60 పథకాలకు నిధులు కట్‌

Feb 3,2025 03:25 #60 schemes, #Funds cut
  • రక్షణ, రైల్వేకు అరకొర పెంపు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారీగా కోత వేసింది. మొత్తం 150 వరకూ ఈ పథకాలు ఉండగా వీటిలో 60 పథకాలకు 2024-25 బడ్జెట్‌లో కేటాయింపులు ఘనంగా చూపించినా ఖర్చు చేసే విషయానికి వచ్చే సరికి చేతులెత్తేసింది. తాజా బడ్జెట్‌లో రివైజ్డ్‌ ఎస్టిమేట్స్‌ (సవరించిన అంచానాలు)ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. సామాన్యులకు మేలు చేసే పథకాలకు కోత వేసింది. రక్షణ రంగంలో చేపట్టిన పథకాలకు అరకొర నిధులు పెంచింది.

భారీగా కోత విధించిన పథకాల్లో ముఖ్యంగా ప్రతి ఇంటికీ కుళాయి నిరందించేందుకు ఏర్పాటుచేసిన జల్‌ జీవన్‌ మిషన్‌కు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.70,163 కోట్లు కేటాయించగా, సవరించి రూ.22,694 కోట్లకు పరిమితం చేశారు. గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణానికి రూపొందించిన పిఎంఎవై(జి)కి కేటాయించిన రూ.54,500 కోట్లను సవరించి రూ.32,426 కోట్లకే పరిమితం చేశారు. పట్టణ పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిని పిఎంఎవై(అర్బన్‌) పథకంలో రూ.30,171 కోట్లను సవరించి 13,670 కోట్లకు కుదించారు. గ్రామీణ రహదారుల నిర్మాణ పథకమైన పిఎంజిఎస్‌వైకి రూ.19,500 కోట్లను సవరించి రూ.14,500 కోట్లకు కుదించారు. న్యూ ఎంప్లాయిమెంట్‌ జనరేషన్‌ స్కీంకు కేటాయించిన రూ.10,000 కోట్లను రూ.6,799 కోట్లకు తగ్గించారు. ఎల్‌పిజి డిబిటి పథకంలో రూ.1,500 కోట్లను రూ.500 కోట్లకు కోత వేశారు. విద్యార్థుల కోసం రూపొందించిన న్యూ ఇంటర్‌ షిఫ్‌ ప్రోగ్రామ్‌కు రూ.2,000 కోట్లను రూ.380 కోట్లతో సరిపెట్టారు. నదుల అనుసంధానం పథకానికి రూ.4,000 కోట్లను రూ.2,000 కోట్లకు తగ్గించారు. పిఎం పోషణ్‌కు రూ.12,467 కోట్లకు రూ.10,000 కోట్లకు కుదించారు. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకానికి రూ.2,05,250 కోట్ల నుంచి 1,97,000 కోట్లకు కోత వేశారు. వీటితో పాటు రాష్ట్రీయ కృషి యోజన, నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌, పిఎం శ్రీ, పిఎం ఉషా, అమృత్‌, ఎన్‌యుడిఎం, పిఎం ఎసెస్వి, మిషన్‌ శక్తి, పిఎం విశ్మకర్మ వంటి అనేక పథకాలకు సవరించిన అంచనాల్లో కోత వేశారు. డిమాండ్‌ అధికంగా ఉన్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, యూరియా సబ్సిడీ, ఎంఐఎస్‌ఎస్‌, దీన్‌ దయాల్‌ అత్యోదయ యోజన-నేషనల్‌ రూరల్‌ లైవ్లీహుడ్‌ మిషన్‌, నేషనల్‌ సోషల్‌ అసిస్టెంట్‌ ప్రాగ్రామ్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ్‌), నేషనల్‌ హెల్త్‌ ప్రొగ్రామ్‌, నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ నిధులు అవసరం ఉన్నా అదనపు నిధులు కేటాయించలేదు.

మరోవైపు రక్షణ రంగంలో ఎయిర్‌ క్రాఫ్ట్‌ అండ్‌ ఏరో ఇంజన్స్‌కు రూ.40,278 కోట్ల నుంచి 46,592 కోట్లకు, నావెల్‌ ఫీట్‌కు రూ.23,800 కోట్ల నుంచి రూ.25,605 కోట్లకు, మెట్రో ప్రాజెక్టులకు రూ.21,336 కోట్ల నుంచి 24,691 కోట్లు, రైల్వే ప్రాజెక్టులైన రోలింగ్‌ స్టాక్స్‌ (రైల్వే) రూ.40,314 కోట్ల నుంచి 46,252 కోట్లు, ట్రాక్‌ రెన్యువల్స్‌ రూ.17,652 కోట్ల నుంచి రూ.22,669 కోట్లకు సవరించిన అంచనాల్లో పెంచారు.

➡️