- మునుపెన్నడూ లేని విధంగా విస్తీర్ణం, లబ్ధిదారుల తగ్గుదల
- రైతు నెత్తిన ప్రీమియం భారం
- ఇన్సూరెన్స్ బాధ్యత వారిపైనే
- లక్షలాది అన్నదాతలు దూరం
- కూటమి ప్రభుత్వ కొత్త విధానం ఫలితం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : బాగా తగ్గిపోయింది. బీమా చేయించుకునే నిర్ణయాన్ని రైతుల ఇష్టాఇష్టాలకు (ఐచ్ఛికం) వదిలేయడం, అప్పటి వరకు అమల్లో ఉన్న ఉచిత పంటల బీమాను ఎత్తేసి తమ వంతు ప్రీమియాన్ని రైతులే చెల్లించాలనడంతో ఈ రబీలో బీమా చేయించుకున్న రైతుల సంఖ్య, విస్తీర్ణం మునుపెన్నడూ లేని విధంగా దిగజారింది. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన, కూరగాయ పంటలు సాగు చేయగా పది లక్షల లోపు ఎకరాలకే ఇన్సూరెన్స్ అయింది. సాగైన విస్తీర్ణంలో కేవలం ఆరు శాతానికే బీమా గ్యారంటీ దక్కింది. ఫసల్ బీమా, వాతావరణ ఆధారిత బీమా రెండూ కలుపుకొని సుమారు లక్షల మంది రైతులు ప్రీమియం చెల్లించి 9.92 లక్షల ఎకరాలకు బీమా చేయించుకున్నారు. ఇంత తక్కువ స్థాయిలో రైతులు బీమా చేయించుకోవడం ఇప్పుడే.
సమగ్రం అన్నారు…
టిడిపి కూటమి తాము అధికారంలోకొస్తే రైతులకు సమగ్ర పంటల బీమా పథకాన్ని తీసుకొస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. కౌలు రైతులకు గుర్తింపుకార్డులిచ్చి బీమా వర్తింపజేస్తామనీ చెప్పింది. పాలనలోకొచ్చాక సమగ్ర పంటల బీమా పథకం కోసం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. సదరు కమిటీ సిఫారసుల్లో రైతులు తమ వంతు ప్రీమియం చెల్లించాలంది. గత వైసిపి ప్రభుత్వంలో ఇ-క్రాప్‌లో నమోదైన రైతులందరికీ బీమాను వర్తింపజేయగా, కొత్త విధానంలో బీమా బాధ్యత రైతులపైనే పెట్టింది. తమ ఇష్టాఇష్టాలకనుగుణంగా బీమా చేయించుకోనూ వచ్చు, వద్దనుకుంటే మానేయనూ వచ్చు. గతంతో బ్యాంకులో పంట రుణం తీసుకున్న ప్రతి రైతు నుంచి బీమా ప్రీమియాన్ని మినహాయించుకునేవారు. లోన్ తీసుకున్న రైతులందరికీ బీమా తప్పనిసరి అయ్యేది. కేంద్రం ఆ నిబంధన ఎత్తేసి ఐచ్ఛికం చేసింది. బీమా కావాలను కుంటే రైతులు బ్యాంకుల వద్దకు స్వచ్ఛందంగా వెళ్లి బీమా చేయించుకోవాలంది. బ్యాంకు లోన్ తీసుకోని రైతులు సైతం బీమా చేయించుకోవచ్చంది. ఆ నిబంధనలనే కూటమి సర్కారు అమలు చేస్తోంది. బీమా రైతుల ఇష్టాఇష్టాలకు వదిలేయడం, వైసిపి ప్రభుత్వంలో ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమా పేరిట రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించగా, ఇప్పుడు రైతులు తమ జేబుల్లోనుంచి ప్రీమియం కట్టాలనడంతో ఆర్థిక ఇబ్బందులరీత్యా రైతులు పెద్దగా బీమా జోలికి పోలేదు. వాతావరణ బీమా మరీ తక్కువ.
కొత్త విధానం
2024-25 రబీ నుంచి కూటమి ప్రభుత్వం కొత్త విధానం అమల్లో పెట్టింది. వ్యవసాయ పంటలు సాగు చేసే రైతులు 1.5 శాతం, హార్టికల్చర్ రైతులు 5 శాతం వంతున ప్రీమియం చెల్లించాలి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఫసల్ బీమా కోసం లోనీ, నాన్-లోనీ కలుపుకొని 2.91 లక్షల మంది రైతులు బీమా చేయించుకున్నారు. తమ వంతు రూ.31.41 కోట్ల ప్రీమియం చెల్లించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా చెరో 81 కోట్ల ప్రీమియం జమ చేశాయి. వాతావరణ బీమాను సుమారు 15 వేల మంది రైతులు 33 వేల ఎకరాలకు ఇన్సూరెన్స్ చేయించారు. రైతులు తమ వంతు రూ.6.30 కోట్ల ప్రీమియం చెల్లించగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా చెరో 7 కోట్లు కంపెనీలకు జమ చేశాయి. కొత్త విధానం రాకముందు 2022 రబీలో సుమారు 15 లక్షల మంది రైతుల 38 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకొచ్చాయి. 2023 రబీలో 13 లక్షల మంది రైతుల 32 లక్షల ఎకరాలు బీమా పరిధిలోకొచ్చాయి. ఈ రబీలో తీవ్ర కరువు నెలకొంది. లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. సాగైన పంటలూ డ్రైస్పెల్స్ వలన దెబ్బతిన్నాయి. దిగుబడి తగ్గిపోయింది. ప్రభుత్వమే 51 మండలాల్లో కరువు ప్రకటించింది. వాస్తవానికి అంతకు కొన్ని రెట్ల మండలాల్లో కరువు విలయతాండవం చేస్తోంది. బీమా పరిధిలోకి రైతులొస్తే అరకొర పరిహారమైనా దక్కేది. ప్రభుత్వం ప్రీమియం భారాన్ని రైతుల నెత్తినేయడంతో లక్షలాది రైతులు బీమాకు దూరమయ్యారు.