వేతనాల కోసం కార్మికులకు తప్పని వెతలు
నిర్వహణకు తప్పని ఇక్కట్లు
14 ఏళ్లుగా అవే ఫిల్టర్ బెడ్స్
ప్రజాశక్తి-అనంతపురం ప్రతినిధి : ప్రతి ఇంటికి సురక్షిత తాగునీటిని అందించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ప్రతి పౌరుడికి రోజుకు సగటున 55 లీటర్ల నీటిని గ్రామీణ ప్రాంతాల్లో అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ మేరకు జల జీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ ఏడాదిలోపు అన్ని ఇళ్లకు వ్యక్తిగత కుళాయి కనెక్షన్‌తోపాటు తాగునీరు అందివ్వాలన్నది లక్ష్యం. అయితే ఇది జరగాలంటే కీలకంగా ఉండాల్సినది బహుళ రక్షిత మంచినీటి పథకాలు (సిపిడబ్ల్యుఎస్). ఉమ్మడి అనంతపురం జిల్లాలో బహుళ రక్షిత మంచినీటి పథకాలు మొత్తం 67 ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 48కాగా, సత్యసాయి జిల్లాలో 19 ఉన్నాయి. ఇందులో అత్యధిక గ్రామాలకు తాగునీటిని అందించే పథకాలు సత్యసాయి, శ్రీరామిరెడ్డి తాగునీటి పథకాలు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కింద 850 గ్రామాలకు నీటిని అందిస్తుండగా, సత్యసాయి కింద 1125 గ్రామాలున్నాయి. ఇవి కాకుండా తక్కినవి చిన్నచిన్న తాగునీటి పథకాలు నడుస్తున్నాయి.
ప్రధాన తాగునీటి ప్రాజెక్టుల నిర్వహణే అంతంత మాత్రం
జిల్లాలో అతి పురాతనమైనది సత్యసాయి తాగునీటి పథకం. 1995లో ఇది ప్రారంభమైంది. అంటే ఇప్పటి సరిగ్గా 30 సంవత్సరాలవుతోంది. అప్పట్లో వేసిన ప్రధాన పైపులైన్‌లో చాలా వరకు దెబ్బతిని ఉన్నాయి. దీంతో తరచూ అనేక చోట్ల మరమ్మతులకు గురవుతున్నాయి. ఇక శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం ప్రారంభమై కూడా 14 సంత్సరాలకుపైగా అవుతోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే లోపాలు జరిగాయని విజిలెన్సు ఎన్‌ఫోర్సుమెంటు శాఖ నివేదిక కూడా ఇచ్చింది. ఈ మేరకు ప్రారంభం నుంచి ఈ తాగునీటి పథకం పైపులైన్‌లు తరచూ పగిలిపొవడం వంటివి జరుగుతున్నాయి. ఇకపోతే ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ర్యాపిడ్ సాండ్ ఫిల్టరేషన్ బెడ్స్ వేశారు. అంటే నీటిని శుద్ది చేసే సమయంలో బెడ్స్‌లో ఇసుక ద్వారా నీరు శుద్ధి అయి వస్తూ ఉంటాయి. ఈ బెడ్స్‌లోని ఇసుక సగటున మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి మార్చాల్సి ఉంటుంది. అంటే పాత ఇసుకను తొలగించి కొత్తది వేయాలి. అప్పుడే నీటిశుద్ది సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్న మాట. అయితే వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని మార్పు చేసిన దాఖలాల్లేవు. ఈ విషయం సాక్షాత్తు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పరిశీలనలో వెల్లడైంది. ఇక నిర్వహణ, కాంట్రాక్టు విషయాల్లో అనేక లోటుపాట్లు కనిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. 2024 మార్చి నాటికి పాత కాంట్రాక్టరు గడువు ముగిసింది. అయితే అధికారులేమో పాతవారిని కొనసాగిస్తున్నామని చెబుతుండగా, కాంట్రాక్టర్లు మాత్రం తమకు పొడగించమని అధికారిక ఉత్తర్వులేవీ ఇవ్వలేదని చెబుతుండటం గమనార్హం. దీంతో నిర్వహణలోనూ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కనగానపల్లి-రామగిరి, ఓడిసి సిపిడబ్లుఎస్ స్కీమ్‌లు దాదాపు మూతపడే దశకు వచ్చాయి. మరికొన్ని ఇదే విధంగా ఉన్నాయి.
వేెతనాలకు వెతలు
ఈ మొత్తం స్కీముల్లో కలిపి సుమారు వెయ్యి మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. ప్రజలకు తాగునీటిని అందించడంలో వీరు అహర్నిశలు పనిచేస్తుంటారు. అయితే ఈ పనిచేసే కార్మికులకు నిత్యం పస్తులు తప్పడం లేదు. శ్రీరామిరెడ్డి తాగునీటి పథకంలో సుమారు 600 మంది వరకు కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఆరు మాసాలుగా వేతనాలు అందలేదు. హిందూపురం డివిజన్ పరిధిలో అయితే ఏకంగా పది మాసాలుగా వేతనాల్లేవు. ఇక పిఎఫ్ అయితే 24 మాసాలుగా చెల్లించకుండా ఉన్నారు. ఈ వేతనాల కోసం కార్మికులు నిత్యం సమ్మెలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటాయి. గతేడాదిలో మూడు సార్లు కార్మికులు సమ్మె చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేతనాలను చెల్లించాలని కోరుతున్నారు.
గత ప్రభుత్వం నిర్ణయంతో మరింత దెబ్బ
గతంలో అధికారంలోనున్న వైసిపి ప్రభుత్వం క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ అసస్‌మెంట్ పేరుతో కొంత మంది ఇంజనీర్లతో తాగునీటి పథకాల నిర్వహణపై అధ్యయనం చేయించింది. ఈ కమిటీ పరిశీలించి నిర్వహణ మెరుగుకు సలహాలు కాకుండా ఖర్చును తగ్గించుకునే అంశాలపైనే ఎక్కువగా దృష్టి సారించిందన్న విమర్శ ఉంది. అందులో కీలకమైనది కార్మికుల సంఖ్యను కుదించమని సూచించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు నడుస్తున్న మూడు షిప్టులను కాదని, దాన్ని రెండు షిప్టులకు మార్చాలని అందులో పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఈ నివేదిక అధికారికంగా బయటకు వెళ్లడవలేదు. దీని ఆధారంగా త్వరలో ఈ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించే అవకాశాలున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అదికారులెవరూ ధ్రువీకరించలేదు.