడానికి బిజెపి నాయకులు పార్లమెంటును వేదికగా ఉపయోగించుకుంటున్నారు. బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై ప్రతిపక్ష బిజెపి సభ్యులు పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేయడాన్ని 2012 సెప్టెంబరులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ తప్పుపట్టారు. దీనిపై బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందిస్తూ పార్లమెంట్ సమావేశాలను సాగనీయకపోవడం కూడా ప్రజాస్వామ్య రూపమేనని బదులిచ్చారు. యుపిఎ-2 ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు వచ్చాయని, అందుకే సభలో ఆందోళన చేస్తున్నామని ఆమె తెలిపారు.
ఇది జరిగి ఓ సంవత్సరం గడిచింది. పార్లమెంటరీ నిబంధనలను ఉల్లంఘించారంటూ 20 మంది బిజెపి, తెలుగుదేశం సభ్యులను హౌస్ బులెటిన్‌లో ప్రస్తావించినందుకు బిజెపి ఎగువ సభలో నిరసన తెలిపి, ఆ తర్వాత వాకౌట్ చేసింది. దీనిని సీనియర్ నేత అరుణ్ జైట్లీ సమర్ధించుకున్నారు. ఆందోళన చేసిన అధికార పక్ష సభ్యులను వదిలేసి కేవలం ప్రతిపక్ష సభ్యులను మాత్రమే శిక్షించారని ఆయన మండిపడ్డారు.
కుడి ఎడమైతే…
ఈ ఘటనలు జరిగి దశాబ్ద కాలం అయింది. ఇప్పుడు అటు వారు ఇటు, ఇటు వారు అటు అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆనాటి పార్టీ నేతల మాటలు మరచిపోయారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్షాల నిరసన ‘హైజాకింగ్’కు ఓ రూపమని వ్యాఖ్యానించారు. ‘ప్రజలు తిరస్కరించిన కొందరు వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం విచ్ఛిన్నకర ఎత్తుగడల ద్వారా పార్లమెంటుపై నియంత్రణకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు’ అని విమర్శించారు. అప్పటి నుండి ఆయన మద్దతుదారులు, ఇతర బిజెపి నేతలు ఆయన మాటలను తరచూ వల్లె వేస్తూ పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపజేయడానికి ఏ రూపంలో ప్రయత్నించినప్పటికీ అది దేశాభివృద్ధిని అడ్డుకోవడానికి జరిపే కుట్రగానే భావించాలంటూ వితండవాదం మొదలు పెట్టారు.
ప్రతిపక్షాలకు దారేది ?
ఇక కార్పొరేట్ మీడియా కూడా ప్రధాని వ్యాఖ్యలను వెనకేసుకొచ్చింది. కొన్ని అంశాలపై చర్చ జరగాలన్న ప్రతిపక్ష సభ్యుల డిమాండ్ నుండి ప్రజల దృష్టిని మరలించేందుకు అది ప్రయత్నిస్తోంది కూడా. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రతిపక్ష సభ్యుల మధ్య నెలకొన్న వివాదానికి అదానీ కేంద్ర బిందువయ్యారు. ఆయనపై మోసం, ముడుపుల ఆరోపణలు మోపుతూ న్యూయార్క్ కోర్టులో ఛార్జిషీటు దాఖలైంది. కేంద్ర ప్రభుత్వానికి, అదానీ గ్రూపునకు మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్‌తో పాటు అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై చట్టసభలో చర్చించాలని ఆ పార్టీలు కోరుతుంటే ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఘర్షణలతో అట్టుడికిపోతున్న మణిపూర్‌పై కూడా చర్చించాల్సి ఉన్నదని ప్రతిపక్షాలు అడుగుతుంటే అందుకు కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో సభ నుండి వాకౌట్ చేయడమో లేదా సభను బహిష్కరించడమో తప్ప ప్రతిపక్షాలకు వేరే మార్గం లేకుండా పోతోంది.
చర్చకు ససేమిరా
రూల్ 267 కింద ప్రతిపక్షాలు అసాధారణ రీతిలో నోటీసులు అందించారు. లిస్టింగ్ అయిన సభా కార్యక్రమాలను ఆపేసి, అత్యవసర అంశాలపై చర్చకు పట్టుపట్టడానికి ఈ రూల్‌ను ప్రతిపక్షాలు వాడుకుంటాయి. సభా కార్యకలాపాలు నిలిచిపోవడానికి ప్రతిపక్షాలే బాధ్యత వహించాలని కార్పొరేట్ మీడియా నిందిస్తోంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే ముగిసిపోతాయేమోనని అది ఆందోళన వ్యక్తం చేస్తోంది. రూల్ 267 కింద చర్చకు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ నిరాకరించారు. మణిపూర్ హింస, వరదల బారినపడి నష్టపోయిన వాయనాడ్‌కు ప్రత్యేక సాయం, బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న హింసపై కూడా చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరగా ప్రభుత్వం విముఖత చూపుతోంది.
నాడు అలా…నేడు ఇలా
2012లో మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష బిజెపి డిమాండ్ మేరకు బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణంపై చర్చించేందుకు అంగీకరించారు. నిర్భయ సామూహిక అత్యాచార ఘటనపై కూడా రోజుల తరబడి చర్చ సాగింది. ఈ చర్చల కారణంగానే లైంగిక దాడి విషయంలో కొత్త చట్టం వచ్చింది. అయితే ఇప్పుడు కాషాయ పార్టీ మాత్రం పార్లమెంటును తన రాజకీయ సందేశాల కోసం వాడుకుంటోంది. సభలో చర్చల సమయంలో హిందీని ప్రధాన భాషగా రుద్దేందుకు ఆ పార్టీ ప్రయత్నించింది. ఇరువురు సభాపతులు తటస్థ పరిశీలకుల మాదిరిగా కాకుండా బిజెపి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్ష నేతల మైక్రోఫోన్లను కట్ చేస్తున్నారు. గత దశాబ్ద కాలంగా సభా కార్యకలాపాలు ఏకపక్షంగానే సాగుతున్నాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటే వారిని సభ నుండి బహిష్కరిస్తున్న ఉదంతాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.
ఇదీ ప్రభుత్వ తీరు
హిందూత్వ ప్రచార చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’ను వీక్షించేందుకు మోడీ, ఆయన క్యాబినెట్ సహచరులు ఇటీవల పార్లమెంట్ గ్రంథాలయాన్ని వేదికగా మార్చేశారు. గడచిన రెండు ప్రభుత్వాల పాలనలోనూ ప్రధాని మోడీ పార్లమెంటుకు వచ్చిన సందర్భాలు చాలా అరుదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో జరిగిన చర్చకు ఇచ్చిన సమాధానాన్ని కూడా ఆయన ఎన్నికల ప్రచారంగా మార్చేశారు. పార్లమెంటులో ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలపై ప్రభుత్వ వైఖరిని ఆయన స్పష్టం చేయలేదు. ఒకవేళ ప్రభుత్వం వైపు నుండి సమాధానాలు వచ్చినా అవి సాదాసీదాగా, దాటవేసే రీతిలో ఉంటున్నాయి. సభలో చర్చ జరపకుండానే అనేక బిల్లులను ప్రభుత్వం ఆమోదింపజేసుకుంది. బిల్లుల ప్రతులు తమకు అందలేదని, ముసాయిదాల అధ్యయనానికి తమకు తగిన సమయం ఇవ్వలేదని ప్రతిపక్షం తరచూ ఫిర్యాదు చేసింది.
ప్రజలు తిరస్కరించింది వారినే
ప్రతిపక్ష ఎంపీలను ప్రజలు తిరస్కరించారంటూ మోడీ చేసిన ప్రకటన వారి పాత్రను తక్కువ చేసి చూపడమే అవుతుంది. వాస్తవానికి ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించింది ప్రతిపక్షాలను కాదు… బిజెపినే. భారత ప్రజాస్వామ్యంపై వ్యక్తమవుతున్న ఆందోళనకు పార్లమెంట్ ‘హైజాకింగే’ నిజమైన కారణమైతే అందుకు ఎవరిని నిందించాలో అందరికీ తెలిసిందే.